గమనించము కానీ
ఒక దీర్ఘ ప్రవాసం తరువాత ఇల్లు చేరినపుడు
ఇల్లు కూడా కాసేపు మనని అతిథిలానే చూస్తుంది
ఇంటి గోడలూ, వాటి వెలిసిన రంగులూ
సామానూ, అవి సర్దుకొని ఉన్న విధానమూ
మన మనుషుల మాటలూ, ప్రవర్తనా
వాకిట్లో ఇవాళ పూసిన పూలు కూడా
ఎవరీ మనిషి అని చూస్తున్నట్లూ, ఎవరినో పలకరిస్తున్నట్లూ ఉంటాయి
మనని మనకు కొత్తమనిషిని చేస్తాయి
గమనించము కానీ
గాఢమైన నిద్రనుండి మేల్కొన్నపుడు కూడా
కొంత సమయం, మనచుట్టూ ఉన్న ప్రపంచం అప్పుడే పుట్టినట్లుంటుంది
ఆక్షణమే, ఎవరో ఎక్కడినుండో ప్రపంచాన్ని తెచ్చి మన చుట్టూ పరిచినట్లుంటుంది
అపుడు మనం
మొదటిసారి శ్వాసిస్తున్నట్లు కొత్త ఊపిరి గుండెలనిండా నింపుకొంటాము
మేలుకొన్నపుడూ,
ఇంటికి వచ్చినపుడూ
కాసేపు మనలో పసిపిల్లల అమాయకత్వమేదో గోడమీది నీరెండలా పారాడుతుంది
తామేమి చేస్తున్నాయో తమకు తెలియకుండానే
కఠినమైన ప్రపంచాన్ని కోమలమైన రంగులతో నింపుతున్న
పూలలోని మృదు సౌందర్యస్పృహలాంటిది ఏదో
మనలో లీలగా, దూరం నుండి వినవస్తున్న పాటలా
వాగు ఇసుకపై మెరుస్తున్న పలుచని నీటిపొరలా చలిస్తూ ఉంటుంది
గమనించము కానీ
మన ఇల్లూ, మెలకువా పాతబడే కొద్దీ
కొంచెం కొంచెంగా మనవాళ్ళూ, ప్రపంచమూ మనలో నిండే కొద్దీ
దేనినో కోల్పోతున్న దిగులు ఒకటి
ఇసుకపొరలు దాటుకొంటూ వాననీరు పాతాళంలోకి ఇంకుతున్నట్లు
మన లోపలికి ఇంకుతూ ఉంటుంది
హృదయాన్ని స్పృశించింది మీ కవిత -
రిప్లయితొలగించండిమీకు నా అభినందన!
మానవ మనుగడ లోని మర్మాన్ని ఆవిష్కరించింది కవిత .
తొలగించండి----- సుజన-సృజన
ధన్యవాదాలు ఆచార్య ఫణీంద్ర గారూ
తొలగించండిధన్యవాదాలు రాజారావు గారూ
తొలగించండిచాల సున్నితమైన భావాన్ని అందమైన కవితలో చక్కగా పొదిగారు .
రిప్లయితొలగించండిధన్యవాదాలు రవిశేఖర్ గారూ
తొలగించండి"గమనించము కానీ
రిప్లయితొలగించండిగాఢమైన నిద్రనుండి మేల్కొన్నపుడు కూడా
కొంత సమయం, మనచుట్టూ ఉన్న ప్రపంచం అప్పుడే పుట్టినట్లుంటుంది" -
మళ్ళీ "హైకూ రోజుల్లోకి" తీసుకెళ్ళారు మీరు నన్ను.
"కొంచెం కొంచెంగా మనవాళ్ళూ, ప్రపంచమూ మనలో నిండే కొద్దీ
దేనినో కోల్పోతున్న దిగులు ఒకటి
ఇసుకపొరలు దాటుకొంటూ వాననీరు పాతాళంలోకి ఇంకుతున్నట్లు
మన లోపలికి ఇంకుతూ ఉంటుంది"
ఈ దిగులు నాకు కొంత పరిచయమే. అల వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు తడిని కోల్పోతున్న సముద్రతీరం కళ్ళ ముందు మెదలింది.
శ్రీనివాస్ గారూ, హైకూ తత్వాన్ని వదులుకోకుండానే, కవిత్వం రాయాలి అనుకొంటూ రాస్తున్నాను. మీ మాటలు నేను దారి తప్పలేదని నమ్మకం ఇచ్చాయి. ధన్యవాదాలు మీకు.
తొలగించండి