1
ఇవాళ ఉన్న ప్రేమ రేపు ఉండకపోవచ్చు,
నిన్నటి కోపం ఇవాళ మిగలనట్లే
జీవితం క్షణమాత్రం కదా, ఇక ఉద్వేగాలెంత
ఈ క్షణంలోకి నిన్ను కోల్పోవటంలో దాగివుంది
జీవితంలోని అందమంతా,
కొనసాగించాలనిపిస్తుంది చూడూ
అప్పుడు మొదలవుంది జీవనవిషాదం
ఇంద్రధనువు వెళ్ళిపోయాక గగనం వెలిసిపోదు
తనతోనే నిండి వుంటుంది హాయిగా,
నింగిలో నుండి వచ్చావు కదా
ఉండలేవా చూడు నీతో నిండిపోయి
2
ఏకాంతం జీవన రహస్యం
ఎవరూ లేనప్పుడు, ఏ చప్పుడూ కానప్పుడు,
అద్దంలోని మనిషి ఒకడే ఎదురైనపుడు
ప్రేమించు తనని కూడా,
ఎదురుచూపుల వేదనంతా ఆవిరైపోయి
తేలికైనకాంతి చొరబడుతుంది లోపలికి
నిన్ను నువు ప్రేమించాలి, క్షమించాలి,
హృదయానికి దగ్గరగా తీసుకోవాలి,
ఉనికి నిన్ను ప్రార్థించేది ఈ లాలన కోసమే,
మిగిలిన ప్రపంచం బ్రతిమాలినా నీతో ఉండదు,
దాని పని దానికి ఉంది
ఒంటరితనం శాపం కాదు, వరం
ఇది అర్థమైతే లోకం అందంలోకి మారుతుంది
3
జీవితాన్ని నిజంగా ప్రేమించిన వాళ్ళు
తమ ముద్రలు ఇక్కడ మిగలాలనుకోరు
రేపటి కాంతి కోసం తమ రాత్రిని ఖాళీ చేస్తారు
ఏమి మిగలాలి ఇక్కడ, ఎంతకాలం
నువు ఏడవలేదు, నవ్వలేదు
నీలోంచి ఎవరో వాటిని చూసారు, చూపించారు
నువు ఉండేది లేదు, వారు వెళ్ళేది లేదు
ఇంత అద్భుతమైన లోకం
ఒక్క మృత్యువుతో మాయమవుతుంది
తరువాత మిగిలేది ఏమిటి! ఎవరికి!
బివివి ప్రసాద్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి