17 నవంబర్ 2025

AI పాడిన బివివి ప్రసాద్ కవిత

నీలో కొన్నిసార్లు సంపుటిలోని
పూవు రాలేను కవిత ఏఐ ఇలా పాడింది. 
బావుంది. వినండి.

https://suno.com/s/b07VVHFozcCOFEfp

సృష్టి కి రాసుకున్న ప్రవేశిక :

ఈ కవిత్వం..

ఈ కవిత్వం సాంస్కృతిక వినోదం కోసం కాదు. దుఃఖితుల తరపున ఎవరిపైననో నెపం వేయటానికీ కాదు. జీవితం దుఃఖమయమని తమకి తాముగా గ్రహించిన వారికోసం. దుఃఖవిముక్తి కోసం తమలో తాము పెనుగులాడుతున్న వారి కోసం.

జీవిత పరమావధి దుఃఖమా, ఆనందమా అనే విచికిత్సకు లోనైనవారితో జరిపే సంభాషణ ఈ కవిత్వం. అందం, ఆనందం వెలుపలి వస్తువులా, లోపలి సత్యమా అనే చూపుతో వెదికేవారికోసం ఈ కవిత్వం.

నిజానికి, ఇది, కవిత్వమో, కాదో తెలియదు. ఒక భయ, దుఃఖ కంపిత హృదయపు వెదుకులాట ఈ మాటలు. ఒకడు తన విముక్తి కోసం, అవగాహన కోసం, తాను వెదికే తన లోపలికాంతి కోసం తడుముకొంటూ, తనకి తాను బోధించుకొంటున్నవి. తనని తాను ఓదార్చుకొనే యత్నం ఇవి.

జాతులుగా వేరు విలువలకు చెందినా, హృదయంగా మనుషులు ఒకటనే నమ్మకంతో, తన పెనుగులాటలే ప్రతి హృదయంలో ఉంటాయని భావించి, సాటి మానవులతో పంచుకున్న కన్నీళ్ళు, ఓదార్పులు, సౌందర్యాలు, స్వప్నాలు, తెలియరాని గమ్యాలకి అన్వేషణలు.

ముప్పై, నలభై ఏళ్ళుగా ఏం రాసుకుంటున్నాడో అదే, భిన్నమైన ఛాయల్లో, భిన్నమైన కాంతుల్లో, గాఢతలో, లోతుల్లో మళ్ళీ రాస్తున్నాడు.

పుస్తకం ఎక్కడో ఒకచోట తెరవండి. కొన్ని పంక్తులు చదవండి. ఆగి, లోనికి చూసుకొన్నపుడు, వాటి సారంలో మీకు మీరు కనిపిస్తే, లేదా, అవి మీకు ఊరట కలిగించి వుంటే, ఇవి మీ కోసం రాసినవి. కనబడలేదా, ఇవి మీ కోసం కాకపోవచ్చును, లేదా చదివే సమయం వేరే ఉండవచ్చును.

అందరికీ శుభం కోరుతూ..

బివివి ప్రసాద్
7.11.2025
తణుకు

సృష్టి : బివివి ప్రసాద్ కవిత్వం
144 కవితలు, 250 పేజీలు, 250 రూపాయలు
ప్రతులకు : అనేక బుక్స్, విజయవాడ ఫోన్ :  92472 53884 (అరసవిల్లి కృష్ణ)



15 నవంబర్ 2025

సృష్టి : బివివి ప్రసాద్ పుస్తకం కోసం

సృష్టి కవిత్వం పుస్తకం వారంలో వస్తుంది. 
144 కవితలు, 250 పేజీలు, ధర 250 రూపాయలు. 

ఆసక్తి ఉన్నవారు అనేక బుక్స్, విజయవాడ, ఫోన్ నంబర్ 92472 53884 కి (Arasavilli Krishna) అమౌంట్ పంపిస్తే, పుస్తకం పోస్ట్ లో పంపిస్తారు. 

నచ్చిన కవిత్వం కొని, చదవమని కోరుతూ..




11 నవంబర్ 2025

03 నవంబర్ 2025

కవిత : ఊరట

ఒక పిట్ట ఉత్తరాకాశపు అంచులో తేలి, 
నీ మీదుగా లెక్కలేకుండా ఎగిరి,
దక్షిణాకాశపు అంచులో మునిగినట్లు
ఈ లోకంలోకి ఒక కాలంలో తేలి,
లోకం మీదుగా లెక్కలేకుండా ఎగిరి,
ఒక కాలంలో మునిగిపోవటం కన్నా
ఇక్కడ బ్రతికి, వెళ్ళటానికి
అర్థాలూ, పరమార్థాలూ ఏముంటాయి

ఇన్ని రంగుల ప్రపంచం, 
ఇన్ని వెలుగుచీకట్ల, మిలమిలల, 
దాగుడుమూతల ప్రపంచం కన్నా
ప్రాణంగా ప్రేమించాల్సిన అనుభవమేముంటుంది

ఊరికే పుడతాం మంచులో జారిపడినట్లు,
అదాటున నీటిలోకి మునిగినట్లు,
కలలోనో, ఊహలోనో గాలిలోకి తేలినట్లు,
నీరెండవేళ తేయాకు తోటలో రికామీగా తిరిగినట్లు,
సౌందర్యవతి ముఖాన్ని చంద్రోదయానికి అర్పించినట్లు,
చేప గగనాన్ని పలకరించి నదిలో మునిగినట్లు,
భూమి సారం పూరేకులుగా విప్పారి 
మృదువుగా గాలిని తాకి సెలవు తీసుకున్నట్లు,
తటాలున లోపలినుండి చిరునవ్వు మెరిసి
జీవితమేమీ కారుమేఘం కాదులే 
భయపడకని హామీ ఇచ్చి మాయమైనట్లు

మన ప్రమేయం లేకుండా వచ్చినంత
తేలికగా వెళ్ళిపోతాం, ఏముంటుంది
లోపలి దిగులంతా శీతలగాలికి ఇచ్చి వేసి
రాత్రి గర్భంలోకి ముడుచుకుపోతే చాలు,
అయితే తెల్లవారుతుంది, లేదూ, తెల్లవారదు
అంతకన్నా ఏముంటుంది

బివివి ప్రసాద్
కవిసంధ్య సెప్టెంబర్ 2025

02 నవంబర్ 2025

కవిత : ఏకాంతంలో..

స్నేహితులతో గడిపిన తర్వాత
నీదైన ఏకాంతాన్ని చేరుకుంటావు,
అప్పటి వరకూ ఎదురుచూస్తున్న
దుఃఖశాంతి మృదువుగా సమీపిస్తుంది 

ఒక్కడిగా ఉన్నపుడు నువ్వేమీ కావు,
మంచివీ, చెడ్డవీ, బలశాలివీ, దుర్బలుడివీ 
ఏమీ కావు, కనీసం ఎవరివో తెలీదు

రెండవ మనిషి రాగానే తయారవుతావు 
యుద్ధానికి సిద్ధపడే సైనికుడిలా,
పులిని చూసిన జింకలానో, జింకని చూసిన పులిలానో 
నిన్ను నువు క్షణంలో తీర్చిదిద్దుకుంటావు

చాలాకాలం గడిపావు ఈ నేలపై
ఈ నక్షత్రాల క్రింద, సూర్యకాంతి క్రింద,
రెండవది దుఃఖమని ఇంకా తెలియరాలేదు

ఇతరులతో గడిపాక, నిన్ను పలకరిస్తావు,
సముద్రగర్భంలోని, నీలిగగనాని కావలి 
ప్రశాంత గంభీరమైన నీ సన్నిధికి మేలుకుంటావు

ఇప్పుడు చూడు సుమా,
ఇంత ప్రపంచాన్ని పిండితే
నీకు నువ్వు మాత్రమే సారాంశమై తగులుతావా
ఇతరమేమైనా మిగులుతుందా

ప్రపంచంలో గడిపాక,
ఈత చాలించిన దేహంలా
పరమ ఏకాంతంలో మునిగినపుడు

ఏది సత్యం, ఏ దసత్యం
ఏది నువ్వు, ఏది నేను
ఏది జీవిత మేది మృత్యువు

బివివి ప్రసాద్

01 నవంబర్ 2025

కవిత : లెక్కలు

లెక్కలు దాటగలవా అంటుంది లోపలి ఖాళీ,
అచ్చం ప్రియమైన వ్యక్తిలానే,
నమ్మిన గురువూ, దైవంలానే

సూర్యుడు ఉదయిస్తాడు బంగారుకాంతులతో,
పిల్లలు నవ్వుతారు వెన్నెలలా తెల్లగా, చల్లగా,
పూలు వికసిస్తాయి రంగులు లోకంలో ఒంపుతూ,
చల్లటిగాలి తాకుతుంది తల్లినో, తండ్రినో గుర్తుకుతెస్తూ 

బావుంటాయి కొన్ని క్షణాలు
నువు ఎండుటాకులా రాలినవి,
సముద్రంలోకి కెరటంలా వాలినవి,
నిద్రలోకి మెలకువలా జారినవి

బావుంటాయి, నీకు నువ్వు మిగలనివి,
నిన్ను చెరిపేసుకున్నవి,
చెరిపేందుకు అనుమతించినవి

అవి క్షణాలు, క్షణాలలో దాగిన యుగాలు,
యుగాలలో దాగిన కాలం లేని సమయాలు

లెక్కలు దాటగలవా,
అక్కడుంది రహస్యమంటుంది ఖాళీ గాలి, 
లేదా ఖాళీ ఆకాశం, ఖాళీ ఉద్వేగం, ఉత్త ఖాళీ
..
ఈ మాటలు ముగిశాయా, లేదా..

బివివి ప్రసాద్
ప్రచురణ : సాహిత్యనిధి నవంబర్ 25
పెరుగు రామకృష్ణగారికి ధన్యవాదాలు