26 డిసెంబర్ 2013

నీరెండ

1
మనస్సు నిండా చికాకులతో మరొక ఉదయంలోకి మేలుకొన్నాను
తప్పూ, ఒప్పుల తీర్పులూ
వాటి వెనకాల నిలబడి నా గర్వమో, నిగర్వ గర్వమో  
తనకంటూ ఉనికి ఉన్నందుకు చేసుకొంటున్న పండుగా

తేనెతుట్టె కదిలినట్లు ఒకటే ఆలోచనల రొదలో, ఉన్నట్లుండి
ఇంటిగోడ మీద ప్రశాంతంగా పరుచుకొన్న నీరెండ నన్ను ఆకర్షించింది

పసిపాప నవ్వులాంటి నీరెండ
నా చీకాకుల ధూళినంతా తుడిచి
నన్నొక శుభ్రమైన అద్దాన్ని చేసింది కాసేపు

మనిషిలా ఎందుకు పుట్టాను,
ఈ నీరెండలా పుట్టి  
నీటిలోని ప్రతిబింబంలాంటి, నీటిమీది గాలి పలకరింపులాంటి
బహుపలుచని క్షణాలు కొన్ని గడిపి మాయమైతే సరిపోదా

2
ఏ యుగాలనాటిదీ ఈ నీరెండ
సోక్రటీసు ముఖం మీద, బుద్ధుని చిరునవ్వు మీద
భూమిని సందర్శించిన వేల జ్ఞానులు
అమాయకంగా, దయగా చేసిన ప్రవచనాల మీద
తేలుతూ వచ్చిన నీరెండే కదా ఇది

ప్రతి ఉదయమూ పలకరిస్తున్నా
మనలోపలి గాఢాంధకారాన్ని
రవంతైనా కదిలించలేకపోయిన నీరెండ కదా ఇది

3
మళ్ళీ ఆలోచనలు, మళ్ళీ ఫిర్యాదులు
మళ్ళీ వాటివెనుక గంతులేస్తూ
చీకటి పరిచే రహస్యంలో తనివితీరా స్వేచ్ఛని అనుభవిస్తున్న  
ఒకే ఒక అహం ముల్లు

ఈ తీర్పులెప్పుడు ముగించాలి, ఈ బరువెలా దింపుకోవాలి
ఇప్పుడు  చేరిన  ఈ  నీరెండని చూసిన గర్వం
దానిని పదాలలోకి ఒంపుకొంటున్న గర్వం ఎప్పటికి చెరగాలి

పదాలేమీ లేని వట్టి నగ్నమైన నీరెండని ఎలా తాకాలి
క్షణంలో నీరెండగా మెరిసి ఎలా మాయం కావాలి, మాయమెలా కావాలి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి