12 మార్చి 2018

ఏడు పుస్తకాలు : 4. ద పవర్ ఆఫ్ నౌ - ఎకార్ట్ టోలీ

జ్ఞానం, మరీ గంభీర పదమైతే, 'మెలకువ' అందాం, ఎవరికి ఎలా ప్రాప్తిస్తుందో తెలియదు. ఎకార్ట్ టోలీ తీవ్రమైన నిస్పృహలో నెలల తరబడి జీవించాడు. 29 వ యేట ఒకరాత్రి చాలా రాత్రుల్లాగే సరిగా పట్టని నిద్రనుండి తటాలున మేలుకొన్నాడు. ఇక నన్ను నేను ఎంతమాత్రమూ భరించలేననిపించింది ఆయనకి. అంతలో ఒక ప్రశ్న. నన్ను నేను భరించలేను అంటున్నానేమిటి, అంటే భరించే నేనూ, భరించబడే నేనూ రెండున్నాయా అనుకొంటాడు. అది కేవలం మేధో పరమైన ప్రశ్న కాదు, తన మౌలిక చేతనలోకి తొలుచుకుపోతున్న ఒక చూపు. అకస్మాత్తుగా ఏదో శక్తి తనని సంపూర్ణంగా లొంగదీసుకొంటున్నట్టు అనుభవమవుతూ వచ్చింది. నిద్రపట్టింది. లేచాడు. తను చూస్తున్నది తాజా ప్రపంచం. కిటికీలోంచి పక్షికూత వినిపించింది. ఆ కూత ఒక వజ్రంలా అనిపించింది. కొన్ని నెలలు ఆలోచనలూ, భయాలూ, వేదనలూ తాకలేని ఆనందంలో మునిగిపోయాడు. తరువాత తన అవగాహనని ప్రపంచంతో పంచుకోనారంభించాడు. ఆయన రాసిన పుస్తకం ఈ పవర్ ఆఫ్ నౌ. కొద్దిగా అంతరిక అన్వేషణలో ప్రవేశం ఉన్నవారికి ఈ టైటిల్ చాలా చెబుతుంది.

మిత్రుల దగ్గరనుండి సంపాదించిన పుస్తకాన్ని జిరాక్స్ తీసుకొన్నాను. పూర్తిగా చదవలేదు ఈ నాటికీ. అక్కడక్కడ చదివే సరికి ఆయన దేనిని సూచిస్తున్నారో అర్థమైంది. అది సరిపోయిందనిపించింది. అంతరిక అన్వేషణకి సంబంధించిన మౌలిక సూత్రాలు చాలా సరళమైనవి. సంక్లిష్టమైన మనసు పొరల్ని తొలగించుకోవటంలోనే ఉంది కష్టమంతా. ఆయన చెబుతున్నది అంతా టైటిల్ లోనే వచ్చింది. ఈ క్షణపు శక్తి.

గతం, భవిష్యత్తూ మానసికమని మనకి తెలుస్తూనే ఉంటుంది. వర్తమానానికి మాత్రమే భౌతికత ఉంటుంది. ఈ వర్తమానపు వాస్తవికతలో కూడా పంచ భూతా (ఫైవ్ ఎలిమెంట్స్)త్మక ప్రపంచానికి ఆధారంగా, స్థిరంగా మరొక వర్తమానం ఎప్పుడూ ఉంది. దీనినే అనంత వర్తమానం అంటారు రమణ మహర్షి. సత్యం ఇప్పుడే, ఇక్కడే ఉంది అంటారు నిసర్గదత్త. ఇంకా సులువుగా అర్థం కావాలని, ఇప్పటి లోపల ఇప్పుడు అంటారు ఆయన. మొదటి ఇప్పుడు మానసికం, ఇంద్రియ సంవేదనాత్మకం. రెండవ ఇప్పుడు ఏమీలేని లేదా అంతా తానే అయిన ఇప్పుడు. దానినే ఎకార్ట్ టోలీ ప్రధానంగా ప్రతిపాదిస్తూ వచ్చారు. కాస్త చూపు సూక్ష్మమైతే తెలుస్తుంది ఆ ఇప్పుడు, దాని అనంత శక్తి, కాంతి. కానీ, మనస్సు బూడిదై అది మాత్రమే మిగలటం అంత తేలికేమీ కాదు. ఆ దివ్యమైన వర్తమానానికి మేలుకోవటానికి ఎకార్ట్ టోలీ సూచనలు ఎంతగానో ఉపకరిస్తాయి.




ఈ పుస్తకం ఆన్ లైన్ సైట్లలో లభిస్తుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి