ఈ వానరాత్రి రోడ్ల పై ఎవరూ లేరు
తాగినవారు మినహా
వాళ్ళు తిరుగుబాటుదారులు కాదు
కనీసం, అయోమయంలో ఉన్నారు
ఏమిటీ ప్రపంచమని
వానచప్పుడు ఒడిలో వాలి
మనుషులు సుఖంగా నిద్రిస్తున్నారు
తమవా రనుకొంటున్నవారి మధ్య భద్రంగా
ఎప్పటికీ ఇలానే ఉంటామని కలలు కంటూ
వానలో తడుస్తూ ప్రపంచం వెలుగుతుంది
మరింత దయతో, జీవన లాలసతో
మరింత దుఃఖంతో, రేపటి మీద ఆశతో
రోడ్లపై దీపాలు వెలుగుతున్నాయి
చినుకుల్లో తడుస్తూ, మెరుస్తూ
మిత్రుడు వెళ్ళవలసిన రైలు
లేటుగా, టైముకే వచ్చి నిలబడింది
కావలించుకొన్న మిత్రుడు
రాత్రిలో, వానలో, రైలులో కరిగిపోయాడు
ఈ వానరాత్రి
ఒక్కడివీ నిలబడిపోయావు
దీనినంతా ప్రేమిస్తూ, దగ్గరగా తీసుకొంటూ
ఎవరూ లేరు ఇక్కడ
ఉన్నా, లేనట్టు ఉన్నారు
వానలో వీధిదీపంలా
వెలుగుతూ, ఆరుతూ
నువ్వూ, ప్రపంచం
- బివివి ప్రసాద్
26.7.24 11.27 PM
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి