12 మార్చి 2018

పుస్తకాలూ - నేనూ

శరత్ బాబు రచనలతో మొదలైన సీరియస్ సాహిత్య పఠనం దాదాపు రెండు దశాబ్దాలు సాగింది. తరువాత ఒక దశాబ్దం ఎంపిక చేసుకొన్న పుస్తకాలు మాత్రమే చదవగలిగాను. చివరగా ఇష్టంగా చదువుకొన్నది నిసర్గదత్త మహరాజ్ సంభాషణల పుస్తకాలు. సుమారు ఏడెనిమిదేళ్ళుగా చదవటం ఆగిపోయింది. ఇప్పుడు చదవమంటే, బడి పుస్తకాలు చదవమన్నంత బాధ.

చదవటం కన్నా చూడటం, స్పందించటం ముఖ్యం. వాటికన్నా లోనికి చూసుకోవటం ముఖ్యం. లోచూపు చిక్కితే, తనకి కావలసినవి చాలాసార్లు తనకే తెలుస్తాయి. దానిని సహజ జ్ఞానం (intuition) అనవచ్చునేమో. ఇదేమీ ప్రత్యేక విద్యా / ప్రతిభా కాదు. అది ఎప్పుడూ ఉన్నదే. లోపలి దుమ్మునీ, గట్టిపడిన భావజాలాలనీ, ఉద్వేగాలనీ, వాటి వెనుక అంతకన్నా బిగుసుకుపోయిన అహంభావాన్నీ ఎంత వదులుకోగలిగితే, అంతగా ఆ స్ఫురణ ప్రకాశిస్తుంది.

కానీ, బహుశా, చదవటంలో ఏమీ లేదు అని తెలిసే వరకైనా, చదవటం మంచిది. దాని వలన మేథ వికసిస్తుంది. చూపు విస్తృతమౌతుంది, అనేక తలాలని తాకుతుంది. అనుభవశక్తీ, వ్యక్తీకరణశక్తీ సున్నితమౌతాయి. పదును దేరుతాయి. తరువాత, వాటితోనే ఆగిపోకుండా, జీవితానుభవంలోకి ప్రయాణించాలి.

ఫేస్ బుక్ లో సునీతా రత్నాకరం గారు ఏడు పుస్తకాల ఆటకి (చాలెంజ్ పదం బాగోలేదు నాకు) టాగ్ చేసినప్పుడు, జీవితంలో ఆయా దశల్లో బాగా లోతుగా తీసుకొన్న రచనలేవా అని చూసుకొంటే, సుమారు ఇరవై పుస్తకాలు గుర్తొచ్చాయి. మరికాస్త జ్ఞాపకంలోకి వెళితే మరో ఇరవై కూడా ఉండవచ్చును. కొన్నిసార్లు పుస్తకం అంటే రచయిత / కవి అని కూడా అర్థం. :) చివరి ప్రభావాలకి సంబంధించిన ఏడు పుస్తకాల గురించి చెప్పదలిచాను గనుక, మిగిలిన లిస్టు ముందుగా రాస్తున్నాను.

బాగా చదివిన రోజుల్లో ఇంగ్లీషు అంతగా రాకపోవటమూ, కొద్దిగా ఇంగ్లీషు వచ్చాక, చదివే ఆసక్తి పోవటమూ జరగకపోతే ప్రపంచ సాహిత్యం బాగా చదువుకొందును కదా అనిపిస్తుంది ఒక్కోసారి. కానీ, దానికేమీ దిగుల్లేదు.

ఇంతకన్నా రాయటం చాతకాకనో, ఇది రాయటం చాతనయో కవిత్వం రాసుకొంటున్నాను కాని, వ్యక్తిగతంగా రచనా ప్రక్రియల్లో నవలకి అభిమానిని. అంత ఊహ ఎలా చేస్తారా అని ఆశ్చర్యం ఏ టాల్ స్టాయో, చండీ దాసో గుర్తుకు వస్తే. తరువాత వ్యాసం, కథ. ఆ తరువాతనే కవిత్వం. ఈ లిస్టు కూడా ఆ విషయాన్నే ధ్రువ పరుస్తుంది. :)

శరత్ శ్రీకాంత్, ఇతర నవలలు, కథలు  
విశ్వనాథ నవలలు, కథలు  
ప్రేంచంద్ నవలలు 

శ్రీశ్రీ మహాప్రస్థానం
చలం మ్యూజింగ్స్, స్త్రీ, ప్రేమలేఖలు, బిడ్డల శిక్షణ
సంజీవదేవ్ దీప్తిధార, ఇతర వ్యాసాలూ
గోపీచంద్ పోస్టు చెయ్యని ఉత్తరాలు 
నండూరి రామమోహనరావు విశ్వదర్శనం 

వడ్డెర చండీదాస్ అనుక్షణికం
విక్టర్ హ్యూగో బీదలపాట్లు
టాల్ స్టాయ్ యుద్ధమూ శాంతి
అలెగ్జాండర్ కుప్రిన్ యమకూపం
అలెక్స్ హేలీ ఏడుతరాలు
అలెగ్జాండర్ డ్యూమా కౌంట్ ఆఫ్ మాంట్ క్రిష్టో

ఖలీల్ జిబ్రాన్ ప్రాఫెట్, ఇతర కవిత్వం  
టాగోర్ గీతాంజలి, మిగతా కవిత్వం 
చలం వెలుగురవ్వలు
మసనోబు ఫుకువోకా గడ్డిపరకతో విప్లవం
జిడ్డు కృష్ణమూర్తి కామెంటరీస్ ఆన్ లివింగ్ 
మహేష్ భట్  యూజీ కృష్ణమూర్తి 
రిచర్డ్ బాక్ నవలలు
పాలో కోయిలో నవలలు