02 అక్టోబర్ 2020

కవిత : పాతబడని..

చీకటి పొదిగిన సూర్యునిలోంచి
తెల్లని రెక్కలు విదిలించుకొని లేచిన
వెలుతురు పక్షి
తూర్పు ఆకాశం నుండి పడమటికి ఎగురుతోంది

పగటికాంతి పొదిగిన చంద్రునిలోంచి
చల్లని రెక్కలు మెల్లగా కదిలించి కదిలిన
వెన్నెల పక్షి
తూర్పు తీరం నుండి పడమటికి ఈదుతోంది

ఎందరు కవులు ఊహించి వుంటారో
అక్షరాలా ఇలానో, అటూ ఇటుగానో

ఊహలు పాతబడతాయి గానీ
ఊహించటం పాతబడదు
అనుభవాలు పాతబడతాయి గానీ
అనుభవించడం పాతబడదు

కన్నీళ్లూ, చిరునవ్వులూ పాతబడతాయి గానీ
నవ్వటమూ, ఏడవటమూ పాతబడవు
జీవితం పాతబడుతుంది గానీ
జీవించటం పాతబడదు

అవును, జీవించటం పాతబడదు
దేహం పాతబడినా
నాకు నేను ఎప్పటికీ పాతబడనట్లు..

ప్రచురణ : పాలపిట్ట, సెప్టెంబర్ 20


కవిత : నాది

నాది కావాలనో
నాది కాకుండా పోకూడదనో
నీ శ్వాసల్లో నూటికి తొంభై ఖర్చు చేస్తావు గానీ

నాది అనుకున్నదల్లా
నీ శ్వాసపైనే కూర్చోవటం గమనించావా
నీకు గాలాడకపోవడం చూసుకున్నావా

అప్పుడప్పుడూ
బహుశా, ఎప్పుడూ కూడా
ఊపిరాడని నిన్ను వదిలించు కోవటానికి

వినోదాలూ, విహారాలూ
స్నేహాలూ, కబుర్లూ
బాధ్యతలూ, సరదాలూ
బాధలూ, సందర్భాలూ అంటూ

నీనుండి నువ్వే
తప్పించుకు తిరగటం కనిపెట్టావా

నాది ఒక గోడ
దాని కొలతలు అనంతం
దాని ముందు ఆకాశం ఒక పిట్ట

ఈ కథ నిజంగా నీకు అర్థమైన క్షణంలో
నువ్వు గోడ మీద ఉంటావు

ప్రచురణ : కవిసంధ్య సెప్టెంబర్ 20