21 అక్టోబర్ 2024

కవిత : నగ్నంగా..

1
'విలువలనీ, భయాలనీ విప్పుకొని
ఒక్కసారైనా నగ్నంగా దూకగలవా
ఇదే జీవితం అని గట్టిగా అనిపిస్తున్న
ప్రేమలోకో, అందంలోకో, అనుకంపనలోకో'
అడుగుతారు నీలోపలి నుండి
అవునంటావో, జాగ్రత్త పడతావో 
అక్కడ వుంటావు ఇవాళ్టి నీ నువ్వు

2
వేల బంగారు ఉదయాలు
శిరసు మీదుగా ప్రవహించిపోయాయి
వెన్నెల రాత్రులూ, మేఘబాలల ఆటలూ కూడా
పూలు పూచాయి అనేకమార్లు
పసిపిల్లలు నవ్వారు నీ కళ్ళలోకి
'ఎప్పుడైనా బతికావా కాసిని క్షణాలు,
జీవితంపై నిందలు మోపే ముందు' 
అంటారు ఆ లోపలి మనిషి

3
'జీవించటం ఎప్పటికీ సమస్య కాదు,
ప్రాణం నిలుపుకోవడం కావచ్చు గానీ
కొన్నిసార్లైనా నిజంగా జీవిస్తే ప్రాణం పై ఆశ ఉండదు,
జీవించలేదా బతికిన అందం లేదు' అని నిట్టూరుస్తారు

4
నీ ద్వారా తనని తాను కావలించుకోవటం మినహా
జీవితానికి మరే గమ్యమూ, అర్థమూ లేదంటే
నమ్మగలవా, కనీసం వినగలవా
ఈ మాటలు అవతల పెట్టు
కంటి ముందున్న దృశ్యం లోపల ఏముందో పరిశీలించు
వినిపించే శబ్దాల లోపలి ఏకాంతాన్ని గమనించు
ఒక్క క్షణం నిన్ను విడిచి జీవితం నదిలోకి ప్రవేశించు

5
ఇంకా మనం ఉన్నామా..

19.3.24 11.20PM 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి