02 డిసెంబర్ 2024

కవిత : ఈ క్షణమిలా..

ఈ క్షణం అద్భుతం
ఎండ వాలే, వాన కురిసే, వెన్నెల జారే ఒక క్షణం
దీని కోసమే పుట్టావు, పెరిగావు
ఏడ్చావు, నవ్వావు, భయాన్ని దాటావు,
మనుషుల్ని అల్లుకొన్నావు చుట్టూ,
కావాలనుకొన్నవి పొందావు, పొందినవి కోల్పోయావు 

తీరా ఈ క్షణం నీ కనుల ముందు నిలిచి
ఏమి ఆజ్ఞ అన్నపుడు కనులు మూసుకొన్నావు

నీ దోషమేమీ కాదు
దీని కాంతి అటువంటిది
సౌందర్యం, జీవనహేల అలాంటివి

భరింపరాని మహోధృత వేగంతో, వత్తిడితో
ఈ క్షణం నిన్ను ప్రేమించినపుడు
కనులు మూసుకొంటావు
జ్ఞాపకాల్లోకో, కలల్లోకో తప్పుకొంటావు

అప్పుడు వచ్చిన కవి
పదాలలో నింపి దానిని నీ ముందు పెడతాడు
చిత్రకారుడు రంగుల్లో, గీతల్లో ఒంపి
నీ కళ్ళ ముందు పరుస్తాడు

అప్పుడు అంటావు కదా
అవును ఇదే నేను చూసింది
వాళ్ళు ఎంత అద్భుతంగా పట్టుకొన్నారు అని

నీపై వీస్తున్న లేతగాలివంటి క్షణం 
ఇప్పుడు కూడా 
నన్ను పట్టుకోలేకపోయావని నవ్వుతుంది

వాళ్ళూ అంతే, నాలో కరిగి, నేనై పోతే
ఆ పిచ్చి పనుల్లో కాలయాపన చేసేవారు కాదు 
అని జాలిపడుతూ మాయమవుతుంది

23.10.24
ప్రచురణ : కవిసంధ్య, సంచిక 51, నవంబర్ 2024

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి