మీకు కవిత్వం రాయాలని ఎందుకనిపించింది?
ప్రతి మనిషికీ తాను బ్రతకాలనే జీవితేచ్ఛ ఎట్లా బలీయంగా ఉంటుందో, అట్లాగే తనను తాను వ్యక్తీకరించుకోవాలనే కాంక్ష కూడా ఉంటుందనుకొంటాను. మానసిక చైతన్యం సాధారణస్థాయి కంటే అధికంగా ఉన్నవారిలో కొందరు - తమ కార్యక్షేత్రంగా నిత్య వ్యవహారాలతో సరిపెట్టుకోలేక లేదా తమ వ్యక్తీకరణకూ, నిత్యవ్యవహారాలకూ పొసగక - ఒక స్వప్న ప్రపంచాన్ని ఎన్నుకొంటారు. ఆ ప్రపంచంనుండే అన్ని కళారూపాలూ ఉద్భవిస్తాయి. నా బాల్యంలో నేను రంగులలో నా ప్రపంచాన్ని వెదుక్కొనేవాడిని. యవ్వనకాలంలో రంగుల స్థానంలోకి అక్షరాలు ప్రవేశించాయి. అప్పటినుండీ నా అక్షరాలలో, నేను నా ఆంతరిక ప్రపంచాన్నీ, నన్నూ వ్యక్తీకరించుకోవటం మొదలైంది.
మీ స్వప్న ప్రపంచంపై సాహిత్య ప్రభావం ఎలా ఉంది?
ప్రతివారి స్వప్న ప్రపంచం వారి జీవశక్తిని అనుసరించి, అంతంతమాత్రంగానో, బలీయంగానో ఉంటుంది. ఊహ తెలిసే నాటికి, అది తనకే అర్థం కానటువంటి, ఒక ఘనీభవించిన రూపంలో ఉంటుంది. అది ఒకలాంటి అవ్యక్తస్థితిలో ఉన్నప్పటికీ, దాని బరువు అతని అనుభవంలో ఉండి, అతనిని కుదురుగా నిలబడనీయకుండా చేస్తుంది. నేను ఇలా ఎందుకున్నాను, జీవితమంటే ఏమిటి, ప్రపంచమంటే ఏమిటి, జీవితానుభవం ఇంత సంక్లిష్టంగా, దు:ఖమయంగా ఎందుకుంది వంటి ప్రశ్నల రూపంలో అతనిలోని జీవశక్తి అతన్ని సదా వెంటాడుతుంది. ఆ ప్రశ్నలకి జవాబులు వెదుక్కొనే క్రమంలోనే కొందరు సాహిత్యం చదువుకొంటారు. పూర్వమానవుల అనుభవాలూ, వేదనలూ, అన్వేషణా, అవగాహనా - మనల్ని మనం త్వరగా, స్పష్టంగా అర్థం చేసుకొనేందుకు దోహదపడతాయి.
అలాంటి వ్యక్తావ్యక్త ప్రశ్నలతోనే, వ్యక్తావ్యక్త స్వప్నాలతోనే నన్ను నేను తెలుసుకొనేందుకు సాహిత్యం చదువుకొన్నాను. అట్లా చదువుకొన్న సాహిత్యం నా స్వప్నలోకాన్ని వికసింపచేసిందనీ, పరిపుష్టం చేసిందనీ, నన్నూ, నా చుట్టూ ఉన్న మానవ సమాజాన్ని సరిగా అర్థం చేసుకొనేందుకు, సమాజం పట్ల సరైన స్పందనలతో జీవించేందుకు దోహదం చేసిందనీ అనుకొంటాను.
మిమ్మల్ని ప్రభావితం చేసిన రచయితలెవరు?
జ్ఞాపకం ఉన్నంత వరకూ, శరత్‌బాబు, ప్రేంచంద్, రాహుల్‌సాంకృత్యాయన్, విశ్వనాధ సత్యనారాయణ, గోపీచంద్, బుచ్చిబాబు, తాపీ ధర్మారావు, వడ్డెర చండీదాస్, టాల్‌స్టాయ్, విక్టర్ హ్యూగో మొదలైన - జీవితం పట్ల తమదైన దారిలో స్పష్టమైన నిబద్ధత, జీవితానుభవం పట్ల అసాధారణ శ్రధ్ధా, సార్వజనీనతా గలవారి - రచనలు, ముఖ్యంగా కథా, వ్యాస సాహిత్యం నన్ను ఎక్కువగా ప్రభావితం చేసాయి.
యవ్వనకాలంలో శ్రీశ్రీ రచనలు, శ్రీశ్రీ ప్రభావంతో చదివిన సామ్యవాద సాహిత్యం - సామ్యవాద దృక్పథం పట్ల ఆసక్తి కలిగించినా - కొన్ని సంవత్సరాలకే, మానవజాతి దు:ఖ విముక్తికి అది సమగ్ర పరిష్కారం కాదనిపించింది. సామూహిక మానవ స్వప్నంలో - సమసమాజ భావన అతి ఉదాత్తమమైనదనే గౌరవం ఉన్నా, దానిని సాధించటం వెలుపలి నుండి కాకుండా - మానవులు వారి మానసిక పరిపక్వత, పరిణతుల ద్వారా - కాలక్రమంలో తప్పనిసరిగా సాధించుకొనే అనివార్య పరిణామమని అనిపిస్తుంది.
తరువాతి కాలంలో చలం ప్రభావం గాఢంగా ఉంది. అందుకు - ప్రతివాక్యాన్నీ, తన హృదయంనుండి సూటిగా అవతలి హృదయానికి చేరవేసే ఆయన శైలి ఒక కారణమైతే, ఆ వాక్యాలలో కనిపించే నిర్భీతీ, నిజాయితీ, స్పష్టతా, ఆయన రచనలంతటా పరుచుకొన్న రసాత్మక జీవితం పట్ల ఎడతెగని దాహం, అంతంలేని సత్యాన్వేషణా, స్వేచ్ఛా చింతనా ఇతర ముఖ్యమైన కారణాలు.ఆయన రచనలలో స్త్రీ, పురుష సాంగత్యమే జీవన సాఫల్యమైనట్లుండటం నచ్చకపోయినా - దానితో సరిపెట్టుకోలెని బలీయమైన సత్యాన్వేషణను గమనించినపుడు - ఆయనకు నమస్కరించాలనిపిస్తుంది. చలం పట్ల గౌరవానికి మరి రెండు ముఖ్య కారణాలు - ఆయన ద్వారానే టాగొర్ కవిత్వాన్ని చదువుకోవటం, ఆయన ద్వారానే శ్రీ రమణ మహర్షిని తెలుసుకోవటం.
తరువాత నా ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేసిన వారిలో సంజీవదేవ్ ముఖ్యులు. ఆలోచించటంలో, ఆలోచనని వ్యక్తీకరించటం లో ఆయన చూపే సంయమనం, అతిసూక్ష్మమైన పరిశీలనా విధానం తప్పనిసరిగా నేర్చుకోవలసిన వనిపిస్తుంది. నేను చదివినంతలో ఆ లక్షణాలు, గురజాడ తరువాత ఆయనలోనే చూసాను.
మీ కవిత్వరచనపై తొలి ప్రభావాలెవరివి
తొలిరోజుల్లో శ్రీశ్రీ ప్రభావం తప్పక ఉంది. దృక్పథం మారిన తరువాత - నా తొలి కవితా సంపుటి ఆరాధన రాసినపుడు - నా పైన టాగోర్ ప్రభావం గాఢంగా ఉంది. ఆ సంపుటి చదివిన మిత్రులు కొందరు 'గీతాంజలి చదువుతున్నట్లుంది ' అనేవారు. ఇది స్థాయి గురించిన మాట కాదు, గీతాంజలిలోని వాతావరణమే ఆరాధనలో కనిపిస్తుందని.
మీకు హైకూలు రాయాలని ఎందుకనిపించింది?
86 ప్రాంతాలలో ఆరాధన కవిత్వం రాసినపుడు - దానిలోని మొదటి కవిత - 'సామ్రాజ్యాలను జయించినా, కీర్తి విస్తరిల్లినా - చిరుగాలికి ఊగే పచ్చగడ్డిమీది నుండి జారిపడే - మంచుబిందువుని చూసి - మౌనంలో పడకపోతే - జీవితపు విలువలు తెలియవు ' అని వుంటుంది. నాకు స్పష్టంగా తెలియకుండానే - ఒక స్వచ్ఛమైన దృశ్యం గాఢమైన మౌనానుభవాన్నిస్తుంది - అనే భావం నాలో ఉంది. అంతే కాకుండా, 'చెప్పేదేదో స్పష్టంగా, సూటిగా చెప్పి - ఇంత మౌనానికీ, ధ్యానానికీ, కార్యాలకీ, విజయాలకీ వ్యవధినివ్వరాదా ' అన్న చలం కోరిక కూడా నాలోపల సదా పనిచేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో సంజీవదేవ్ వ్యాసాలలో హైకూని గురించి చదివినపుడు, ఈ ప్రక్రియ నాకు తగినదిగా అనిపించి హైకూలు రాయటం ప్రారంభించాను.
మీ హైకూ పరిణామక్రమం చెప్పండి?
తొలి హైకూలు, అప్పటికి వ్యక్తిగతంగా కూడా పరిచయం వున్న ఇస్మాయిల్‌గారికి చూపించినపుడు, నిజానికి అంత బాగోకపోయినా ఆయన బావున్నాయనటం, తరువాతికాలంలో ఇస్మాయిల్‌గారి హైకూలు పత్రికలలో రావటం, అవి తెలుగు సాహిత్య ప్రపంచాన్ని ఆకర్షించటం జరిగాయి. అట్లా హైకూలకు కావలసిన భూమిక ఏర్పడటంతో, విస్తృతంగా హైకూలు రాయటం, పత్రికలకు పంపించటం జరిగింది. తరువాత వాటిని 'దృశ్యాదృశ్యం ' పేరుతో సంపుటిగా తీసుకువచ్చినపుడు - బి.వి.వి.ప్రసాద్ అనే కవి తెలుగు సాహిత్యలోకానికి పరిచయమయ్యాడు. ఆ హైకూలు చదివి నాసరరెడ్డి 'ఆలంకారికత భారతీయ కవులకి సమస్య. అలంకారాలు లేకపోతే హైకూ బాగుంటుం 'దనటం, హైకూని గురించి పునరాలోచింపచేసింది. అపుడు కంజిర కవిత్వ పత్రిక ప్రచురించిన నాసరరెడ్డి అనువదించిన జపనీయ హైకూలనీ, ఇతరత్రా కొన్ని ఆంగ్లానువాదంలో లభ్యమైన హైకూలనీ చదివినపుడు, ఇంత సరళంగా, సూటిగా, నిరలంకారంగా ధ్యానానుభవాన్ని కలిగించవచ్చుకదా అనుకొంటూ, ఆ ప్రయత్నంలో భాగంగా రాసిన హైకూలతో 'హైకూ ' సంపుటిని రాయటం, తరువాత స్పష్టమైన అవగాహనతో 'పూలు రాలాయి ' హైకూ సంపుటిని రాయటం జరిగాయి.
'పూలు రాలాయి ' హైకూ సంపుటిలో, హైకూ పితామహునిగా భావించే బషో హైకూని ఎలా భావించాడో, అలాగే రాయగలిగానని నమ్ముతున్నాను. దృశ్యాదృశ్యం, హైకూ సంపుటాలలో కూడా ధ్యానానుభవాన్ని ఇవ్వటానికి ప్రయత్నించినా, స్వచ్ఛమైన హైకూ అభివ్యక్తి పూలురాలాయి నాటికి నాకు అలవడిందనుకొంటాను.
హైకూలు రాయటం ఎందుకు ఆపేసారు?
దీనికి ముఖ్యమైన కారణాలు మూడు. ఒకటి. నేను వ్యక్తీకరించాలనుకొన్న భావాలకు, ఇవ్వదలచిన కవిత్వానుభవానికి అన్నిసార్లూ హైకూ అనే కాన్వాస్ తగినది కాకపోవటం. ఒక విస్తృత అనుభవాన్నీ, ఒక ఆలోచనా ప్రవాహాన్నీ హైకూ ఆద్యంతం అందించటానికి తగినది కాదు. నిజానికి హైకూ అనుభవం కవితో పాటు, పాఠకుని మన:పరిపక్వత మీద, సంసిద్ధత మీద ఆధారపడివుంటుంది. వచనకవిత్వంలో కవికి వాతావరణాన్ని సృష్టించే వీలు కొంతవరకూ ఉంటుంది. అలాగే, ఒక ఆలోచనను మొదటినుండీ నడిపించే వీలుంటుంది. రెండవది. హైకూ కేవలం ప్రకృతిని మాత్రమే వస్తువుగా కలిగి వుంటుంది. సమాజ విషయాలనూ, మానసిక సంక్లిష్టతనూ హైకూ వంటి ఉదాత్త ప్రక్రియ ఆవాహన చేయలేదు. అందువలన సంక్లిష్ట మానవ మానసిక ప్రపంచాన్ని ఆవిష్కరించటం హైకూలో సాధ్యం కాదు. మూడు. సగటు తెలుగు పాఠకులూ, కవులూ హైకూ అనుభవాన్ని అందుకోగలిగిన అనుభవసాంద్రతా, లోతైన ఆలోచనాశక్తీ ఉన్నవారు కాదు. ఈ స్థితివలన, వారు హైకూ స్థాయికి ఎదగటానికి బదులు, హైకూని తమస్థాయికి అవనతం చేస్తారు. అనాదరణ ఏ కళాకారుడినైనా నిరుత్సాహపరుస్తుంది.
మరలా వచన కవిత్వం రాస్తున్నపుడు మీపై ఎవరి ప్రభావాలైనా ఉన్నాయా?
మరలా వచన కవిత్వం రాస్తున్నపుడు, హైకూల ద్వారా ఏ ధ్యానానుభవాన్ని, ప్రగాఢమైన నిశ్శబ్దాన్ని, నిర్మల హృదయ స్పందననీ ఇవ్వటానికి ప్రయత్నించానో, దానినే వచన కవిత్వంలో కూడా వ్యక్తీకరించాలనుకొన్నాను. హైకూలకు భిన్నంగా, కొంత భూమికనీ, కొంత వాతావరణాన్నీ సృష్టించటం వచనకవిత్వంలో సాధ్యమౌతుంది గనుక, అలాంటి వాతావరణాన్ని ఆవిష్కరించటానికి ప్రయత్నించాను. అభివ్యక్తిలో హైకూలో ఉండే సరళతనీ, అవసరమనిపిస్తే తప్ప నిరలంకారంగా రాయటాన్నీ ప్రయత్నించాను.
నా అభివ్యక్తిపైన, సరళమైన పదాలతోనే గాఢానుభవాన్ని కలిగించే ఇస్మాయిల్‌గారి ప్రభావం ఉందనుకొంటాను. ముఖ్యంగా కవులు సాధారణంగా పాటించే రొమాంటిక్ టోన్‌ని, అంటె, ఒక ఉద్వేగాన్నో, వస్తువునో పట్టుకొని అదే జీవితమైనట్లు వ్యక్తీకరించటం విడిచిపెట్టి, ప్రశాంతస్వరంతో మాట్లాడటంపై ఇస్మాయిల్‌గారి ప్రభావం ఉంది. అగాధమైన ఆలోచననీ, భావగాంభీర్యాన్నీ నింపుకొన్న అతి సహజమైన, ప్రశాంత వాక్యం ఆయన కవిత్వంలో చూసాను.
అలాగే శివారెడ్డిగారూ, ఈ కాలం కవులలో కొందరూ, ఒక దృశ్యాన్ని లేదా మానసిక చలనాన్ని ఎంత మృదువుగా, ఎంత చైతన్య స్పృహతో తాకుతున్నారో గమనించాను. బహుశా మన కవిత్వ వాతావరణంలోని ఎసెన్స్ - సారమే నా కవిత్వ వ్యక్తీకరణలో ఉందనుకొంటాను. అయితే నా కవిత్వంద్వారా నేను వ్యక్తీకరించిన భావాలపై ఎవరి ప్రభావమూ లేదు. కొంతవరకూ టాగోర్, ఖలీల్‌జిబ్రాన్‌ల ప్రభావం ఉందనుకొంటాను. అయితే ఈ సాంద్రమైన భావాలకు మూలాలు ఎక్కడ ఉన్నాయంటే, నేను చదువుకొన్న తత్వచింతనలో ఉన్నాయనుకొంటాను.
ఎవరెవరి తత్వచింతన ప్రభావం ఉంది?
శ్రీ రమణమహర్షి, శ్రీ నిసర్గదత్త మహరాజ్‌ల ప్రభావం ఎక్కువగా ఉంది. జీవితానికి సంబంధించిన అనేక మౌలిక ప్రశ్నలకు, తర్కబద్దమైన సమాధానాలను వారినుండి గ్రహించాను. తరువాత ఓషో, జిడ్డు కృష్ణమూర్తీ వంటి ఆధునిక తాత్వికుల చింతనా, ప్రాచీనకాలంనాటి స్వరూపవర్ణన చేసే శాస్త్రాలూ, శ్రీ శంకరుల సాహిత్యం నాకు అందినంత వరకూ చదువుకొన్నాను. ఆయా పుస్తకాలు చదువుకొన్నాను అనటం కన్నా, వాటిలోని కొన్ని భావాలనైనా భావించగలిగాను, ధ్యానించగలిగాను అనటం సరైనదనుకొంటాను.
వాటితోపాటు అపుడపుడూ భిన్న దేశాల, మతాలకు చెందిన జ్ఞానుల, అన్వేషకుల మాటలు ఎక్కడైనా చదివినపుడు, వీరందరూ ఒకటే సత్యం చెబుతున్నారు కదా అనిపించేది. దక్షిణ అమెరికాలోని రెడ్ ఇండియన్ జాతికి చెందిన డాన్ జువాన్, యూరపులోని సోక్రటీస్, గుర్జిఫ్, పశ్చిమాసియా ప్రాంతపు జీసస్, సూఫీలు, భారతీయ రుషులు, తూర్పు ఆసియా ధ్యాన బౌద్ధులు.. అందరూ ఒకే సత్యమనే సూర్యుడినే వేరువేరుకాలాల్లో ధ్యానించినట్లూ, కీర్తించినట్లూ గమనించి ఆశ్చర్యమూ, సంతోషమూ కలిగేవి. జ్ఞానాన్వేషణకీ, మతానికీ తప్పనిసరిగా ఆలోచనాపరులందరూ గమనించాల్సిన భేదం ఉందనిపించేది.
ముఖ్యంగా కొత్త తరాన్ని ఓషోని అధ్యయనం చెయ్యమని చెప్పాలనిపిస్తుంది. ఆయన సత్యానికీ, కేవల తాత్విక చింతనకీ, మతానికీ నడుమ ఉన్న సరిహద్దుల్ని స్పష్టంగా గుర్తించి, ప్రపంచమంతటా ఉన్న సత్యాన్వేషణను చాలా సహజ సుందరమైన శైలిలో పరిచయం చేసారు. అయితే తగినంత సూక్ష్మబుద్ధి లేకపోతే, ఆయన బోధనలను దురాన్వయం చేసుకొనే అవకాశం ఉంది. ఇది నిజానికి, సత్యానేషణ తో ఎప్పుడూ ఉండే సమస్య.
అయితే మీ తత్వచింతన ప్రభావం మీ కవిత్వంపైన ఉండివుంటుంది.
అవును. అయితే ఇలా రాసినవారు నేను మాత్రమే కాకుండా, మన ప్రాచీనులలో పోతన, వేమన, కబీరు వంటివారు, ఇతర దేశాలలో కొందరు కవులు ఇలాగే కవిత్వం రాసినట్టు కనిపిస్తుంది. అయితే ఖలీల్ జిబ్రాన్ మినహా, ఏ విదేశీ కవినీ నేను చదవలేదు. ఇలాంటివారిని మనం మిస్టిక్ పొయెట్స్ (మార్మిక కవులు)గా భావిస్తాం. కొందరు భక్తి కవిత్వాన్ని మార్మిక కవిత్వంగా భావిస్తారు కాని, నిజానికి సత్యాన్వేషణా పూర్ణమైనదే మార్మిక కవిత్వమనీ, అటువంటి సత్యానేషణతో నిండిన భక్తి కవిత్వం మాత్రమే మార్మిక కవిత్వంగా భావించవలసి ఉంటుందనీ నాకు అనిపిస్తుంది.
ఇప్పుడున్న వాదాల పట్ల మీ అవగాహన ఏమిటి?
ఇప్పుడున్న సామాజిక, రాజకీయ వాదాల పట్ల నా అవగాహన అంతంత మాత్రమే. లోతుకంటా తెలుసుకొనే శక్తీ, ఆసక్తీ లేనపుడు తటస్తంగా ఉండటమే సరైనదనుకొంటాను. ఈ సమస్యలు తాత్కాలికమనీ, ఒక మనిషి లోలోపలి అస్తిత్వవేదనకు ఇవి పైపై వ్యక్తీకరణలనీ అనిపిస్తుంది. మనిషి తనలోనికి చూడకుండా, ఎదగకుండా ఉన్నంతకాలం, సమస్యలు ఒకరూపంలో పరిష్కారమైతే, మరొకరూపంలో తలెత్తుతూనే ఉంటాయి. సమసమాజం కూడా ఒకనాటికి మానవజాతి మానసిక పరిణతి ద్వారా మాత్రమే సిద్ధిస్తుందనుకొంటాను. అయితే సామాజిక, రాజకీయ పరిణామాలు మార్పు చెందుతూనే ఉంటాయి. మానవజాతి సుదీర్ఘప్రస్థానంలో అకస్మాత్తుగా ఏ స్థిరమైన, చివరి మార్పూ సంభవించదు.
కొన్ని మౌలికమైన వాదాలు ఎప్పుడూ ఉంటాయి కదా?
కొన్ని మౌలికవాదాలలో నా అభిమాన విషయాలు ఇలా ఉన్నాయి. వ్యక్తిసంస్కరణ, రాజకీయసంస్కరణలలో వ్యక్తిసంస్కరణ వాదం, బుద్ధి, హృదయవాదాలలో హృదయవాదం, భౌతిక, అధిభౌతికవాదాలలో అధిభౌతికవాదం నా అభిమాన విషయాలు. సాహిత్యంలో రస, ప్రయోజనవాదాలలో రసవాదం ఇష్టం. అయితే రసావిష్కరణ సమాజహితం కొరే దిశగా జరగాలే కాని, సమాజానికి హానిచేసే ప్రేరణలను కలిగించకూడదని నమ్ముతాను.
అట్లాగే స్త్రీ, పురుషవాదాలలో స్త్రీవాదం ఇష్టమైనది. అయితే, ఇది స్త్రీ పురుషునితో సమానం కావాలనే స్త్రీవాదం కాదు, పురుషుడు స్త్రీతో సమానం కావాలనే స్త్రీవాదం. అంటే, దయ, ఓర్పు, క్షమ వంటి మానవవిలువలు స్త్రీ సహజమైన గుణాలు అనుకొంటే, అలాంటి గుణాలను పురుషులు కూడా అనుసరించాలని.
మీరు అభిమానించే వాదాలే సరైనవని భావిస్తున్నారా?
నేను అభిమానించే వాదాలకు రెండవవైపున ఉన్నవి వ్యతిరేకమైనవి కావని, ప్రతి రెండు విరుద్ధశక్తులూ, పరస్పర శత్రువులు కావనీ, పరస్పర పూరకాలనీ, ఒకదాని మనుగడ, పరిణతీ, వికాసం రెండవదానిపైన ఆధారపడి ఉన్నాయనీ భావిస్తాను. విరుద్ధశక్తుల సమన్వయం పట్ల తీవ్రమైన శ్రద్ధగలవారు జీవితం లోతుల్నీ, విస్తృతమైన జీవితానుభవాన్నీ అందుకోగలుగుతారనీ అనుకొంటాను. విరుద్ధశక్తుల యుద్ధక్షేత్రంలో ఎటూ ఒరిగిపోకుండా తనను తాను వెదుకుకొంటూ నిలబడినవాడు అగాధమైన జీవనభూమికలలోకి మేలుకొంటాడనీ, అతను తన మానవజాతి పట్లా, సమస్తజీవితం పట్లా నిష్కపటమైన ప్రేమను ప్రకటించగలుగుతాడనీ అనిపిస్తుంది. అటువంటి అగాధమైన ప్రేమను ప్రకటించటమే కవుల, కళాకారుల బాధ్యత అనీ, ఆ బాధ్యత మనం సవ్యంగా నిర్వర్తించగలిగితే, అది మొత్తం మానవజాతిని ప్రభావితం చేస్తుందని, కాలాంతరంలో మరింత మేలైన మానవసమాజం నిర్మించబడటానికి ఒక కవీ, కళాకారుడూ తనవంతు 'అశ్రువొక్కటి ధారపోసిన ' ట్లవుతుందనీ నమ్ముతున్నాను.
ఇవాళ్టి సమాజంలోని సమస్యలకు కారణాలేమనుకొంటున్నారు?
మానవాళి పోగుచేసి ఉంచుకొన్న అసమానతలూ, అర్థంలేని గర్వాల తోపాటు, ఇవాళ్టి జీవనవిధానం కూడా. ఇవాళ్టి మానవజాతికి జీవితం పట్ల శ్రద్ధలేదు, చిత్తశుద్ధి తక్కువ. సమాజానికి మార్గనిర్దేశం చేయవలసిన తాత్వికులూ, మేధావులూ, కవులూ, కళాకారులూ, నాయకులూ, వినోద, ప్రసార మాధ్యమాలూ, అందరికీ స్వీయగౌరవమూ, స్వప్రయోజనమే పరమావధిగా ఉంది. వాటి నిమిత్తం వారుకూడా మానవ విలువల్నీ, సత్యనిష్టనూ పూర్తిగా ఉపేక్షిస్తున్నట్లు కనిపిస్తుంది. వారే సరిగా లేకపోతే, స్వంతంగా బలమైన ఆలోచనలేని, ప్రభావాలలో పడి కొట్టుకుపోయే సగటు మనుషుల సంగతి చెప్పేదేముంది. అంతగా తెలివి వికసించనివారిని ఆకర్షించటం కోసం, తెలివైనవారూ అవివేకంగా ప్రవర్తించటం ఇవాళ్టి విషాద జీవనశైలికి ఒక ముఖ్య కారణమనిపిస్తుంది. మరొకటి. సాంకేతికంగా వస్తున్న వేగవంతమైన పరిణామాలను, మానవ హృదయం అందుకోలేకపోవటం. అందువలన వినియోగ సంస్కృతి పెరిగి, హృదయం మరింత మూసుకుపోతుంది.
మరి ఈ వ్యవస్థను మార్చటమెలా?
వ్యవస్థను మార్చదలచినప్పుడు, అది పిల్లల విద్యావిధానం దగ్గర మొదలు కావాలి. పిల్లలకు మానవవిలువలతో నిండిన జీవితం పట్ల సమగ్రమైన, శాస్త్రీయమైన అవగాహన చిన్ననాడే కలిగించాలి, అందరూ సమానమనే స్పృహ అప్పుడే రావాలి. జీవితమంటే వస్తువినిమయం కాదనీ, జీవితం లోతుల్లో - మనిషి మాత్రమే గ్రహించగలిగిన, గ్రహించవలసిన సత్యమూ, సౌందర్యమూ ఉన్నాయనే ఎరుక కలగాలి. అటువంటి విద్యావ్యవస్థలో తయారైన తరం అసమానతల నుండీ, హింస నుండీ మానవజాతిని శాశ్వతంగా విముక్తి చెయ్యగలుగుతుంది.కానీ, సమాజ పరిణతికి విద్య చాలా ముఖ్యమైన భూమిక అనే అవగాహనే ఇంకా మన ఆలోచపరులు చాలామందికి రాలేదు. అందువలనే ఉన్న మానవవిలువలు కూడా లుప్తమైపోతున్న సాంకేతిక విద్యల పట్ల మనకు మోజు పెరుగుతుంది.
యుక్త వయసు దాటిన వాళ్ళు బలవంతంగానో, మరేవిధంగానో తయారుచేసే వ్యవస్థలు కొంత ప్రయోజనం కలిగించినా, కొత్త సమస్యలను మోసుకువస్తాయి. ఇవి వ్యాధి మూలాన్ని వదిలి పైపైన మందు వెయ్యటం లాంటివి అనిపిస్తుంది. మితిలేని స్వార్ధం, గర్వం - తెలివితక్కువతనమూ, హీనమూ అనే జ్ఞానం పెరగాలి. అటువంటి వివేకం వలన మాత్రమే శాశ్వత పరిష్కారాలు లభిస్తాయి కాని, ఉద్వేగాలవల్ల కాదు. మానవ విలువలు పాటించటం కేవలం పాతకాలం నీతికాదనీ, సమగ్రమైన జీవితానుభావానికీ, ప్రశాంతమైన సామాజిక జీవనానికీ ఆ విలువలు వైజ్ఞానిక సూత్రాలనీ మనకి అర్థం కావాలి.
మానవ విలువలంటే?
దయ, ఓర్పు, నిజాయితీ, శ్రద్ధ, వినమ్రత, క్షమ, స్నేహం, పంచుకోవటం వంటివి. ఇవి ఏ ఒక్క ప్రాంతానికో, జాతికో, మతానికో, సిద్ధాంతానికో సంబంధించినవి కాదు. సమస్త మానవాళి హృదయ స్పందనకు చెందినవి.
మీ హైకూ సంపుటాల తరువాత చాలాకాలం ఏమీ రాసినట్లులేరు, తరువాత అకస్మాత్తుగా ఆకాశం సంపుటి ప్రకటించారు, ఇలా ఎందుకు జరిగింది?
హైకూలు రాసే సమయంలోనే, వచన కవిత్వాన్నీ సాధన చేస్తూ వచ్చాను. అట్లా రాసినవన్నీ కలిపి, 2006లో 'నేనే ఈ క్షణం ' ప్రచురించినా, వాటిలో ఎక్కువ భాగం 2000కు ముందు రాసినవే. అలాగే 2011లో వచ్చిన ఆకాశంలోనూ 2010కి ముందు రాసినవి ఆరు మాత్రమే. వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులూ, కవిత్వమెవరికి కావాలన్న అనాసక్తీ, కవిత్వానుభవాన్ని మించిన జీవితానుభవం కోసం వెదుకులాటా - ముఖ్యంగా ఈ మూడింటి వలనా ఒక దశాబ్దకాలం కవిత్వానికి దూరంగానే ఉన్నాను.
ఒడిదుడుకుల నుండి తేరుకొన్న తరువాత, కవిత్వం రాసే, చదివే కొద్దిమంది మిత్రులూ కలిసినప్పుడల్లా మీరు కవిత్వం రాయాలనటం, ముఖ్యంగా శివారెడ్డిగారి వంటి కవి ఇంత ప్రతికూల పరిస్థితులలోనూ, ప్రతి ఒకటిరెండు సంవత్సరాలకూ నిండైన కవిత్వంతో సంపుటులు ప్రకటించటం, ఎక్కడన్నా కలిస్తే నువ్వు రాయవేమిటని ప్రశ్నించటం, శ్రద్ధగా తన సంపుటాలు పంపించటం, స్థానిక మిత్రులు కొప్పర్తిగారు వత్తిడి చేయటం - వీటన్నిటితో మరలా రాయాలనిపించి, సుమారు 3,4 కవితలు రాసిన తరువాత, ఇన్ని సంవత్సరాలుగా నిద్రాణంగా ఉన్న శక్తి ఏదో మేలుకొన్నట్లయి, సుమారు 3,4 నెలల కాలం పూర్తిగా నన్ను వశపరచుకొన్నట్లనిపించింది. ఒకేరోజు 3,4 కవితలు కూడా వచ్చేవి. వందకుపైగా రాసాక, ఒక సంపుటికి సరిపోతాయనిపించటమో, వచ్చినవే పునరుక్తి అవుతున్నాయనిపించటమో, నెమ్మదిగా ఆ అభివ్యక్తి ఆగిపోయింది. అయితే, ఇట్లా ఒకేసారి రాయటం అనేది, హైకూ సంపుటాలు వేసినపుడు కూడా జరిగేది. 50,60 హైకూలు ఉండగా సంపుటి వేద్దామనుకొంటే ఒకటి, రెండు నెలల్లోనే మరొక వంద హైకూలు వచ్చేవి.
ఆకాశం కవిత్వం మీరు అంతకుముందు రాసిన కవిత్వం కంటే ప్రత్యేకంగా ఉన్నట్లుంది, ఇది ఎలా జరిగింది?
ఆకాశం కవిత్వంలోని అభివ్యక్తికీ, భావాలకీ (ఫారం, కంటెంట్)సంబంధించిన భూమిక ఇంతకుముందు మాట్లాడుకున్నాం. అయితే ఆకాశం కవిత్వం రాస్తున్నపుడు, నాకు నేను కొన్ని నియమాలు లేదా గైడ్‌లైన్స్ పెట్టుకొన్నాను. పాఠకుడికి మరింత తేలికగా కమ్యూనికేట్ కావాలి. పాఠకుడు మొదలుపెడితే చాలు, చివరివరకూ చదివించటానికి తగిన వేగం ఉండాలి. ఏ భావాలు చెప్పినా, ఎప్పుడూ ఉండే సున్నితత్వంతో పాటు, ప్రగాఢమైన దయ అంతర్లీనంగా ఉండాలి. తాత్వికానుభవాన్ని మరింత స్పష్టంగా అందించాలి. కవిత్వం పూర్తిగా గొంతువిప్పి మాట్లాడుతున్నట్లుండాలి.. ఇలాగ. నేను పెట్టుకొన్న నియమాలన్నిటినీ చాలా వరకూ పాటించగలిగాననే సంతృప్తి కలిగింది.
ప్రతిస్పందన ఎలా ఉంది?
పుస్తకం అచ్చయి మిత్రులకు చేరిన తరువాత, రెండు, మూడు రోజులకి ఒక మిత్రుడు ఫోన్ చేసి 'ఆకాశం చదువుతుంటే నాలోపలి గందరగోళం, చిక్కుముడులూ, భ్రమలూ అన్నీ విడిపోతున్నాయి. ఎందుకో ఆగకుండా కన్నీళ్ళు వస్తున్నాయి ' అన్నాడు. అయితే నా పుస్తకం, నేను ఆశించిన గమ్యం చేరింది అనుకొన్నాను. తరువాత కూడా ఒక్కొక్కరుగా చాలామంది ఇలాగే హృదయంలోంచి కదిలి ఫోన్ చేస్తున్నారు. చిత్రమేమిటంటే, మేధావులు, సీరియస్ పాఠకులు అయినా, కాకపోయినా ఇంకా లోపల ఏమాత్రమో సరళత్వం, సజీవహృదయ స్పందనలు ఉన్న ప్రతివారిని ఇవి కదిలించటం. నేను గమనించినది ఏమిటంటే, కవిని తెలుసుకొనేందుకో, కవిత్వాన్ని తూకం వేసేందుకో కాకుండా, కేవలం తమను తాము వెదుక్కొనేందుకు ఆకాశం చదువుతున్న ప్రతి ఒక్కరూ, ఈ పుస్తకాన్ని హృదయానికి హత్తుకొంటున్నారు. ఇన్నాళ్ళ నా కవిత్వ ప్రయాణం ఒక ముఖ్యమైన మజిలీ చేరిందనుకొంటున్నాను.
(జనవరి - మార్చి 2012 జయంతి త్రైమాసిక సాహిత్య పత్రికలో వచ్చిన నా అభిప్రాయాలను, మరింత సమగ్రం చేసి.. )
బావుంది ఇంటర్వ్యూ. చక్కగా, స్పష్టంగా, విపులంగా మీ సమాధానాలు కూడ బావున్నై. మీ కవిత్వ సంపుటాలు సంపాదిస్తాను.
రిప్లయితొలగించండిధన్యవాదాలు నారాయణస్వామి గారూ, కవిత్వ సంపుటాలు తప్పక ఆనందం కలిగిస్తాయి..
తొలగించండినారాయణ స్వామి గారి మాటే నాదీనూ. చాలా స్పష్టంగా ఉన్నాయండీ మీ సమాధానాలు. చదవడం ఒక మంచి అనుభూతిని మిగిల్చింది. మీ కవిత్వం ఎట్లా ఉంటుందోనన్న ఆలోచనలకు కొత్త రెక్కలొచ్చాయి ఇది చదివిన తరువాత.
రిప్లయితొలగించండికొంత మందితో పరిచయాలు చాలా ఉత్సాహపూరితంగా ఉంటాయి. మీతో ఈ రోజు సాగిన కాసిన్ని ఉత్తరాలూ నా వరకూ అమూల్యమైనవే. మీకు మరొక్కసారి కృతజ్ఞతలు./
-మానస
ధన్యవాదాలు మానసగారూ, కవిత్వ సంపుటాలు తప్పక ఆనందం కలిగిస్తాయి..
తొలగించండిపుస్తకాలు మీకు ఎప్పుడు చేరతాయా, వాటిగురించి మీ ఉత్సాహకరమైన మాటలేమి వింటానా అని ఎదురుచూస్తాను