29 ఆగస్టు 2015

'నీలో కొన్నిసార్లు' కలిగే ఆలోచనలే బివివి ప్రసాద్ కవిత్వం : బొల్లోజు బాబా


బి.వి.వి. ప్రసాద్ కవిత్వం లో ఏముంటాయి? ఈ లోకంపై కాస్తంత దయ, సన్నజాజి తీగలా చుట్టుకొన్న తాత్వికత, గొంతు విప్పి హాయిగా గానం చేసే జీవనానుభవాలు. ఇంతే! ఇంకేమీ కనిపించవు. మరీ ముఖ్యంగా వాక్య వాక్యంలోంచి దూసుకొచ్చి, పీకపట్టుకొని నులిమేస్తూ ఊపేసే ఉద్రేకాలు, భీభత్సాలూ, వాదాలు వంటివి.

బి.వి.వి నాకు ఒక హైకూ కవిగానే ఎక్కువ పరిచయం. నిమ్మముల్లులా గుచ్చుకొనేవి అతని హైకూలు. బాధగా అనిపించేది కాదు కానీ, ఈ కవి ఇంత సున్నితంగా, సూక్ష్మంగా లోకాన్ని ఎలా దర్శించగలుగుతున్నడా అని విస్మయానికి గురౌతూ ఉండే వాడిని.

టాగోర్ కవిత్వాన్ని చదివి చదివి, ఆ తీయని భారాన్ని మోయలేక, స్ట్రేబర్డ్స్ ని, క్రిసెంట్ మూన్ ను తెలుగులోకి అనువదించి కొంత దించుకొన్న రోజులవి. అప్పుడు చదివాను బి.వి.వి “ఆరాధన”. “గీతాంజలి” లోని ప్రాణవాయువుని “ఆరాధన” అణువణువూ నింపుకొంది. చలం తరువాత, గీతాంజలి సారాన్ని పీల్చుకొన్న మరో తెలుగు వ్యక్తి బి.వి.వి మాత్రమే అని విశ్వసిస్తాను.

మొత్తం 84 కవితలతో కూడిన బి.వి.వి కొత్తపుస్తకం పేరు “నీలో కొన్నిసార్లు”. “పుస్తకం మీకు చేరిందా” అని బి.వి.వి గారు అడిగినప్పుడు, “చేరింది సార్ It’s a Gift from the sky” అన్నాను. మంచి కవిత్వ వాక్యం దేవుడు మనకి పంపే కాన్కే కదా!

ఆర్థ్రత, సౌందర్యం, తాత్వికతా అనే మూడు వంకలు కలవగా ఏర్పడ్డ సెలయేరులా అనిపించింది ఈ 'నీలో కొన్నిసార్లు'. - స్వచ్చంగా, గలగలలాడుతూ, చెట్లనీడల్ని ప్రతిబింబిస్తూ ప్రవహించే కవిత్వ సెలయేరు.

ఈ సంకలనంలో జీవితం అనే మాట పలుమార్లు కన్పిస్తుంది. కానీ వచ్చిన ప్రతీసారి ఒక కొత్తఅర్ధంతో, కొత్త కోణంలో, ఒక కొత్త మెటఫర్ తో కనిపించటం బి.వి.వి ప్రతిభకు తార్కాణం.

"జీవితమింతే
ఇది ఒక దిగంబర దేవత
ఇది నిన్ను రమ్మనదు, పొమ్మనదు
ఇది కావాలనదు, ఇది వద్దనదు
మతిలేని యాచకురాలి నవ్వులా నీ కలలన్నిటినీ కోసుకొంటూ తరలిపోతుంది" (జీవితం ఇలాగే)
అంటూ జీవితంలో నిండిన శూన్యతను వర్ణిస్తాడు కవి

"జీవితమొక మహా విహంగం
దాని రెక్కలు విప్పినప్పుడు, అది పగలు, మూసినపుడు రాత్రి" (విహంగ దర్శనం)
అంటూ ఒక సర్రియల్ పదచిత్రంతో జీవితాన్ని ముడిపెడతాడు.

"జీవించడమంటే, మరేం కాదు
గాలిలా, నేలలా, నీటిలా ఉండటం
ఉండటమే ఉత్సవమైనట్టు ఉండటం
మిగిలిన పనులన్నీ నిద్రపోయాక నీ ప్రక్కలో ఒంటరివైన ఆటబొమ్మలు" (బ్రతకాలి)
జీవితాన్నిఉత్సవంలా జీవించటమే జీవన వాస్తవికత, అదే జీవితాదర్శం అంటుందీ కవిత. ఈ కవితలో ఎంతో లోతైన చింతనను చిన్న చిన్న పదాలద్వారా పలికిస్తాడు బి.వి.వి.

"జీవితం భయ, విషాదాలలో పొరలే పాత్రను తలదాల్చి నర్తించే కళ
గెలిచేందుకు ఏ నియమాలూ లేని, గెలిచే హామీ లేని నవ్వుకొనే క్రీడ" (అలా ఆకాశం వరకూ...)
అంటూ నిస్పృహ నిండిన స్వరంతో జీవితాన్ని వర్ణిస్తాడు కవి. ఇది జీవితం పట్ల నైరాశ్యం కాదు. మాయలమారి అయిన ఆధునిక జీవనం పై కవి చేసిన వ్యాఖ్యానం. ఈ కవిత చివరలో “నాతో రా ఒకసారి, ఆకాశం లా మారిచూద్దాం” అనటం ద్వారా కవి ఈ స్థితి పట్ల తన దిక్కారాన్ని వినిపిస్తున్నాడు.

"జీవితమంటే ఏమిటని ప్రశ్నించుకొన్న ప్రతిసారీ
దిగులు మేఘాలపై ఓ కొత్త జవాబు
ఇంద్రధనస్సులా మెరుస్తూవుంటుంది." (జీవితార్ధం)
జీవితమంటే ఏమిటన్న దానికి యోగులు, వేదాంతులు, ప్రవక్తలూ అనాదిగా ఎన్ని నిర్వచనాలిచ్చినా, ఆ ప్రశ్న ప్రశ్నగానే ఉండిపోయింది. ఆ ప్రశ్నకు జవాబుగా జీవితంలోని ఒక్కో దశలో ఒక్కో జవాబు మెరుస్తూండటం కూడా సహజమే. ఇదే విషయాన్ని వేదాంతి అయిన కవి ఈ కవితలో గొప్ప లాఘవంగా పలికించాడు.

"వెనుతిరిగి చూసుకొంటే
బాల్యాన్ని కోల్పోవటమే ఉంటుంది కానీ
పెద్దవాళ్ళు కావటం ఉండదని అర్ధమైంది" (గాజుగోళీ)
ఈ వాక్యాలలో పెద్దవాళ్లవటం కంటే బాల్యమే ఉన్నతమైన స్థితి అన్న అర్ధం ద్వనిస్తుంది. కవులు సదాబాలకులు అనే ఒక అందమైన ఊహకు ఒక అద్భుతమైన పొడిగింపు ఈ వాక్యాలు.

"మనమంతే
నదినీ, జీవితాన్నీ
ప్రేమించటమెలానో మాట్లాడుకొనే సందడిలో
వాటిని ప్రేమించటం మరచిపోయి పడవదిగి వెళ్ళిపోతాము" (మనమంతే)
మన జీవితాలలోని అరాసిక్యాన్ని ఒడుపుగా బంధించిన కవిత ఇది. నిజమే మరి! సౌందర్యాన్ని ఆస్వాదించటం మాని సెల్పీలు దిగటంలోనో లేక కబుర్లు చెప్పుకోవటంలోనో కాలాన్ని వృధాచేసుకొంటాం చాలాసార్లు.

"కవీ నీ పాత్రలో కొద్దిపాటి నీరు చేరగానే
దానినే గలగల లాడించి భ్రమింపచెయ్యకు
నీముందు, నదుల్ని తాగి ఏమీ ఎరుగనట్లు చూస్తున్నవారుంటారు" (వర్థమాన కవికి)
ఒక సారి బి.వి.వి గారితో నేను మాట్లాడుతూ “తెలుగు సాహిత్యంలో మీకు రావాల్సినంత కీర్తి రాలేదేమోనని నా అభిప్రాయం సార్” అంటే ఆయన “నిజజీవితంలో డబ్బు సంపాదించటానికి ఎన్ని మార్గాలైతే ఉన్నాయో సాహిత్యంలో కీర్తి సంపాదించటానికి కూడా అన్ని మార్గాలూ ఉన్నాయి” అన్నారు. అది నిరాశ కాదు. ఒక వాస్తవ పరిస్థితి. నాలుగు కవితలు వ్రాసి, ఒక పుస్తకం తీసుకొచ్చి దాన్ని తెలుగు సాహిత్యచరిత్రను మలుపు తిప్పే ఘట్టంగా ప్రచారించుకొని కిరీటాలు, భుజకీర్తులు తగిలించుకొని తిరిగే వారు కనపడతారు మనకు అక్కడక్కడా. పై కవితలో ఓ వర్ధమానకవిని హెచ్చరిస్తున్నాడు ఈ కవి. అటువంటి విషవలయాల్లోకి వెళ్ళొద్దనీ, కవిత్వాన్ని వెలిగించే అగ్ని కోసం అన్వేషించమనీ సూచిస్తాడు.

'ఈ సిమెంటు మెట్లపై నీకేం పని' అంటూ మొదలయ్యే “సీతాకోక చిలుకా”- వార్ధక్యం పై వ్రాసిన “అవతలి తీరం గుసగుసలు - తాత్వికత నిండిన “రాక”-అన్యోన్య సహచర్యాన్ని అద్భుతంగా నిర్వచించిన “ఒకే సంతోషానికి”- బెంగగా ఉంది డాడీ అని హాస్టల్ నుండి అర్ధరాత్రి ఫోన్ చేసిన అమ్మాయి గురించి వ్రాసిన “బెంగటిలిన వేళ”- అక్షరాలను అద్దాలతో పోలుస్తూ చెప్పిన “అక్షరాశ్రమం” – పిల్లలగురించి చెప్పే “పసిదనపు స్వర్గం” వంటి కవితలు నాకు ఎంతో బాగా నచ్చాయి.

స్వచ్చమైన కవిత్వాన్ని ఇష్టపడే వారికి ఈ పుస్తకం తప్పక నచ్చుతుంది. కవి మాటల్లోని నిజాయితీ, సత్యాన్వేషణా చదువరులను ధ్యానంలోకో, మౌనంలోకో లాక్కెళ్లతాయి. శాంతికి, నెమ్మదికి జీవితంలో ఇవ్వాల్సిన విలువను గుర్తుచేస్తాయి. ఒక్కోసారి జీవితంలోని నైరాశ్యం పట్ల హృదయంలో జ్వలించే అనేక ప్రశ్నలకు సమాధానాలు కన్పిస్తాయి ఈ కవిత్వంలో. ఈ పుస్తకాన్నీ ఏకబిగిన చదివినపుడు కొంత ఏకరీతిగా ఉన్నట్లు అనిపించినా, మరల మరల చదివినపుడు ఆ భావాల లోతు, పొరలు ఆస్వాదించవచ్చు.

ఈ కవిత్వ సంపుటి లభించే చోట్లు:
వాసిరెడ్డి పబ్లికేషన్స్, హైదరాబాద్
నవోదయ బుక్ హౌస్, కాచిగూడ, హైదరాబాద్
ప్రజాశక్తి, విశాలాంధ్ర, నవోదయ బుక్ షాప్స్, విజయవాడ
ఈ పుస్తకం: కినిగే.కాం

~ బొల్లోజు బాబా

'కవితా' పత్రికలో ఈ సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

12 జులై 2015

లోపలి ప్రపంచంవైపు తొలి అడుగులు వేయించే - నీలో కొన్నిసార్లు

'నీలో కొన్నిసార్లు' పుస్తకం చేతుల్లోకి తీసుకొని ఈ కవిత్వం ఏం చెబుతోంది అని ఒకటికి రెండుసార్లు ప్రశ్నించుకొన్నాను. ఈ కవిత్వం ఈ కవి ద్వారా అక్షర రూపం దాల్చిందే అయినా, ఒక సంపుటంగా సమగ్రరూపం పొందినపుడు ఈ కావ్యానికి ఇక తనదైన అస్తిత్వం ఉంటుంది.

మనిషి తననీ, సమాజాన్నీ, ప్రపంచాన్నీ, జీవితాన్నీ అన్నిటినీ ప్రశ్నించే, నిందించే క్రమంలో తనలోతుల్లో దేనికోసం వెంపర్లాడుతున్నాడు అని తరచి చూస్తే అతను అంతం లేని స్వేచ్ఛ కోసం, శాంతి కోసం వెదుక్కొంటున్నాడు అనిపిస్తుంది. కానీ ఆ స్వేచ్ఛ, శాంతి తనకు తన చుట్టూ ఉన్న సమాజం నుండి కావాలా, తన నుండే తనకి కావాలా అనే మౌలికమైన ప్రశ్న వైపే తన చూపు మరలటం లేదు. కాస్త నెమ్మదించి, కాసేపు తనలో తానే నిలదొక్కుకొని ఆ ప్రశ్న వరకూ రాగలిగితే సూర్యకాంతికి మంచుతెరలు కరిగినట్లు తనలోపలి సంక్లిష్టత కరిగి నిజమైన శాంతి ఏదో,  స్వేచ్ఛ ఏదో తనంతట తనకే తెలియటం మొదలౌతుంది. తాను జీవిస్తున్న జీవితానికి తాను బానిస కాదనీ, అధికారి అనీ అర్థమవుతుంది.

నీలో కొన్నిసార్లు కవిత్వం ఒక మంచి స్నేహితుడి లాంటిది. లోపలి సంఘర్షణలో, తాను నిస్పృహలో ఉన్నానని కూడా గుర్తించలేనంత నిస్పృహలో ఉన్న మనిషిని మృదువుగా తాకి, నీలోకి చూసుకో అన్నీ చక్కబడతాయి అని ధైర్యం చెప్పే, సాంత్వన నిచ్చే స్నేహితుడు ఈ కవిత్వం. తనలోనికి ఎలా చూసుకొవచ్చునో, తన లోపల బాధ కలిగించే తననుండి ఎలా విముక్తం కావచ్చునో కొన్ని దారుల్ని సున్నితంగా పరిచి చూపించే కవిత్వం. తనదైన దారి తాను వెదుక్కొనేందుకు స్ఫూర్తి నిచ్చే కవిత్వం.

ఇది ఒక్కసారిగా చదువుకోగలిగిన కవిత్వం కాదు. ఒక్కసారి చదువుకొంటే పూర్తి అయిపోయేదీ కాదు. పాఠకుడు తనతో తాను ఉండక తప్పని స్థితిలో ఉన్నపుడు ఈ పుస్తకాన్ని తెరిచి, కవిత్వం కోసమో, మరే సాంస్కృతిక వినోదం కోసమో కాకుండా, కేవలం తనకోసం తాను చదువుకోవటం మొదలుపెట్టినపుడు, ఈ కవిత్వంలో, వాక్యాల్లో, పదాల్లో నిజాయితీగా తనని వెదుక్కొవటం మొదలుపెట్టినపుడు రెండు, మూడు కవితలు పూర్తయేసరికి ప్రశాంతదు:ఖంలోకి, మౌనంలోకి, ధ్యానంలోకి నడిపించే కవిత్వం.

ఈ కవిత్వం అందరూ చదవగలిగే కవిత్వమూ కాదు. ప్రపంచజ్వరాన్ని సంతోషంతోనో, బాధతోనో, గాయాలతోనో, విజయాలతోనో జీవితం నిండా అనుభవించి, ఇదంతా ఎంత సారహీనమో, అర్థరహితమో గ్రహించి, ఇక ఎటు నడవాలో తెలియక నిలబడిన, ఒక పక్వ మానసిక స్థితినుండి తెరిచి చూడవలసిన కవిత్వం. తనలోపలి లోతైన, నాణ్యమైన చీకటిలోకి వెన్నెల్లా, నక్షత్రాల్లా ఒంపుకోవలసిన కవిత్వం.

ఒకే ఒక్క మాటలో, ఊహాజనితమైన నీ నుండి నిజమైన నీలోకి మెల్లగా మొదటి అడుగులు వేయించే దయగల తల్లి వంటిది ఈ కవిత్వం.

ఈ కవిత్వ సంపుటి లభించే చోట్లు:
వాసిరెడ్డి పబ్లికేషన్స్, హైదరాబాద్
నవోదయ బుక్ హౌస్, కాచిగూడ, హైదరాబాద్

ప్రజాశక్తి, విశాలాంధ్ర, నవోదయ బుక్ షాప్స్, విజయవాడ

ఈ పుస్తకం:  కినిగే.కాం 

07 జూన్ 2015

పాత పసిడి ~ సాక్షి



బివివి ప్రసాద్ హైకూలు డౌన్లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://www.newaavakaaya.com/Short-Stories-Poetry-Essays/ebooks-bvvprasad-haiku.html

ఆన్ లైన్ లో చదవటానికి ఇక్కడ క్లిక్ చేయండి
http://bvvprasad.blogspot.in/2014/08/blog-post_9.html

06 జూన్ 2015

అసమాన్వి

ఆమె నాకు కవిత్వం
రాయిలాంటి జీవితంలో కోమలత్వం చూపుతోన్న శిల్పం
 
దయనీ, సౌకుమార్యాన్నీ, పసిదనపు ఆశ్చర్యాలనీ వెదజల్లే రసమయలోకం
ఉదయాస్తమయాకాశాల్లో  సూర్యుడు వెదజల్లే ఊహల్లోపలి ప్రపంచం
వెన్నెల కాయటం, రుతువులు మారటం, కాలం మృదువుగా కరిగిపోవటం

ఆమెని దర్శించాను పలుమార్లు
పూలు దయగా పూయటంలో, వికసించటంలో,
రేపటి పూలకి దయగా చోటువిడవటంలో

ఆమె ఆకాశమనీ, నేను దానిలో రాత్రిభాగాన్ననీ
ఎప్పటికైనా నేనూ ఆమెవలే పూర్ణవలయం కావాలనీ
సంతృప్తిలోకీ, క్షమలోకీ, సంతోషంలోకీ మేలుకోవాలనీ

ఎప్పటికైనా ఆమె మాత్రమే
ఆమెతో నిండిన మానవులు మాత్రమే లోకాన్ని నడిపించాలనీ
బలప్రదర్శనలతో విసిగివున్న ప్రపంచాన్ని
ఆమెలాంటి ప్రేమతో నింపాలనీ కలగంటాను
. . .
ఈ కవిత్వం రాస్తున్నది ఎవరు
నా లోపలి ఆమె మాత్రమే కదా..

3.3.2013 మధ్యాహ్నం 12.23

05 జూన్ 2015

పిలుపు

ఎప్పుడైనా, ఏ పనిలోనున్నా
అంతకన్నా అపురూపమైనదొకటి నీలోంచి నిన్ను పిలుస్తూవుంటుంది

పూలరేకులకన్నా సుతారమైన శూన్యమొకటి
సీతాకోకపై ఊగే రంగులకన్నా కోమలమైన ఖాళీ మెలకువ ఒకటి
తల్లికి పసిపాప నవ్వు స్మృతిలో నిలిచినట్టు నీలోపలి నేపధ్యమై చలిస్తూవుంటుంది

ఆకలితో కనలే కళ్ళలోని, స్పర్శలోని దైన్యంకన్నా మృదువుగా
నీలోపలి దయాగుణాన్ని తడుముతూ వుంటుంది

ఎప్పుడైనా, ఏ పనిలో వున్నా
లోలోపలి నిర్మలమైన లోకం ఒకటి
ఆట చాలించి రమ్మని గుమ్మంలోని తల్లిలా
దయగా, విసుగన్నది లేకుండా ప్రతిక్షణమూ నిన్ను తలుస్తూవుంటుంది

2.3.2015

04 జూన్ 2015

ఒంటరితనంలోకి..

అందరూ ఉన్నట్లే వుంటుంది, అకస్మాత్తుగా ఒంటరితనం పరుచుకొంటుంది
డాబామీది పావురాయి రెక్కల్నీ, కువకువల్నీ, నీడనీ వెంటపెట్టుకొని ఎగిరిపోతుంది
పావురాయి ప్రపంచం ఖాళీ అయినచోట శూన్యం సుడితిరుగుతూ తనలోనికి లాగేస్తుంది
లోకం ఎప్పట్లా మరోసారి దు:ఖమయమై కనిపిస్తుంది

నీతో ఏంపని చెట్లకీ, పిట్టలకీ, వాటిపై అలుపెరుగక ఎగిరే ఆకాశానికీ,
మనుషుల నీడలకీ, గోడలకీ, తలక్రిందుల తెలివికీ అనిపిస్తుంది

శుభ్రమైన శ్వాసలా బ్రతకాలని తలుస్తూనే 
కాలంకాని కాలంలోకి తొందరపడి జారిపడిన
పురా స్వప్నస్మృతి ఒకటి, దు:ఖపువాగులో గులకరాయై మెరుస్తుంది

ఇక్కడందరూ వున్నట్లుంటుంది, వెచ్చగా కప్పినట్లుంటుంది
ఎవరిలోనికి తేమచూపును పంపినా, 
వేసవిగాడ్పు వినా, పచ్చని ఆకైనా ఎగిరిన జాడలుండవు
. . .
దట్టమైన పొగమంచులా కమ్ముకొంటోంది ఒంటరితనం
అగాధమైన నిశ్శబ్దంలోకి అన్వేషణ తెరచాపయెత్తి ఎలా ప్రయాణించాలో
ఇప్పుడెవరు చెబుతారు..

21.8.2012