16 ఆగస్టు 2026

కవిత : నీకు నువ్వు, నీ భాషలో..

సాయంత్రపు గగనంలోని రంగుల్లోకి దూకినట్లు
ఆమె చూపుల్లోకి దూకాలని ఉంటుంది
దూకి, మరి పైకి తేలకుండా,
రంగుల లోతుల రహస్యాల్ని పట్టుకోవాలని

నిజంగా, ఆమె చూపుల్లో రహస్యమేమీ లేదు
ఆమె నీలాంటి, అందరిలాంటి మట్టిబొమ్మ
ఆమె రూపం వెలిగ్రక్కే కాంతులు
నీ చిత్తభ్రమలే కానీ, ఆమెకేమీ తెలీదు

ఆమె నుంచి ఏ సుఖలాలసనో ఆశిస్తావు,
నీ పుటుక నుంచి 
అద్భుత ప్రపంచానుభవం ఆశించినట్టు

ఆశల ఇసుక కళ్లలో మెరమెరలాడి 
ఏవో రంగులు మెరిసినట్లనిపించడం మినహా
నిజానికి ఇక్కడ మెరుపులూ లేవు, రంగులూ లేవు 
ఈ ప్రపంచం, ఈ జన్మం 
నీలాంటి, ఆమె లాంటి మట్టిబొమ్మలు

అట్లా అని, మట్టి విడిచిపెట్టాల్సినది కాదు
అది సత్యం నుంచి రాలిన స్వప్నం

మట్టి సత్యాన్ని కలగంటుంది 
నువు ఆమెని కలగన్నట్లు,
ఆమె అనుభవాన్ని కలగన్నట్లు,
సత్యం మట్టిని కలగన్నట్లు,

ఏదీ బాలేనంతగా అంతా బావుంది,
ఈ ఉక్కపోతే లేకపోతే
నువు తలుపులు తెరవవు కదా..

బివివి ప్రసాద్