19 నవంబర్ 2024

కవిత : పుట్టినరోజున

1
ఇవాళ నీకు నువ్వే గుర్తుకు వస్తుంటావు
ఉదయం పూలూ, చినుకులూ రాలినట్టు
ఒకనాడు ఇక్కడికి రాలావు
వాటికి కరిగి, మాయమైపోవటం తెలుసు
మరి నీ సంగతి అంటారెవరో

2
తొలిసారి చుట్టూ చూసి వుంటావు
కొంత ఆశ్చర్యంగా, కొంత భయంగా
వాటి నుండి బయటికి రాలేదు ఇప్పటికీ
బయటపడటం చాతకాలేదా, ఇష్టం లేదా 
అని నవ్వుతారు నీలోంచి

3
ఋతువుల చివర మిగిలేవి
వెలితీ, దిగులూ అని తెలిసివచ్చినా
బతుకు మీద తీపి ఎందుకో అర్థం కాదు
ఆడుకుందాం రారమ్మని సూర్యకాంతి పిలుస్తుందా
నిన్నటి గాయాలు మరిచి ఎగురుతూ వెళతావు 

4
కనులు తెరిచింది మొదలు 
నిన్ను కనుగొనే మనిషి కోసం వెదికావు
కాలమింత గడిచినా ఇంకా తెలియరాలేదు
నువు మాత్రమే నిన్ను కనుగొనగలవని
మృదువుగా దగ్గరకు తీసుకోగలవని

5
బతుకు ఒక నైరూప్య చిత్రం
అర్థాల ఇరుకు నుండి ఎంత విముక్తమైతే
అంత సారవంతం అవుతుంది 
ఎంత స్వేచ్ఛలోకి మేలుకొంటే 
అంత ఆర్ద్రతలోకి వికసిస్తుంది

6
ఆ చినుకుల్ని అలా రాలనీ
చూడకు వాటివంక
పూలని పాడుకోనీ రంగుల పాటలు
వినకు వాటిని
వాటి స్వేచ్ఛకి వాటిని వదిలి
నీ స్వేచ్ఛలో ఉండిపో 

ఇపుడు చూడు
జీవితం తల్లి గర్భాలయం, కదూ..

21.11.23
ప్రచురణ : సారంగ 15.11.24

18 నవంబర్ 2024

కవిత : క్షణం పుట్టి..

ఇంత దీర్ఘమైంది కాదనుకుందాం జీవితం

ఇన్ని నలుపూ, తెలుపూ, రంగుల రోజులు
ఇన్ని ఋతువులు, వర్షాలు, 
ఎడారులు, అడవులు, నదులు, కొండలు,
ఇన్ని జీవులు, వేదనలు, ఉత్సవాలు
ఇందరు మనుషులు, ఊహలు, సంవేదనలు
ఇంత పెద్దది కాదు అనుకుందాం

జీవితం   మరీ క్షణికం అనుకుందాం

ఒక చూపుగా పుడతాం
ఆకు రాలటం చూస్తాం, మాయమౌతాం
వినటంగా పుట్టి
పక్షి కూయటం వింటాం, నిశ్శబ్దంలో కలుస్తాం
స్పర్శగా పుట్టి 
సెలయేటి పలుచని తడి తాకి, చిట్లిపోతాం
వాసన గ్రహించే ప్రాణిగానో, 
రుచి తెలిసే జీవిగానో పుట్టి
అనుభవం తెలుస్తూనే అదృశ్యమౌతాం

జ్ఞాపకం లేదు, ఎదురుచూపు లేదు
భయం, వెలితి, కలగనటం లేవు
క్షణ మాత్రపు 
జన్మ, అనుభవం, ముగింపు

సముద్రగర్భంలో, ప్రాణం పోసుకున్న అలల్లా 
దేహస్పృహ లేకుండా హాయిగా ఈదే చేపలు
తెలియక ఏ వలలోనో చిక్కుకుపోయినట్టు
ఇంత ఖేద పడుతున్నాం గానీ

జీవితం నిజంగా పెద్దదీ, సృష్టికంటే బరువైనదా
చాలా చిన్నదీ, ఊహకంటే తేలికైనదా

1.11.24 11.18 PM 



15 నవంబర్ 2024

కవిత : ఇంతేనా

ఇంత పెద్ద విశ్వంలో ఇద్దరే ఉన్నారనుకుందాం
అతను. ఆమె.
ఈ ఊహకి జీవం రావటానికి
అతను లేక ఆమెను నేనుగా ఊహించుకుందాం

మెత్తని భూమీ, పచ్చదనం
చల్లని నీరూ, నల్లదనం
తేలిన ఆకాశం, తేలుతున్న నీలిమా 
చిక్కబడుతున్న రాత్రీ, చుక్కల్లో దాగే కాంతీ

కాస్త ఆకలీ, కాస్త ఆహారం
కాస్త కోరికా, కాస్త సౌఖ్యం
కాస్త భయం, కాస్త మరపూ 

ఏమీ తోచని పగటిభాగంలో 
గాలిలో వారూ, వారిలో గాలీ 
ఏమీ అవసరం కాని రాత్రిభాగంలో
చీకటిలో వారూ, వారిలో చీకటీ 

రోజులు గడుస్తాయి
నెలలు, ఏడాదులు, వయసులు 
పుట్టడం తెలీకుండా పుట్టినట్టే
వెళ్ళటం తెలీకుండా వెళ్ళిపోతారు

భూమి ఉందో, లేదో తెలీదు
నీరు ఉందో, లేదో తెలీదు
ఆకాశమూ, చుక్కలూ తెలీదు
జీవితం ఉందో, లేదో తెలీదు

అలాంటిదొకటి గడిచిందని తెలీదు
ఉత్త ఖాళీ, ఖాళీ కూడా తెలీదు

కదా..
ఇప్పుడేం చేద్దాం


- బివివి ప్రసాద్
- ప్రచురణ : ఈమాట, నవంబర్ 2024

05 నవంబర్ 2024

కవిత : మనలో ఒకడు

ఎదుగుతున్న మనలో ఒకడిని చూసి గర్వించాలి

మన మెలకువలన్నీ వృధాగా ఒలకబోసుకుంటున్నపుడు
అతను ప్రతి మెలకువనీ ప్రార్ధనగా మలచుకొన్న 
వైనాన్ని గమనించాలి
మనం దీపాలార్పి పడుకొన్నపుడు
అతను పగలు కోసం చీకటిలో వెదకటం తెలియాలి

ఒక కన్ను మూసి, ఒక కన్ను తెరచి కలలు కనే మన మధ్య
రెండు కళ్ళూ తెరిచి కలల్లోకి దారి కనుగొనే 
అతని ఉత్సాహం చూడాలి
వేయి మొరటు చేతులు రాల్చినా
మరింత దుఃఖ రసం పీల్చుకొని
మరి వేయి పూలుగా వికసించి, పలకరించే
అతని ఆర్తి చూడాలి

రాబోయే యుగాలని మనకోసం నిద్ర లేపుతున్నందుకు
మనలోని ఒకడిలో మనని చూసుకొని ప్రేమించాలి

ఆకాశం సంపుటి నుండి

One Among Us

Must feel proud of the one among us reaching heights

Must note the way he converts every day into a prayer
when we vainly spend all our days 
Must know how he searches for daylight at night
when we put out all lights and go to sleep.

Marvel at his agility as he finds a way into dreams
with his eyes open
in the midst of people who dream 
with one eye open, another closed.
Must see his empathy at blooming into a thousand flowers
even when plucked by a thousand coarse hands.

For waking up the future ages for our sake
Must love him, one among us,  
Seeing ourselves in him!

Translation: Algati Thirupathi Reddy