06 అక్టోబర్ 2021

ఎదురుచూస్తూ

నాలుగుగంటలు పడుతుంది డాడీ,
ఏం చేస్తారు, ఎదురుచూస్తారా అంది అమ్మాయి
పరీక్ష రాయటానికి వెళ్లబోతూ
చూద్దాం, ఎలా గడుస్తుందో అన్నావు
ఖాళీపూట నదిలో స్నానానికి దిగబోతున్న ఉత్సాహంతో

ఎదురుచూడట మేమీ
తప్పించుకోవాల్సిన అనుభవం కాదు
ఎదురుచూపు దారం కొసన ఎగిరేటపుడు
కిందికీ, పైకీ, నలువైపులకీ
ఖాళీసమయం ఆకాశంలా విస్తరిస్తుంది

ఇప్పుడీ చెట్ల ఆకుల్లో
రుతువులే జీవనానందాన్ని దాచాయో శోధించవచ్చు
వీటి నీడల సంకేతాలతో
సూర్యుడు భూమితో చేసే రహస్యభాషణ వినవచ్చు

నీ ప్రక్కనుండి ఎవరో వెళ్లిపోవటాన్నో
దూరంగా తేలుతున్న సంభాషణనో
నీ దేహమంతటితో శ్రద్ధగా ఆస్వాదించవచ్చు

జీవితం మోపిన వత్తిళ్లు కాసేపు మరచి
ఒక్కొక్క క్షణాన్నీ తీరికగా అనుభవించవచ్చు
నలువైపులకీ శకలాలుగా విసరబడే నిన్ను
ఒక్కచోటికి చేర్చుకొని చూసుకోవచ్చు

నిజానికి, ఎదురుచూడటం మినహా
ఇక్కడికొచ్చి చేస్తున్నదేమీ లేదు
తెలియనిచోటు నుండి వచ్చి
తిరిగి తెలియకపోవటంలోకి వెళ్ళటానికి
ఎదురుచూస్తూ వున్నావు

నీ బాధ్యతలన్నింటి వెనుకా
నీ నెలాఖరు జీతమున్నట్టు
నీ పనులన్నింటి వెనుకా
జీవితం చివర వెళ్లిపోవటానికి
ఎదురుచూపు వుంటుంది

నీ పనుల మధ్య ఖాళీల్లోకి
నీకు ఇష్టమైన పాట
పాపాయిలా వచ్చి పలకరించినట్టు
నీ రోజుల్లోని ఇలాంటి ఖాళీల్లోకి
నిన్నిక్కడ దించి వెళ్లిన అనంతం
వచ్చి పలకరిస్తుంది

బహుశా, అపుడు
నువు పుట్టనే లేనంత భారరహితమై
జీవితాన్ని నిసర్గంగా,
ఉత్త జీవితంగా కాసేపు జీవిస్తావు

ప్రచురణ : దిక్సూచి, ముంబై. సెప్టెంబర్ 2021

4 కామెంట్‌లు: