20 జులై 2026

కవిత : హృదయాన్ని...

ఎవరిని నమ్మాలో అర్థం కానపుడు,
నీ హృదయాన్ని నమ్మావు
దేనినీ హత్తుకోలేనపుడు
హృదయాన్నే హత్తుకొన్నావు

నీ బిడ్డలు పసిపాదాలతో అడుగులేస్తూ
నీ ప్రక్కలో చేరి, నిద్రించినట్టు
హృదయాన్ని కౌగలించుకొని నిద్రపోయావు

మానవలోకం మాయ, మొసళ్ళ కొలను
హృదయం పడవలో చేరి
తేలికగా దీనిని దాటావు చాలాసార్లు

లోకాన్ని నమ్మి మోసపోనివాడు లేడు,
హృదయాన్ని నమ్మి మోసపోయినవాడు లేడు 

సంపదలూ, విజయాలూ, 
అధికార గర్వాలూ కాదు కదా నిన్ను నింపేవి,
ఉత్త డొల్ల విలువలు ఆదుకోలేవు 

హృదయం నుండి నవ్వే ఒక నవ్వు, 
చూసే ఒక చూపు, తాకే ఒక స్పర్శ
ఇన్ని విలువలని తలకిందులు చేస్తుంది

ఇంతాచేసి ఈ జీవన సారం
హృదయం నుండి జీవితం అనుభవించటం,
కావాలంటే చూడు, ఇవాళ్టి సూర్యోదయం
ఆకాశం నిండా ఎవరో ఆశను పరుస్తున్నట్టు లేదూ,
ఇవాళ్టి అస్తమయం
ఆకాశం నిండా ఏదో దిగులు వ్యాపిస్తున్నట్టు లేదూ

నీ జీవితం ఎవరో గొప్ప ప్రేమికుడు
తన లోతుల్లోంచి కంటున్న గొప్ప కల
ఇంతకన్నా ఏం కావాలి

బివివి ప్రసాద్
ప్రచురణ : నవమల్లెతీగ, జూలై 2026



19 జులై 2026

కవిత : ఆశ

పెద్దగా ఏమీ ఆశించలేదు నువ్వు
ప్రేమ నిండిన ఒక స్పర్శ, ఒక చూపు,
కనీసం ఒక మాట
దానిని పట్టుకొని తీగలాగా ప్రాకి 
జీవితమ్మీద ఇష్టం పెంచుకుందామనుకున్నావు

నీ ఆశలకి వేసవిగాడ్పు తగిలినపుడు, 
నీ పచ్చదనం తీగలోకి ముడుచుకుపోయింది,
తీగలోంచి తెలియని తీరాలకి తరలిపోయింది

జీవితం నిజంగా అద్భుతం
గాఢనిద్ర కన్నా, మృత్యువు కన్నా,
బహుశా జ్ఞానం కన్నా..
కానీ జీవితాన్ని నిజంగా జీవించగల వరం సంగతి?

భయాల తుపాను అలల మధ్య
జీవించటం ఎవరికి కావాలి,
గాయాల లోయల్లో పడిపోయేటపుడు
ప్రేమవాయువుల పరిమళాలు
ఎవరు ఆస్వాదిస్తారు

ఇదంతా మృత్యువు విసిరే ఇంద్రచాపం,
జీవితం కొందరికైనా పూల వికాసమో, కాాదో, 
పూలలోంచి ఎగిరే పరిమళమో, కాదో,
పూలు పరిచే రంగుల కలనో, కాదో 
నీ కెలా తెలుస్తుంది
నీ కిది శాపం కదా, పోనీ, తీపి గాయం

పెద్దగా ఏమీ ఆశించలేదు ఇక్కడ
నరకం లేని స్వర్గం మినహా

బహుశా, దైవమెవరేనా ఉంటే,
బొరుసు లేని బొమ్మని కోరుకునే
నిన్ను చూసి నవ్వుతారని అనిపించినా
పెద్దగా ఆశించవు,
ఆశ దుఃఖమని తెలుస్తున్నా

బివివి ప్రసాద్