21 మార్చి 2025

కవిత : సున్నితం

ఇతరుల స్వేచ్ఛలో 
ఒక అంగుళమైనా ఆక్రమించలేని
అతి సున్నితమైన సమాజాన్ని కలగంటావు

జరుగుతుందీ, జరగదని కాదు
కలగనటం సున్నితమైన పిలుపు
పూవు లేత ఎండని పిలిచినట్టు
లేత ఎండలాంటి సీతాకోకని పిలిచినట్టు
సీతాకోకలాంటి నీ చూపుని పిలిచినట్టు

సున్నితత్వం బోధిస్తే వచ్చేది కాదు
నిర్బంధించి నేర్పేది కాదు
భయపెట్టి తీర్చిదిద్దేది కాదు
అది లోపలి పొరల్లోకి మెలకువ
చేతన తనని విప్పుకోవటం

నువు సహజంగా సున్నితం
లేత ఎండకన్నా, పూవు వికసించటం కన్నా
సీతాకోక రెక్కలపై వాలే చూపు కన్నా

నీలోకి నువు
మరికాస్త దగ్గరగా జరిగినప్పుడు,
నిన్ను నువు ముడుచుకొన్నపుడు,
వాన వెలిసాక ముడిచిన గొడుగులో
పొరలు విప్పుకొనే వెచ్చదనంలా
నీలోకి నువు చేరుతున్నపుడు

నీకు తొలిసారి తెలుస్తుంది
నిజానికి నువు చాలా సున్నితమని,
చిరుగాలికి గాయపడేంత లలితమని,
తొలి వేకువ వెలుతురు కూడా
నిను తాకటానికి జంకుతుందని

నువు ఎంత సున్నితమో 
నీకు తెలిస్తే చాలు
మనిషి కథ సుఖాంతమౌతుంది

ఆ క్షణం కోసం కదా
ఇంత విశ్వం 
నానమ్మ కథలోని సుఖాంతం కోసం
పిల్లలు ఎదురుచూసినట్టు చూస్తోంది 

14.1.25 11.17PM 

ప్రచురణ : ' స్నేహ ' ప్రజాశక్తి 16.3.25



కవిత : లొంగిపోవటం

 1
ఏదైనా కావచ్చు
ఒక అందమైన ఉద్వేగం, శబ్దం, దృశ్యం
నిన్ను మొత్తంగా మారుస్తుంది
నీలో మరణిస్తున్న దేన్నో నిద్రలేపుతుంది

నువు పసిపాదాలతో 
నడక మొదలుపెట్టాలని చూస్తావు
ఇంత పిరికి, క్రూర ప్రపంచంలో

ఇదంతా అసంగతమని తెలుస్తుంది
ఇంతకన్నా దారి లేదని కూడా

2
రాలుతున్న పచ్చదనం, 
వెలిసిపోతున్న పసుపురంగు శబ్దం,
జారగిలబడుతున్న ముదురెరుపు ప్రేమలు
ఏవీ నీతో చివరి వరకూ నడవవని తెలుసు
నువు వాటి చివరలకి నిలబడవని కూడా

విసుగుపుట్టే రోజున
బుర్రలేని సినిమాకి వెళ్ళినట్టు 
ఈ లోకంలోకి తీరికగా చేరతావు 
ఇది బాలేదు, అయినా వెళ్ళలేవు
అట్లాగని ఉండాలన్న ఉబలాటం లేదు

3
తెలియని దేదో ఉంది చూసావా
అక్కడ వుంది బతుకు రహస్య మంతా
అది రమ్మని పిలుస్తుంది, కావాలని వినవు

నీకే ఇంత తెలివి వుంటే
నిన్ను కన్న తెలివికి ఎంత ఉండాలి

4
ఆకలేసిన బోనులోని సింహం లొంగినట్టు
జీవితానికి లొంగిచూడు
తరువాత జరిగే దేనికీ 
నువు యజమాని కాదు గనక
నీకు చెప్పాల్సిందేమీ లేదు

27.1.25 00.25AM 
ప్రచురణ : ఉదయిని 15.3.25

కవిత : దుఃఖ మూలం

1
చాలా రాత్రులు ప్రార్థించావు
నిదురించే ముందు దైవాన్ని
ఇది కడపటి నిద్ర కావాలని

మరుసటి ఉదయాలు
మెలకువ వస్తూనే తెలుస్తుంది
దైవానికి నీ ప్రార్థన చేరలేదని

జీవితంలో ఏదో బాధించి కాదు
జీవితమే బాధనిపించి

2
ఇలాగే గడిచాయి వేల రోజులు
అదే వెలుతురు, చీకటి
అవే రంగులు, నీడలు

చాలా పాతబడిన ఆకాశం
ఆకాశంలోకి పాత ఉద్యోగుల్లా 
వచ్చి, వెళ్ళే ఋతువులు

పాతబడిన మనుషులు
మీట నొక్కినట్టు వెలిగి, ఆరే
వారి ప్రేమలు, ఉద్వేగాలు

3
ఇంతే కదా జీవితమని అన్నావు 
జీవితంతో చాలాసార్లు
అమ్మా, ఎందుకు కన్నావని
బిడ్డ తల్లితో అన్నట్లు

ఏనాడూ జవాబు రాలేదు
జవాబు లేకపోవటమే జవాబని 
నీకు తెలియలేదు

4
రైలు వచ్చే సమయం 
సమీపించే కొద్దీ తెలుస్తుంది

ఇప్పటి వరకూ పాదాలు ఉంచిన 
ఊరు ఎంత అందమైనదో,
వీడ్కోలు చెప్పే ఆత్మీయులు
ఎంత విలువైనవారో

5
చెబుతావు చూడు ఇప్పుడందరికీ
జీవితం అద్భుతం, ప్రేమించండి
జీవులు అమాయకులు, ప్రేమనివ్వండని 

6
గగనంలో తేలిన ఇంద్రధనువు 
గగనంలోనే మునిగినట్టు
జీవితంలోంచి తేలిన నువ్వు
జీవితంలోనే మునుగుతావు

విడిగా ఉన్నదెక్కడ
ఇది తెలియక కదా ఇంత దుఃఖం

7
ఇంతకీ, ఇది ఎవరి దుఃఖం

8.12.24 10.56 PM

ప్రచురణ : సారంగ 15.3.25