29 జనవరి 2014

ఖాళీపాత్ర


ఈ ప్రపంచం నుండి ఆకులా రాలిపోయేరోజు వస్తుంది
వైభవం మసకబారుతున్న ఇంద్రియాలూ
జారిపోతున్న స్మృతులూ మినహా నీ దగ్గర ఏమీ మిగలవు

నువు గమనించినా లేకున్నా
నీ దేహాన్ని చివరి బంగారురంగూ, చల్లనితెరలూ తాకుతుంటాయి

అప్పుడు ఏమనిపిస్తుంది నీకు
సముద్రంలో మునిగే నదిలా
అనంతం వైపుగా నీ జీవితం స్పందిస్తూ వుంటుందా 

తొలిసారి వీధిలోని ఉత్సవాన్ని చూస్తున్న బాలుని ముఖంలో వలే  
జీవితంలోకీ, అనంతంలోకీ ఒక ఆశ్చర్యం మెరుపులా వ్యాపిస్తుందా

లేదూ, జీవితమంతా చేసినట్లు
ఖాళీపాత్ర నిండా గాలి నింపే ప్రయత్నం చేస్తుంటావా

నీ వెనుక అనంతం పచార్లు చేస్తూ వుంది
ఈ క్షణం నుండైనా వెనుతిరిగి చూడమని 
ఎవరో నీకు సందేశం పంపుతున్నారు


________________________
ప్రచురణ: ఈ మాట జనవరి 2014  

26 జనవరి 2014

ఒకే సంతోషానికి..


ఆకాశాన్ని నీలివస్త్రం చేసి అదాటున విసిరేసినట్టు ఆమె నవ్వుతుంది
అంతవరకూ విషాదస్మృతుల గుహల్లో దాగిన అతను
బంగారుటెండలోకి పరిగెట్టినట్టు నవ్వుల్లోకి పరుగుతీస్తాడు 

అప్పటివరకూ తలపైన శిలలాగా మోస్తున్న బాధ ఏదో
తనలోంచి ఊహలాగా ఎగిరిపోతుంది

ఆమె చిత్రమైన మనిషి 
తనతో భూమ్మీదికి 
పసితనాన్నే తప్ప, యవ్వనాన్నీ, ఫ్రౌఢిమనీ, వార్ధక్యాన్నీ 
వెంట తెచ్చుకోవటం మరిచిపోయినట్టుంటుంది 

ఆమె నిష్కపటంగా పంచే సంతోషాన్ని నిష్కపటంగా స్వీకరిస్తూనే అతను
తన రహస్యదు:ఖాల్ని రహస్యంగా జారవిడుస్తూ వుంటాడు

నువ్వింత సంతోషంగా ఎలా ఉంటావని 
అతను ఉండబట్టలేక అడిగాడొకసారి

ఆమె అందీ 'ఎవరన్నారు, ఎప్పుడూ సంతోషంగా ఉంటానని.
నిన్ను చూసి కదా సంతోషం కలిగేది.
అదే ప్రశ్న నిన్ను అడగాలని ఎన్నోసార్లు అనుకొన్నాను' 

వాళ్ళ నవ్వులకెరటాలు మౌనంలోకి ఇంకిపోతున్నపుడు 
తడితో మెరిసే కాసిని శబ్దాలు వాళ్ళనిలా తాకి వెళ్ళాయి 

'మీరిద్దరూ ఒకే సంతోషానికి రెండు కొసలు.
ఒకరి నుండొకరు వెనుతిరిగినపుడు 
ఒకరి సంతోషాని కొకరు దూరమౌతారు 
ఒకరి కోసం ఒకరు ఎదురు వెళ్ళినపుడు
ఒకే సంతోషపు పూర్ణవలయ మౌతారు ' 

చేతిలోని చేయిని గట్టిగా పట్టుకొన్న వాళ్ళ కళ్ళల్లో
మేలుకొన్న నీటిపొరల్లో
సమస్తసృష్టీ తననొకసారి చూసుకొని నిట్టూర్చింది


______________________________
ప్రచురణ: ఆదివారం ఆంధ్రభూమి 26.1.2014

15 జనవరి 2014

నిద్ర నుండి నిద్రకి

నిద్రలేవగానే నీ ముందొక ఆకాశం మేలుకొంటుంది
వినరాని మహాధ్వని ఏదో విస్తరిస్తూపోతున్నట్టు
కనరాని దూరాల వరకూ ఆకాశం ఎగిరిపోతూ వుంటుంది

ఈ మహాశూన్యంలో నీ చుట్టూ దృశ్యాలు తేలుతుంటాయి
నీ లోపలి శూన్యంలో జ్ఞాపకాలు తేలుతుంటాయి
తేలుతున్న జ్ఞాపకాలు, తేలుతున్న ఇంద్రియాలతో
తేలుతున్న దృశ్యాలలో ఆట మొదలుపెడతాయి   

ఇక బయలుదేరుతావు
కాంతినో, చీకటినో నీలో నింపుకొనేందుకూ
నీ చుట్టూ నింపేందుకూ

రోజు ఒక ఆకులా రాలిపోయే వేళ అవుతుంది
పండిన ఆకులాంటి మలిసంధ్య రాలిపోయాక
మోడువారిన చీకట్లో
నిన్ను నువ్వు వెదుక్కోవటం మొదలుపెడతావు

దిగులు నగారా ఎడతెగక మోగుతుంది
జవాబుకోసం మేలుకొన్న నువ్వు
నిన్నటి ప్రశ్ననే మళ్ళీ పక్కలోని పసిబిడ్డలా తడుముకొంటావు

ప్రశ్నరాలిన చప్పుడు వినకుండానే
నువ్వు ఎప్పటిలాగే ఎక్కడికో వెళ్ళిపొతావు


___________________
ప్రచురణ: సారంగ 9 జనవరి 2014 

14 జనవరి 2014

బెంగటిలినవేళ

1
 హాస్టల్ నుండి అర్థరాత్రి తండ్రికి ఫోన్ చేసింది అమ్మాయి  
'బెంగగా వుంది, డాడీ' 

వాళ్ళ తలల మీద ఒకే నక్షత్రాలు
కనులు విప్పార్చి చూస్తున్నాయి
ఒకే చలిగాలి ఆ ఇద్దరినీ అమ్మలాగా దగ్గరికి పొదువుకొంది

ఏమంత ముఖ్యంకాని శబ్దాల తెరచాపలు తెరిచి  
మృదువైన ఆర్ద్రతలోకి కలిసి ప్రయాణించారు కాసేపు 

ఆ సమయంలో 
ఆ రెండు జీవితాలూ ఒకటికావటంలోకి వికసించాయా
ఒకే జీవితం రెండుగా వికసించిందా

2
తెలియని యే చోటినుండో ఆమె భూమ్మీదికి వచ్చినపుడు  
అతనిలో అంతకుముందు ఎరుగని ఆకాశమూ
దానినిండా ఆనందమూ ప్రవేశించాయి

ఈ జీవి ఎవరు, ఈమెకీ, నాకూ బంధమేమిటి
ఈమెని చూసినపుడల్లా
కడుపులో ఆనందమో, దయో అలల్లా ఊగటమేమిటని
అతనికి ఆశ్చర్యం కలుగుతూ వుంటుంది

మొన్ననే భూమ్మీద బాతునడకలు మొదలుపెట్టిన ఈ అమ్మాయి
ఇంత పెద్దది ఎపుడయిందని విస్మయంగానూ వుంటుంది

అతన్ని కొనసాగించటానికి ఆమె వచ్చిందో
ఆమె కొనసాగటానికి అతన్ని ముందుగా తెచ్చుకొందో
వాళ్ళకి తెలియనిది వారిద్దరిద్వారా కొనసాగుతోందో చెప్పమని

అతను తనలోని ప్రాచీన మౌనాన్ని ప్రార్ధిస్తాడు  
లోలోపలి మౌనం పదాల్లోకి వికసిస్తూ    
పురాతన విషయమే తాజాగా తెలియచేస్తుంది
  
3
తననించి తాను విడిపోవటం వీలుకాని  
ఒకే జీవితం, ఒకే ఆశ్చర్యం, ఒకే ఆనందంలాంటి దయ
హాస్టల్ గదిలోంచి అతనిలోకి 'బెంగగా వుంది, డాడీ' అన్నపుడు

అనేక జీవితాలు లేవనీ, ఉన్నది ఒకే జీవితమనీ తెలిసిన అతను కూడా
‘నాకూ బెంగగానే వుంది, తల్లీ’ అంటాడు


__________________________

ప్రచురణ: ఆంధ్రజ్యోతి వివిధ 13.01.2014