మనుషులు వెళ్ళిపోగానే ఏకాంతం ముసురుతుంది
పగలు వెళ్ళగానే రాత్రి ముసిరినట్టు
ఉద్వేగం వెళ్ళాక నిర్వేదం కమ్మినట్టు
నువు వెళ్ళాక చరాచర జగత్తుకీ విశ్రాంతి దొరికినట్టు
అప్పుడు మొదలవుతుంది
మరొకసారి కొత్తగా జీవితం వికసించడం
వెన్నెల రాలటం
ప్రేమికుల మధ్య ఆర్తి మేలుకోవటం
జీవితం నీ చేతుల్లో లేదు
మరెవరి చేతుల్లో కూడా
జరిగేవి నీ లెక్కలని అనుసరించవు
వేల అవకాశాల లోకంలో
నీ లెక్కలెంత, నువు ఎంత
ఈత మానేస్తే చాలు
కాస్త తల వంచితే చాలు
ఇంత విస్తారమైన జీవితంలో
నీ బలమెంత, గర్వమెంత
రాత్రి నిద్రపో
ఉదయం మేలుకో
ఆకలేస్తే తిను, వెదుకు, అడుగు
ఇంతకన్నా ఇక్కడ పనేమీ లేదు
నువు ఉన్నా లేకున్నా గాలి ఇలానే వీస్తుంది
నక్షత్రాలు వెలుగుతాయి
తలపైని మైదానంలో
వెలుతురు బంతులు దొరలుతాయి
మనుషులిట్లానే ఒకరినొకరు
ప్రేమించుకొంటూ, తిట్టుకుంటూ
భయపెడుతూ, జాలిపడుతూ..
మనకి తెలియంది ఏదో జరుగుతోంది
మన లోపలా, వెలుపలా,
మనకి అందని కొలతలలో, కాలాలలో
నువు చీమ కన్నా ఎక్కువ కావని
ఎందుకు తెలుసుకోకూడదు
17.9.24 11.38 రాత్రి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి