12 మార్చి 2018

ఏడు పుస్తకాలు : 7. ఐ యాం దట్ - నిసర్గదత్త మహరాజ్

మనస్సు సందేహాల పుట్ట, కాస్త తర్కమూ, ఊహా కూడా బాగా తెలిస్తే, ఇక అది పుట్టించే సందేహాలకి అంతే వుండదు. పెద్దగా తెలివిలేనివారికి ఇలా చెయ్యి అని చెబితే చాలు , దానినే పట్టుకొని వెళతారు, తెలివైనవారికి ఒకటి చెబితే, పది సందేహాలు వస్తాయి అంటారు శ్రీ రమణమహర్షి. చాలా సందర్భాల్లో ఆయన 'నీ సందేహాలన్నీ సరే, అవి ఎవరికి కలుగుతున్నాయంటే, నాకు అంటావు కదా, ఆ నేనెవరో చూడు' అని చెప్పేవారు. మనబోటి తెలివైనవాళ్ళు సందేహాలకి జవాబులు దొరక్క నిరాశ పడేవారు. నిన్న చెప్పినట్టు, ఎవరు చెబుతున్నా సారాంశం ఒకటే, కానీ వినే మనస్సే పరిపరివిధాలు గనుక, దానికి తగినట్టు దొరికే మాటల్ని వెదుకుతూ వుంటుంది. అలా వెదకగా దొరికినవారు శ్రీ నిసర్గదత్త మహరాజ్. 

మారుతి అనే యువకుడు కుటుంబపోషణ నిమిత్తం బొంబాయిలో చిన్న వ్యాపారం చేస్తూ, ఒక సందర్భంలో నవనాధ సంప్రదాయానికి చెందిన సిద్దరామేశ్వర్ మహరాజ్ అనే గురువుని కలుస్తాడు. ఆయన ఇచ్చిన ఉపదేశమూ, సూచనల మేరకి సాధన చేసి, రెండుమూడు సంవత్సరాలలోనే జ్ఞానం పొందుతాడు. ఆ మారుతినే నిసర్గదత్త మహారాజ్ పేరుతో పిలవబడతారు. 

దేశ, విదేశాలకు చెందిన పలువురు అన్వేషకులు ఆయనను కలిసి ప్రశ్నలడిగేవారు. నిసర్గదత్త చదువుకున్నవారు కాదు. మరాఠీ లోనే మాట్లాడేవారు. విదేశీయులు వచ్చినపుడు మౌరిస్ ఫ్రీడ్మన్, బహుశా మరికొందరూ అనువాదకులుగా పనిచేసేవారు. వారు ఆ సంభాషణలని రికార్డు చేసేవారు. అట్లా ఫ్రీడ్మన్ రికార్డు చేసిన నూటొక్క సంభాషణల ఆంగ్లానువాదమే ఈ ఐ యాం దట్. 'నేను' ను గురించి, దానిని కప్పిన మనస్సు గురించి, శరీరం గురించి మరింత సూక్ష్మం గా, అనేక విధాల వివరిస్తారు నిసర్గదత్త. చాలాసార్లు, ఇప్పటివరకూ మనం మననీ, ప్రపంచాన్నీ అర్థం చేసుకొన్నా మనుకొన్న పద్దతిని తలక్రిందులు చేస్తారు ఆయన. తర్కానికి అంతకు మించిన తర్కంతో జవాబిస్తారు. మాటల్లో అద్భుతమైన కవితాత్మకత కలిగిన ఊహలు జాలువారుతూ ఉంటాయి.


జ్ఞానం వల్ల ఏం కలుగుతుందో ఒక్కమాటలో చెప్పమంటే, నేనైతే భయం పోతుంది అని చెబుతాను. మనం చూసే, వినే సో కాల్డ్ ధైర్యాలూ, సాహసాలూ భయానికి రెండో కొసన ఉండేవే కాని, అవి భయరాహిత్యం కాదు. అట్లాంటి భయరాహిత్యం నిసర్గదత్తలో స్పష్టంగా కనిపించేది. ప్రాథమిక విద్యకూడా లేని ఆయనకి అంత సూక్ష్మ బుద్ధి ఎలా సాధ్య మయిందనేది మరొక ఆశ్చర్యం. జ్ఞానం పొందాక కూడా ఆయన చాలాకాలం తన చిన్న వ్యాపారాన్నే చూసుకొంటూ గడిపేవారు. చివరివరకూ తన చిన్న ఇంటిలోనే జీవితం గడిపారు. ఒక చిన్నగదిలో తనతో మాట్లాడవచ్చినవారితో సంభాషించేవారు. క్రిష్ణాజీకి వచ్చినట్లే, ఈయనకూ చివరిలో గొంతు కాన్సర్ వచ్చినపుడు, దేహానికీ, తనకీ సంబంధం లేనట్లే మాట్లాడేవారట. 

ఈ పుస్తకమూ, తరువాత వరుసగా నిసర్గదత్తతో మరికొందరు జరిపిన సంభాషణల పుస్తకాలూ చదివిన తరువాత, నా వరకూ, పుస్తకాల ద్వారా నేనేమి పొందాలని కోరుకొన్నానో అదంతా లభించినట్లుగా అనిపించింది. ఎనిమిదేళ్ళ క్రితం అవి చదవటం పూర్తయాక, ఇక చదువుపై ఆసక్తి పోయింది, కావలసిందేదో చదువుకొన్నాను అనే తృప్తి ఒక కారణమైతే, అంత నిశితమైన, లోతైన భావాలనో, అవగాహననో చదువుకొన్నాక మిగిలినవన్నీ వెలిసిపోయిన వాక్యాల్లా కనిపించటం మరొక కారణం.

నా టైం లైన్ చూసే మిత్రులు తరచూ నేను నిసర్గదత్త కోట్స్ షేర్ చేయటం గమనించే వుంటారు. ఇటీవలి కాలంలో నీలంరాజు లక్ష్మీ ప్రసాద్ గారు అనువదించిన నిసర్గదత్త సంభాషణలు కొన్ని 'అమృతధార ఖడ్గధార' పేరుతో పుస్తకంగా వచ్చాయి. లక్ష్మీప్రసాద్ గారు గొప్ప అవగాహన గల వ్యక్తి గనుక, చాలా బాగా అనువదించారు. మిత్రులెవరైనా ఆ పుస్తకం సంపాదించి చదవవచ్చును. ఇంగ్లీషు పుస్తకాలు అమెజాన్ లో లభిస్తున్నాయి ఇప్పుడు. పీడీయఫ్ ఫైల్స్ నెట్లో పలుచోట్ల ఉచితంగానే అందుబాటులోనే వున్నాయి.ఈ పుస్తకం ఆన్ లైన్ సైట్లలో లభిస్తుంది.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి