08 జులై 2025

కవిత : ప్రేమ ఉంటే..

1
ప్రేమ ఉంటే పెద్దగా చెప్పటానికేమీ ఉండదు
మాటలన్నీ మంచు ముక్కల్లా
ప్రేమలో కరిగిపోతాయి

పూలరంగులు వెలుగుతాయి,
నక్షత్రాలు అనంతాన్ని విరబూస్తాయి,
స్పర్శ జీవితాన్ని సారవంతం చేస్తుంది

ప్రేమ ఉంటే ఇదంతా బాగుంటుంది
బాగోనిది చూపులకి దూరంగా జరుగుతుంది

2
ఇంతా చేసి సూర్యోదయంలోకి
కనులు తెరిచినప్పుడు
ఇవాళైనా ప్రేమలోకి తెరుచుకుంటానా అని
ఊరికే దిగులు పడతావు

జీవుల చూపుల సారం
ప్రేమ కోసం ఎదురుచూపు,
భయాలూ, కోరికలూ 
ప్రేమ దక్కక చేసే వెర్రి పనులు

3
ఈ రాత్రి ఆమె అతన్ని ప్రేమిస్తే,
ఈ పగలు అతను ఆమెని మోహిస్తే
అంతకన్నా ఉదయాస్తమయాలకి అర్థమేమిటి 

కాలం చేసే పలురకాల ధ్వనులు
కలవర పెడుతున్నపుడు 
కాలంగా ప్రవహించే మౌనం
నిన్ను కనిపెట్టుకునే ఉంటుంది

కాస్త ప్రేమించు, అంతా సర్దుకుంటుందని 
కాలం చెప్పకనే చెబుతుంది

4
ప్రేమ ఉంటే లోపలేదో నిండుతుంది

దూరరేఖపై వాలే సూర్యకాంతి
"జీవితం ఎంత అందమైనదో
ఇవాళైనా నీకు అర్థమయిందా" అని
దయగా, లాలనగా అడుగుతుంది

బివివి ప్రసాద్
ప్రచురణ : సారంగ 1.7.2025

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి