12 మార్చి 2018

ఏడు పుస్తకాలు : 5. అష్టావక్ర గీత - వ్యాఖ్య : స్వామి చిన్మయానంద

 భారతీయఋషుల గురించి మనకి చాలా తక్కువ మాత్రమే తెలుసనుకొంటాను నేను. వారి అన్వేషణ, దాని ద్వారా వారు గ్రహించిన సత్యాలు అద్భుతమైనవి. జీవన మౌలిక వాస్తవికతని గ్రహించటానికి వారు తమ అంతస్ఫురణను ఆశ్రయించినట్టు కనిపిస్తుంది. అది మేథ కన్నా లోతైనది, ఖచ్చితమైనది. కాలక్రమంలో అనేక సామాజిక, రాజకీయ ప్రయోజనాలతో నిండిన అంశాలు మాత్రమే జాతిపై పెత్తనం చేసినపుడు, భారతీయ దర్శనం అంటే అది మాత్రమే అని సామాన్యులు అనుకొంటున్నపుడు, ఆయా అంశాల వలన ప్రయోజనం పొందేవారూ, నష్టపోయేవారూ రెండుగా చీలి, ఇద్దరూ కూడా ఆ మౌలిక విషయాలని ప్రతిపాదించిన శాస్త్రాలని విస్మరించారని నాకనిపిస్తూ వుంటుంది. 

ఉపనిషత్తులూ, మరికొన్ని స్వరూపవర్ణన గ్రంథాలూ ఏ మహాసత్యాన్ని విశదీకరించాలని పలువిధాల ప్రయత్నించాయో అనిపిస్తుంది, వాటిని నిజమైన వెదుకులాట తో సమీపించినపుడు. వాటికి మతంతో, ఆచారవ్యవహారాలతో ఉండే సంబంధం నామమాత్రమైనది. నిజానికి, వారందరూ కూడా అన్ని రకాల కపటవిలువలపైనా తిరుగుబాటుదారులు అని కూడా అనిపిస్తుంది నాకైతే. ఒకరన్నట్టు మతం ముగిసిన చోట ఆధ్యాత్మికత లేదా తాత్విక అన్వేషణ మొదలవుతుంది.

ఒక జనకుని (సీతాదేవి తండ్రి కావచ్చు, మరొకరు కావచ్చు)కి సత్యం తెలుసుకోవాలనే కోరిక పుడుతుంది. గుర్రపు రికాబులో ఒక కాలు ఉంచి, రెండోవైపు రెండో కాలు వేసేలోగా జ్ఞానం పొందవచ్చును అనే రుషి వాక్యం సభలో ప్రస్తావనకి వస్తే, నిరూపిస్తారా అంటాడాయన పండితుల్ని. కొంత కథ తరువాత, అష్టావక్రమహర్షి ప్రవేశించి తాను నిరూపిస్తానంటారు. రాజు గుర్రపు రికాబులో కాలుంచి నిలబడతాడు, అప్పుడు, మహర్షి జ్ఞానం ఇస్తున్నాను గనుక గురుదక్షిణ ఇమ్మంటాడు. ఏమి కావాలంటే, 'నేను' 'నాది' అనుకొనే సమస్తాన్నీ తనకి అర్పించమంటాడు. భౌతికమైనవే కాక, మనస్సుతో, సంకల్పంతో సహా అర్పిస్తాడు జనకుడు. సంకల్ప రాహిత్యమే జ్ఞానం గనుక, జనకుడు జ్ఞానంతో నిండిపోతాడు. తరువాత గురు, శిష్యులిరువురికీ జరిగిన సంభాషణే ఈ పుస్తకం.

శ్రీ చిన్మయానంద వ్యాఖ్యని పెద్దగా చదివిన గుర్తులేదు. శ్లోకార్థం వరకే చదువుకొన్నాను. ప్రతి శ్లోకమూ అద్భుతమైన కవితలా తోచింది అప్పుడు. జ్ఞానికి ఈ జీవితం ఎట్లా అనుభవమౌతూ ఉంటుందో వివరంగా చర్చిస్తారు వారిరువురూ ఈ పుస్తకంలో. 
లోతైన ఏ రచన చదవటానికైనా ఆకలి లాంటి ఆర్తి కలిగి ఉండటం ముఖ్యం. జ్ఞానమనేది ఉందని నమ్మకపోయినా కూడా, ఇంతకన్నా సారవంతమైన జీవితానుభవం ఉంటుందా అనుకొంటూ వేసట చెందిన హృదయాలైనా ఈ పుస్తకాన్ని సమీపిస్తే, వారికి ప్రగాఢ మైన శాంతి కలుగుతుందని అనిపిస్తుంది నాకు.




పద్మినీ జ్యూయలర్స్, భీమవరం వారి వద్ద ఈ పుస్తకం లభిస్తుంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి