23 అక్టోబర్ 2024

కవిత : నువ్వు నువ్వులా

1
నువ్వు నువ్వులా ఉండగలిగే క్షణాల ముందు
మిగిలిన నీ జీవితమంతా
ఒక గడ్డిపోచ అని తెలుస్తుందా

2
దయ వలనో, దోషాలు ఒప్పుకునే ధైర్యం వలనో
నీ కళ్ళలో నీళ్ళు తిరిగినప్పుడు
నీకు నువ్వు మాత్రమే మిగిలే క్షణాల్లో
ఎంత ప్రీమాస్పదుడిగా ఉంటావో తెలుస్తుందా

3
జీవితం వడ్డించిన విస్తరి కానీ,
ముళ్ళకంపల మీద నడక కానీ
నిటారుగా నిలిచి బలమైన నిట్టూర్పు వదిలినపుడు
ఏయే గగనతలాలకి విస్తరిస్తావో గమనించావా

4
పదేపదే పాడుతున్న పదాల సారం ఒకటే
'ప్రేమించు నువు బతికి ఉండటాన్ని '
ప్రేమించు పంచరంగుల ప్రపంచాన్ని
పచ్చదనంగా పక్వమయే సూర్యకాంతిని
వెన్నెలనీ, వెన్నెలలోని వేదననీ, క్షమనీ, లాలననీ

5
ఏమంత సమయం కాదు
ఇక్కడ నడిచేది, నవ్వేది, ఏడ్చేది
వెళ్ళాక నీ పాదముద్రలు మిగిలేది లేదు

నీ కనికరం నీ సంపద, నీ నింద నీ లేమి
నీ చివరి చిరునవ్వు జీవితానికి ఇచ్చే కానుక
నీ చివరి దిగులు శాపం

6
ఏమంత సమయం లేదు
ఈలోపల ఊరికే ప్రేమించు
లోకం సంగతి లోకం చూసుకుంటుంది
ప్రేమిస్తావా లోకాన్ని దాటి బతుకుతావు

- బివివి ప్రసాద్
22.3.24 11.49PM 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి