11 మార్చి 2026

ఫోన్ కాల్ అను పర్సనల్ స్పేస్ లేదా నిశ్శబ్దం కథ

 ఫోన్ కాల్ అను పర్సనల్ స్పేస్ లేదా నిశ్శబ్దం కథ

ఫోన్ కాల్ మాట్లాడటమంటే తలమీద రాయిపెట్టినట్లు ఉంటుంది. ఫోన్ సంభాషణలో నిశ్శబ్దానికి అవకాశం ఉండదు. పర్సనల్ స్పేస్ వీలుకాదు. అవతలి మాట ఆగగానే అందుకోవాలి. ఒకోసారి అవతలివాళ్లు కాల్ చేసి, ఏమిటి కబుర్లు అన్నారా రాయి మరింత బరువెక్కుతుంది. ఊరికే వినమంటే, పోనీలే అని వినిపెట్టవచ్చు. ఎక్కువగా ఊ కొట్టినా తప్పే.. స్పందించాలి. ఆ సమయానికి మనం ఏ మూడ్ లో ఉన్నామో, పనిలో ఉన్నామో, వత్తిడిలో ఉన్నామో, ఏ ఆలోచనల్లో, ఊహల్లో దారులు వెదుకుతూ ఉన్నామో అవతలివారికి సంబంధం ఉండదు. 

ఒక బాల్యమిత్రుడు కాల్ చేసి, చెప్పరా అని మొదలు పెట్టేవాడు. నువు కాల్ చేస్తావని, కబుర్లు పోగేసుకుని, ఏ పనీ లేకుండా, ఎదురుచూస్తున్నారా.. అనేవాడిని.. వాడు గనక ఆ మాత్రం స్వేచ్చ ఉండేది.. మరొకరైతే.. కనక, ఫోన్ కాల్ రాగానే, పులిబోను గేటు తెరిచి పట్టుకున్నట్టు, నన్ను లోనికి రమ్మన్నట్టు ఉంటుంది. 

కనకనే, ఫోన్ కాల్స్ చేయను, ఎవరన్నా చేసినా ఇబ్బందిపడతాను. ఫోన్లలో హాయిగా కబుర్లు చెప్పుకొనేవాళ్ళని చూస్తే ఆశ్చర్యం. ఇన్ని కబుర్లు కామా లేకుండా ఎలా పొంగుకువస్తాయా అని. నా వరకూ ఫోన్ కాల్ షెడ్యూల్స్ చెప్పుకోవటానికి, పనుల పురమాయింపులకి. కాల్ రెండు నిముషాలు దాటకుండా పూర్తవుతుంది. అరుదుగా కొందరు హృదయానికి దగ్గర వారు చేస్తే బాగానే ఉంటుంది. వాళ్ళైనా నువు మాట్లాడు అనకపోతేనే. వాళ్ళు చెప్పేది ఆసక్తిగా వినటం వరకే. 

టెక్స్ట్, వీడియో కాల్స్ నా పాలిటి వరాల్లా వచ్చాయి. టెక్స్ట్ లో స్పేస్ ఉంటుంది, అవతలి వాళ్ళు మాట్లాడాక మనం ఎప్పుడైనా చదివి, ఎప్పుడైనా జవాబు ఇవ్వవచ్చు. మనం మాట్లాడితే అవతలి వాళ్ళు కూడా అంతే. అంటే, సంభాషణ నిండా స్వేచ్ఛ పరుచుకుని ఉంటుంది. స్వేచ్ఛ ముఖ్యం కదా.

వీడియో కాల్ మనుషులు దూరంగా ఉన్న బెంగ పోగొడుతుంది, చూడవచ్చు. వెంటవెంటనే మాట్లాడనక్కరలేదు. మనం ఎలా, ఏ పరిస్థితిలో ఉన్నామో అవతలివారికి, అలానే వారి గురించి మనకి తెలుస్తూ ఉంటుంది. మాటల్లేని సంభాషణ కొనసాగుతుంది. ముఖ్యం కళ్ళు మాట్లాడుకుంటాయి, చిరునవ్వులు మాట్లాడుకుంటాయి, ముఖాల్లోని వెలుగునీడలు మాట్లాడుకుంటాయి. మాటల అవసరం వెనుకబడుతుంది. కనిపిస్తూ ఉంటారు గనక, అవతలివారి నిశ్శబ్దంలోకి మాటలతో దూరిపోవాల్సిన పని ఉండదు.

మనుషుల్ని సరాసరి కలవటం ఇష్టం. గుంపులుగా కాదు. మహా అయితే నలుగురైదుగురి వరకూ. ఆ సంఖ్యదాటితే చిరునవ్వుకు పరిమితమైన ప్రేక్షకుడి పాత్రలోకి జారిపోతాను. కలిసి మాట్లాడటం కన్నా, ఊరికే నిశ్శబ్దంలోకి కలిసి ప్రయాణించటం మరీ ఇష్టం. ఎవరిమీదనైనా ఎక్కువ ఆత్మీయత కలిగినప్పుడు వారితో కలిసి నెమ్మదిగా, నిశ్శబ్దంగా, ఏ లోతైన, గంభీరమైన విషయం పైనో హృదయం విప్పుకొని మాట్లాడుకోవాలని ఉంటుంది. ఒకానొక కాలంలో అలాంటి ఒకానొక మిత్రుడితో గడపగలిగాను కొన్నేళ్లపాటు.

లోకం ఎలా ఉందో తెలీదు గానీ, నా వరకూ, పర్సనల్ స్పేస్ లేని, తగినంత నిశ్శబ్దం లేని మానవ సంబంధాలు చాలా వరకూ మొరటుగా, కృతకంగా తోస్తున్నాయి. ఇటీవల మరింతగా. ఒకరి స్వేచ్ఛని ఒకరు గౌరవించే, ఒకరి స్థలాన్ని ఒకరు గౌరవించే, ఒకరి నిశ్శబ్ద భాషణని ఒకరు గ్రహించే సున్నితమైన సమాజాన్ని కలగంటూ, మనుషులకి దూరం అవుతున్నానేమో కూడా తెలీదు. కానీ, నా స్పేస్ లో, ఏకాంతంలో నేను నిండే కొద్దీ, మనుషులూ, జీవితమూ ఇంకా లోతుగా తెలుస్తూ, ప్రేమాస్పదంగా మారుతూ ఉండటం గమనిస్తున్నాను.

బివివి ప్రసాద్
11.3.26 6.15 సాయంత్రం

1 కామెంట్‌: