03 డిసెంబర్ 2014

అక్షరాశ్రమం

సముద్రంపై ఎగిరి ఎగిరి మళ్ళీ నౌకపైనే వాలిన పక్షిలా
లోకమంతా తిరిగి మళ్ళీ అక్షరాలపై వాలతావు
నీ కెంతమేలు చేస్తున్నాయో ఎపుడూ గమనించలేదు కాని
భూమ్మీద అక్షరాలు మినహా నీకు తోడెవరూ ఉన్నట్టులేరు

దు:ఖంలోకీ, వెలితిలోకీ ఘనీభవించినపుడు
ఏ శూన్యం నుండో పుట్టుకొచ్చిన కిరణాల్లా అక్షరాలు
నీ ఉద్విగ్న హృదయాన్ని చేరి మెల్లగా నిన్ను కరిగిస్తాయి

ఇంత దయా, శాంతీ నీ అక్షరాలకెలా సాధ్యమని
మిత్రులు విస్మయపడుతున్నపుడు ఆలోచించలేదు కాని
వాటిని ఆశ్రయించే క్షణాల్లో ఏదో దివ్యత్వం
నీ దు:ఖాన్ని దయగా, వెలితిని శాంతిగా పరిపక్వం చేస్తున్నట్లుంది

ఇప్పుడు ఒక్కొక్క అక్షరమూ ఒక్కొక్క అద్దంలా కనిపిస్తోంది
అద్దాలని అతికినప్పుడల్లా
నీలోపల ముక్కలైనదేదో అతుక్కొన్న ఊరట కలుగుతోంది

ఒక్కొక్క అక్షరమూ ఒక్కొక్క నక్షత్రంలా కనిపిస్తోంది
కాసిని నక్షత్రాలని పోగేసుకొన్న ప్రతిసారీ
పిపీలికంలా మసలే నువ్వు పాలపుంత వవుతున్నట్లుంది

ఇప్పుడు ఒక్కొక్క అక్షరమూ ఓ కన్నీటి బిందువవుతోంది
కాసిని కన్నీళ్ళని జారవిడిచిన ప్రతిసారీ
గర్వమో, స్వార్ధమో, మరొక  చీకటో కరిగి

మామూలు మనిషి దేవుడవుతున్నట్లుంది
జీవితం ప్రార్ధనా గీతమవుతున్నట్లుంది
ఎన్నటికీ మరణించనిదేదో లోలోపల వెలుగుతున్నట్లుంది

________________________
ప్రచురణ: తెలుగువెలుగు డిసెంబర్ 14 

3 కామెంట్‌లు:

  1. చాల బాగుంది అక్షరం మీలో రేపిన చింతన.అద్భుతమైన అభివ్యక్తి.నిజంగా అక్షారాలమించి ఎవరుంటారు తోడు?

    రిప్లయితొలగించండి
  2. ఎక్కడ post చేయాలి.మీ blog లో రాశానను

    రిప్లయితొలగించండి