21 ఆగస్టు 2024

మోహం

1

జీవితమ్మీద ఇంత మోహమేమిటి అంటారు

ఏ రోజైనా వెళ్ళిపోయే విరక్తి ఉంది గనక అంటావు


ఆ దీపం వెలుతురు, బాటపై మనుషులు,

ఇళ్లపై వెలుగునీడల దోబూచులాట

ఉండి ఉండి తగిలే గాలితెరలు

కురవలేక బేలగా నిలబడిన మబ్బులు

మానుష ప్రపంచపు వింతవింత శబ్దాలు

చనిపోతే ఇక దొరకవు కదా అని కూడా


2

జీవించటం ఇంత అపురూపమైన సంగతా అంటారు


చనిపోతే అంతా చెరిగిపోతుంది,

ఇదంతా ఉంటుందో, లేదో తెలియకుండాపోతుంది

వెళ్ళిపోగల ప్రతి సంగతీ అపురూపమే అంటావు

ఉండటం మీద ఇష్టంతో కదా 

ఇదంతా ఇక్కడ ఉంది అని కూడా


3

ఇవాళ తెల్లవారింది

వెలుతురులో ప్రపంచం ఉత్సవం జరుపుకుంది


సౌఖ్యం, దుఃఖం, కలయిక, వియోగం 

ప్రతిదీ ఒక ఉత్సవం, ఒక ప్రార్థన, ఒక దీవెన

గాఢనిద్రలో మెరిసే ఖాళీలో 

మిగిలేదేమీ లేదు కదా అంటావు


4

నువు ప్రేమించేది దేనినీ చెప్పమంటారు


దేనిని ప్రేమిస్తున్నానో నాకూ తెలియదు

బహుశా, ఈ వెలుగునీడల కదలికల్లో

నన్ను నేనే పొందుతున్నాను, దాచుకొంటున్నాను

జీవితం ప్రియురాలి రూపంలో

నన్నే చూసుకుని ఆశ్చర్యపోతూ, ప్రేమిస్తున్నాను


5

ఇంతలో, తలుపు తెరిచిన చప్పుడయింది

తలుపు, తెరవటం, చప్పుడు, వినబడడం

మన అర్థాలకి అందని ఈ అనుభవ సమూహం

మనని దేనికి తట్టి లేపాలని చూస్తుంది


16.7 24 11.35PM 

' వివిధ ' ఆంధ్రజ్యోతి 19.8.24


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి