24 ఫిబ్రవరి 2013

గాజుగోళీ



















చిన్నపుడు
పారదర్శకమైన గాజుగోళీలో రంగురంగుల ప్రపంచాలని చూసినపుడు
గోళీలోకి వెళ్లిపోయి ఆ రంగుల్ని తాకితే బావుండుననిపించేది 

ఎటునుంచీ లోపలికివెళ్ళే వీలులేని
నున్నని గాజువలయం మీదనుండి నా కల జారిపోతూ ఉండేది

గోళీలో రంగులూ, గోళీ వెలుపల నేనూ
మా మధ్యన స్వచ్చమైన దిగులుతో మెరిసే క్షణాలూ  

ఒక గుర్తులేని ఉదయం
గోళీలు నా బాల్యాన్ని వెంటబెట్టుకొని
చిరునామా తెలియని లోకాలకి వలస వెళ్ళిపోయాయి

పర్వతాల్లా, మహావృక్షాల్లా
నా చుట్టూ కనిపించే పెద్దవాళ్ళలో ఒకడినైపోవాలనే కల ఒకటీ
కాలం తన ఒడిలో కూర్చోబెట్టుకొని నిజంచేసి చూపించింది
వెనుతిరిగి చూసుకొంటే
బాల్యాన్ని కోల్పోవటమే ఉంటుంది కానీ,
పెద్దవాళ్లం కావటం ఉండదు అని అర్థమయింది

ఊహల మంత్రదండాన్ని తలపై తాకించుకొని
బాల్యంలోకి వెళ్ళి నిలబడి ప్రపంచాన్ని పరికించాను ఒకసారి

విశ్వం ఒక గాజుగోళీ!
పారదర్శకమైన గాజుశూన్యంలో చలించే రంగుల ప్రపంచం ఇది!
వలసవెళ్ళిన బాల్యం తిరిగివచ్చి నన్నొక గాజుగోళీ లోపల నిలబెట్టింది!  

ఇపుడు
ఎటునుంచీ బయటికి వెళ్ళే వీలులేని
నున్నని గాజువలయం అవతల ఏముందో తెలుసుకోవాలనిపిస్తోంది!



_____________________________ 
చిత్రం: అక్బర్ 
ప్రచురణ: ఆదివారం 'ఆంధ్రజ్యోతి ' 24.2.2013 
లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి   

4 కామెంట్‌లు:

  1. మొదలే అద్భుతంగా ఉందండీ...

    "ఎటునుంచీ లోపలికివెళ్ళే వీలులేని
    నున్నని గాజువలయం మీదనుండి నా కల జారిపోతూ ఉండేది

    గోళీలో రంగులూ, గోళీ వెలుపల నేనూ
    మా మధ్యన స్వచ్చమైన దిగులుతో మెరిసే క్షణాలూ "

    అన్నారు కదా..అక్కడే ఆలోచనల్లో పడి ఆగిపోవాల్సి వచ్చింది...చాలా బాగుంది. బొమ్మ కూడా బాగా నప్పింది.

    రిప్లయితొలగించండి