21 మార్చి 2025

కవిత : దుఃఖ మూలం

1
చాలా రాత్రులు ప్రార్థించావు
నిదురించే ముందు దైవాన్ని
ఇది కడపటి నిద్ర కావాలని

మరుసటి ఉదయాలు
మెలకువ వస్తూనే తెలుస్తుంది
దైవానికి నీ ప్రార్థన చేరలేదని

జీవితంలో ఏదో బాధించి కాదు
జీవితమే బాధనిపించి

2
ఇలాగే గడిచాయి వేల రోజులు
అదే వెలుతురు, చీకటి
అవే రంగులు, నీడలు

చాలా పాతబడిన ఆకాశం
ఆకాశంలోకి పాత ఉద్యోగుల్లా 
వచ్చి, వెళ్ళే ఋతువులు

పాతబడిన మనుషులు
మీట నొక్కినట్టు వెలిగి, ఆరే
వారి ప్రేమలు, ఉద్వేగాలు

3
ఇంతే కదా జీవితమని అన్నావు 
జీవితంతో చాలాసార్లు
అమ్మా, ఎందుకు కన్నావని
బిడ్డ తల్లితో అన్నట్లు

ఏనాడూ జవాబు రాలేదు
జవాబు లేకపోవటమే జవాబని 
నీకు తెలియలేదు

4
రైలు వచ్చే సమయం 
సమీపించే కొద్దీ తెలుస్తుంది

ఇప్పటి వరకూ పాదాలు ఉంచిన 
ఊరు ఎంత అందమైనదో,
వీడ్కోలు చెప్పే ఆత్మీయులు
ఎంత విలువైనవారో

5
చెబుతావు చూడు ఇప్పుడందరికీ
జీవితం అద్భుతం, ప్రేమించండి
జీవులు అమాయకులు, ప్రేమనివ్వండని 

6
గగనంలో తేలిన ఇంద్రధనువు 
గగనంలోనే మునిగినట్టు
జీవితంలోంచి తేలిన నువ్వు
జీవితంలోనే మునుగుతావు

విడిగా ఉన్నదెక్కడ
ఇది తెలియక కదా ఇంత దుఃఖం

7
ఇంతకీ, ఇది ఎవరి దుఃఖం

8.12.24 10.56 PM

ప్రచురణ : సారంగ 15.3.25

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి