కాస్త కనికరం చాలు
పొడిపొడిగా చీకటి రాలే రాత్రులవేళల
పగలు కురిసి, కొత్త గాయాలు చేర్చి
మరింత బరువైన నిన్ను మిగిల్చే వేళల
ఒక కుక్క పిల్లయినా కావచ్చు
నీలో కాస్త కనికరం కలిగిస్తే చాలు
జీవితం అమాయకమైనది
జీవులు మరింత అమాయకులు
మాయకంబళిలో ఊపిరాడని జీవితాలివి
ఎవరు పన్నారో ఈ వల
తెలిసినవారెవరూ కనిపించరు
కాస్త కనికరం చాలు
నిన్ను నేనూ, నన్ను నువ్వూ
క్షమించటానికి, ప్రేమించటానికి
కనికరం దేవునికి దగ్గర దారి
ఈ రాత్రి వెలుగుతుంది
నక్షత్రాలతో, చంద్రరేఖతో
అమ్మ ఒడిలా విశ్రాంతి నిచ్చే చీకటితో
రాత్రి లోపల నువ్వూ వెలుగుతావు
కాస్త దయతో, ప్రేమతో
వెలుతురు వస్తుందంటే
ఒంటరితనపు భయం కమ్ముతుంది
పగలెంత కఠినంగా ఉండనీ
పగటి చివర రాత్రి వస్తుంది
నిద్ర పడుతుంది
కలల సంగీతం అణిగాక
దైవం నిన్ను గుండెలపై పెట్టుకుని
లాలనగా, రేపు బ్రతికే ధైర్యం ఇస్తుంది
మరి కాసేపు బ్రతికి ఉండు
జీవితంపై కాస్త కనికరం చూపు
దైవంపై కాస్త దయ దాల్చి ఓర్పు వహించు
10.7.24 11.20 PM