జీవితంపై కాస్త ఆశ ఉండాలి
నీరెండ గుమ్మంలో వాలటం సంతోషాన్నివ్వాలి
పూలు ఆకాశంవైపు ఆశ్చర్యంగా విప్పారటం
పండుటాకులు గాలిలోకి రాలటం చాలనిపించాలి
2
సాలెగూటిలో ఇరుక్కున్నట్టు ఉంటుంది జీవితం
ప్రాతఃకాలపు పొగమంచును చూసావా
సాలెగూటిపై పొందికగా ముత్యాలు పేర్చుతుంది
అవి ఎండలోకి రంగులు చల్లుతూ మాయమవుతాయి
ఊరికే మంచుబిందువులా నిలిచి, మాయం కావాలి
3
పసిపాపకి 'స్వచ్ఛంగా నవ్వుతున్నాన'ని తెలీదు
సంతోషంగా ఉన్నానని కూడా
తెలియకపోవటంలోని హాయిని
తేలికగా అనుభవిస్తుంది
తెలియటం కదా ఇంత దుఃఖానికి మొదలు
4
ఇంత ప్రపంచం వెనుక నీకొక హామీ ఉంది
చెట్ల ఆకుల వెనుక ఆకాశం ఉన్నట్టు
ఆకాశం వెనుక తెలియరాని ఖాళీ ఉన్నట్టు
ఇన్ని అనుభవాల వెనుక జీవితం ఉంది
ఇంత జీవితం వెనుక అనంతం వుంది
5
మనమా బ్రతికేది, వెళ్ళిపోయేది
జీవితం తనని చూసుకుంటుంది నీలోంచి, నాలోంచి
నమ్మకం లేకపోతే నీలాకాశం కిందికి వెళ్లి చూడు
విప్పారిన నేత్రంతో ఎవరో నిన్నే చూస్తున్నట్టు లేదూ
6.2.24 5.00 ఉదయం
వీధి అరుగు, ఫిబ్రవరి - మార్చి 2024
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి