16 డిసెంబర్ 2024

కవిత : సృష్టి

ఖాళీ మనసులో కొన్ని రంగులు ఒంపు
అవి ఆకాశమూ, గాలీ, నీరూ 
కాంతీ, చీకటిలో వెన్నెలా

రంగులపై కొన్ని గీతలు గీయి
నదులూ, కొండలూ, మైదానాలూ 
ఉదయాస్తమయ మేఘాలూ, పాలపుంతలూ 

గీతలను కొంచెం కదిలించి చూడు 
చెట్లూ, పిట్టలూ, చేపలూ 
చీమలూ, ఏనుగులూ, మనుషులూ

కదలికలలో ఉద్వేగాలు కలుపు
చిక్కగా, లేతగా, తీవ్రంగా, తేలికగా
మంచీ, భయమూ, బాధా, ప్రేమా

ఇంతకన్నా ఊహించేదేమీ లేదు
నువ్వైనా, దేవుడైనా

మళ్ళీ మొదటికి రావలసిందే
నిద్రలోనో, మరణంలోనో, జ్ఞానం లోనో 


- బివివి ప్రసాద్
ప్రచురణ : ' మెహఫిల్ ' మన తెలంగాణ 16.12.24



02 డిసెంబర్ 2024

కవిత : ఉండటం

దీనికి అర్థం ఉందని 
నమ్మటం నుండి బయటపడాలి
ఆర్థాలకి అర్థమేమిటి
ఈ నమ్మకాలకి మొదలేమిటి

చివరికి మంచి గెలుస్తుందనే
చిన్నప్పటి భ్రమని వదిలించుకోవాలి
ఏ చివర, ఎవరికి మంచి
ఎంతకాలం గెలుస్తుంది 

ఈ కథకి ముగింపు ఉంటుందనే 
ఉద్వేగం నుండి తెప్పరిల్లాలి
మగతనిద్రల్లోని కలలు ఎక్కడ ముగిశాయి

తలపై బెలూనులా ఎగురుతోంది గగనం
మన తలల్లోని ఊహల్లాంటివి 
ఎందరిలో, ఎన్నిటిని చూసింది

కాంతినీ, చీకటినీ విరజిమ్మి
రంగుల్ని శూన్యంలో ఆరబోసి
చివరికి ఏమీ కాకపోవటంలో విశ్రమిస్తోంది

ఊరికే ఉంటే చాలనుకొంటాను
ఆకు కింద నీడ ఉన్నట్టు 
ఎండలో రంగులు వున్నట్టు
చీకటిలో నలుపు వున్నట్టు

ఈ అక్షరాల వలలోంచి బయటకు వెళ్ళాక
ఏది మనసుకి తగులుతుంది
లేదా తగలటం లేదు

28.7.24
ప్రచురణ : పాలపిట్ట, నవంబర్ 2024

కవిత : ఈ క్షణమిలా..

ఈ క్షణం అద్భుతం
ఎండ వాలే, వాన కురిసే, వెన్నెల జారే ఒక క్షణం
దీని కోసమే పుట్టావు, పెరిగావు
ఏడ్చావు, నవ్వావు, భయాన్ని దాటావు,
మనుషుల్ని అల్లుకొన్నావు చుట్టూ,
కావాలనుకొన్నవి పొందావు, పొందినవి కోల్పోయావు 

తీరా ఈ క్షణం నీ కనుల ముందు నిలిచి
ఏమి ఆజ్ఞ అన్నపుడు కనులు మూసుకొన్నావు

నీ దోషమేమీ కాదు
దీని కాంతి అటువంటిది
సౌందర్యం, జీవనహేల అలాంటివి

భరింపరాని మహోధృత వేగంతో, వత్తిడితో
ఈ క్షణం నిన్ను ప్రేమించినపుడు
కనులు మూసుకొంటావు
జ్ఞాపకాల్లోకో, కలల్లోకో తప్పుకొంటావు

అప్పుడు వచ్చిన కవి
పదాలలో నింపి దానిని నీ ముందు పెడతాడు
చిత్రకారుడు రంగుల్లో, గీతల్లో ఒంపి
నీ కళ్ళ ముందు పరుస్తాడు

అప్పుడు అంటావు కదా
అవును ఇదే నేను చూసింది
వాళ్ళు ఎంత అద్భుతంగా పట్టుకొన్నారు అని

నీపై వీస్తున్న లేతగాలివంటి క్షణం 
ఇప్పుడు కూడా 
నన్ను పట్టుకోలేకపోయావని నవ్వుతుంది

వాళ్ళూ అంతే, నాలో కరిగి, నేనై పోతే
ఆ పిచ్చి పనుల్లో కాలయాపన చేసేవారు కాదు 
అని జాలిపడుతూ మాయమవుతుంది

23.10.24
ప్రచురణ : కవిసంధ్య, సంచిక 51, నవంబర్ 2024