చాలామంది రాలిపోతారు ఎండిన ఆకుల్లా
నావాళ్ళ లోంచి, ఉద్వేగాల్లోంచి, కలల్లోంచి
నిన్ను పంచుకోవటంలోంచి,
ఒకరిని చూడగానే ఒకరు వికసించడం లోంచి..
వాళ్ళ లోంచి నువ్వు కూడా అలానే..
ఇది దీర్ఘమైన ప్రయాణం అనిపిస్తుంది అప్పుడు
చాలా నడిచి వచ్చావనీ,
ఇప్పటికే అనేక పగళ్ళు, రాత్రులు చూసావనీ
చాలాసార్లు నీపై ఎండ వాలిందనీ, వాన కురిసిందనీ
మంచు నిన్ను కప్పిందనీ, వెన్నెల నీ కలల్ని పాడిందనీ,
దుఃఖపు ఏకాంతాలెన్నో రుచి చూసావనీ గుర్తొస్తుంది
తెలియని ఇంటివైపుగా నీ చూపు తిరిగిందని
లోపల ఎక్కడో తోస్తుంది
తెలియకుండా ముగింపుని ప్రేమించటం మొదలవుతుంది
. . .
చాలామంది కలుస్తారు, విడిపోతారు
మళ్ళీ కలుస్తారు జ్ఞాపకాల్లా
జ్ఞాపకమూ, ఇవాళ్టి మనిషీ ఒకరు కారని తోస్తుంది
నీకూ, జ్ఞాపకాల్లోని వాళ్ళకీ కూడా
చూసావా, ఇది అద్భుతం
ఇప్పటికిది నిజమని తోస్తుంది
ఎప్పటికీ ఇలా ఉంటుందని నమ్మాలనిపిస్తుంది
కానీ మారుతుంది, జారిపోతుంది
ఎంత అమాయకమైన ఆట ఇదంతా
ఏదీ నిలబడనిచోట ఏదీ మారదని భ్రమపడటం
ఆ ఎండిన చెట్టుని చూసావా
బాల్యంలో దాని నీడల కిందనే కదా
మిత్రులతో ఆడుకొన్నది
కొమ్మలలోకి, ఆకులలోకి, పళ్ళలోకి, గాలిలోకి
నిన్ను తేలికగా విసిరేసుకున్నది
చెట్టు ఒరిగిపోయాక మిగిలిన ఖాళీ
నిన్ను ఎటు తీసుకుపోవాలని పిలుస్తున్నది
ఎవరు రాగలరు నీతో అక్కడికి
బివివి ప్రసాద్
ప్రచురణ : పాలపిట్ట ఏప్రిల్ 2025