మా యవ్వనరుతువులో ఆమెని చూసాను
ఆమె నన్ను చూడటమూ చూసానుదేహం నిండా, కదలికల నిండా, మాటల నిండా
మోహపరిమళాలు వ్యాపించిన రోజుల్లో
మేం ఒకరికొకరం దేవతల్లా ఎదురయ్యాము
అదిమిపెట్టిన కలల్ని
అర్ధంలేని అర్ధవంతమైన నవ్వుల్లోకి విడిచిపెట్టి
దేహాల మధ్య దూరాలని అలాగే ఉంచి మా నవ్వుల్ని కౌగలించుకోనిచ్చాము
విశాలమైన ప్రపంచం
అనంతమైన కాలం
పలు సాలెగూళ్ళతో నిండిన జీవితం
మమ్మల్ని చెరొక చోటికీ, పరస్పర స్మృతుల్లోకి విసిరేసిన చివరినిముషాల్లో
మా చూపుల్లో, నవ్వుల్లో శిశిరరుతువులేవో దోబూచులాడాయి
చాలా కాలం
కాలం పేజీలు తిప్పుతూ మా కథల్ని విడివిడిగా రాసుకుపోయింది
ఎవరికధలో మరొకరం లేము
ఎవరి చిరునవ్వుకీ, కన్నీటికీ మరొకరం కారణం కాము
ఒక కొత్త పేజీలో మా రెండుకథలూ
అకస్మాత్తుగా దారిలో ఎదురయ్యాయి
ఇప్పుడు మేం దేవతలంకాము
మాలో తప్తజ్వాలల కాంతులూలేవు
మా మేఘచ్ఛాయల నవ్వుల చివర స్మృతులేవో తటిల్లతలా మెరిసాయి
మామధ్య ఘనీభవించిన దశాబ్దాల మౌనాన్ని
ఒక్కొక్క మాటతో కరిగించుకొన్నాము
అర్ధంకాని అర్ధాలేవో నిండిన మబ్బుతునకల్లాంటి పదాలతో
మేం ఒకరినొకరం
స్త్రీపురుషుల్లా కాక, మనుషుల్లా స్పృశించుకొన్నాము
మేం ఒకరికొకరం దూరమౌతున్నపుడు
పలుచని ఆర్ద్రత మా మధ్య వ్యాపించి
మేమెప్పుడూ దగ్గరగానే ఉన్నామని గుసగుసలాడింది
బహుశా, మళ్ళీ కలుస్తాము
నక్షత్రాలు మమ్మల్ని రమ్మని పిలిచే చివరిరోజుల్లో ఎప్పుడో
అపుడు చిరునవ్వులు ఉండవు, మాటలు ఉండవు
ఒకరిచేయి మరొకరం మృదువుగా పట్టుకొంటాము
బహుశా, మాస్పర్శ వెంట
నువ్వూ, నేనూ ఒకే జీవితం అనే భావమేదో ప్రవహిస్తుంది
అపుడు, మా దేహాలు మాయమై, భావాలు మాయమై
నక్షత్రాలని కౌగలించుకొన్న నిశ్శబ్దమేదో
తనలో మమ్మల్ని మరలా కరిగించుకొంటుంది
__________________________________________
ప్రచురణ: వాకిలి సాహిత్య మాస పత్రిక 8.2.2013 ఇక్కడ క్లిక్ చేయండి
అపుడు, మా దేహాలు మాయమై, భావాలు మాయమై
రిప్లయితొలగించండినక్షత్రాలని కౌగలించుకొన్న నిశ్శబ్దమేదో
తనలో మమ్మల్ని మరలా కరిగించుకొంటుంది ....చక్కటి చిక్కని భావన
Very touching!
రిప్లయితొలగించండిThank you
తొలగించండి"నేను మగవాడనే లేత నీలి భావాన్ని
రిప్లయితొలగించండినీవు స్త్రీవనే స్వచ్ఛధవళభావానికి పూర్తిగా సమర్పించాను
గరుకు చీకటి గర్భంలో ఒంటరి విత్తనంలా ముడుచుకున్న నేను
నీ కోమల స్నేహ పరిమళంలోకి పూవులా వికసించాను" అంటూ మొదలయ్యే ఆకాశంలోని కవితొకటి గుర్తొచ్చిందండీ! పోలికలేవో ఉన్నాయని కాదూ - స్త్రీపురుషుల కలియకలూ ఎడబాట్ల నేపథ్యంలో సాగే కవితే కదా అది కూడానూ. అందుకు. ఆకాశంలో నాకు బాగా ఇష్టమైన కవితల్లో (మిగిలిన అన్నిటితో పాటు :))) అదీ ఒకటి. దాదాపు కంఠతా వచ్చిన కవిత. :)
అవును, కనిపెట్టేశారు. :)
తొలగించండిఈ రెండు కవితలకూ పోలిక ఉంటుంది. మొదలు పెట్టినపుడు తెలియలేదు కాని, కవిత నడవగా నడవగా అవే భావాలు వచ్చాయి. ఆకాశంలోని కవితని తప్పించుకొని రాయాలని ప్రయత్నించాను. అక్కడ కవి తన తరఫున మాట్లాడతాడు. ఇక్కడ ఇద్దరి తరఫునా.. తనకు కలిగే లోతైన, ప్రత్యేకమైన భావాలు పాఠకులని వదలనట్లే కవినీ వదలవనుకొంటాను. ఇంకా చెప్పవలసింది ఏదో మిగిలి ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది అలాంటి భావాలలో. అందుకే కొంత పునరుక్తి వస్తుందనుకొంటాను. తన కవిత్వాన్ని ఇంత సన్నిహితంగా పరిశీలించే మిత్రులు ఉండటం కవికి ఆనందాన్నిస్తుంది. ధన్యవాదాలు మీకు. :)