09 జులై 2025

కవిత : నిర్మోహం

1
మనుషులతో నీకెలాంటి బంధం లేని క్షణాల్లో
నీ ప్రపంచం తటాలున విశాలమౌతుంది

దారిన పోయే మనుషుల్ని,
బజారులో నడకలో, పనుల్లో, మాటల్లో 
మునిగిన మనుషుల్ని
ఊరకనే గమనిస్తున్నపుడు నీకు
వారిపై వాలే వెలుగునీడలు కూడా కనిపిస్తాయి

వెలుగునీడల్ని పొదువుకొన్న గాలీ,
గాలిని పొదువుకున్న ఆకాశమూ,
ఆకాశాన్ని పొదువుకున్న జీవితమూ 
కనుల ముందు సాక్షాత్కరిస్తాయి

మనుషులు నీకేమీ కాని క్షణాలు
ఎవరూ నిన్ను వారి చేతనలోకి లాగని,
నీ చేతనలోకి చొరబడని క్షణాలు అద్భుతం

2
ఆ కొండ చుట్టూ నడిచే సమయాల్లో
బాటప్రక్క బైరాగులని చూసినప్పుడు
నీలో సోదరభావం కలిగేది

వాళ్ళకి మనుషులతో బంధమేమీ లేదు
నువు చూసినా, లేకున్నా,
ఏమన్నా ఇచ్చినా, ఇవ్వకున్నా 
వారికేమీ పట్టింపులేదు

కొండని చూస్తూ వాళ్ళు
జీవితంలో మునిగినట్టు 
కొండలో మునిగి వుంటారు

3
ఏదీ పట్టని క్షణాలు అద్భుతం

నీ ఊరిలోనూ, నీ ఇంటిలోనూ కూడా
నువ్వొక బైరాగిలా తిరుగాడే సమయాలుంటే,
ఇతరులలోకీ నువ్వూ, నీలోకి వారూ
చొరబడని సమయాలుంటే

నీకు తొలిసారి తెలుస్తుంది
ఇతరుల్ని నువు ఎంతగా ప్రేమిస్తున్నావో,
వారిలోపలి సుతిమెత్తని జీవనానందాన్ని 
మృదువుగా తాకుతున్నపుడు తెలుస్తుంది
నీకు జీవితమంటే ఎందుకింత మోహమో

బివివి ప్రసాద్
ప్రచురణ : సారంగ 1.7.2025

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి