03 నవంబర్ 2025

కవిత : ఊరట

ఒక పిట్ట ఉత్తరాకాశపు అంచులో తేలి, 
నీ మీదుగా లెక్కలేకుండా ఎగిరి,
దక్షిణాకాశపు అంచులో మునిగినట్లు
ఈ లోకంలోకి ఒక కాలంలో తేలి,
లోకం మీదుగా లెక్కలేకుండా ఎగిరి,
ఒక కాలంలో మునిగిపోవటం కన్నా
ఇక్కడ బ్రతికి, వెళ్ళటానికి
అర్థాలూ, పరమార్థాలూ ఏముంటాయి

ఇన్ని రంగుల ప్రపంచం, 
ఇన్ని వెలుగుచీకట్ల, మిలమిలల, 
దాగుడుమూతల ప్రపంచం కన్నా
ప్రాణంగా ప్రేమించాల్సిన అనుభవమేముంటుంది

ఊరికే పుడతాం మంచులో జారిపడినట్లు,
అదాటున నీటిలోకి మునిగినట్లు,
కలలోనో, ఊహలోనో గాలిలోకి తేలినట్లు,
నీరెండవేళ తేయాకు తోటలో రికామీగా తిరిగినట్లు,
సౌందర్యవతి ముఖాన్ని చంద్రోదయానికి అర్పించినట్లు,
చేప గగనాన్ని పలకరించి నదిలో మునిగినట్లు,
భూమి సారం పూరేకులుగా విప్పారి 
మృదువుగా గాలిని తాకి సెలవు తీసుకున్నట్లు,
తటాలున లోపలినుండి చిరునవ్వు మెరిసి
జీవితమేమీ కారుమేఘం కాదులే 
భయపడకని హామీ ఇచ్చి మాయమైనట్లు

మన ప్రమేయం లేకుండా వచ్చినంత
తేలికగా వెళ్ళిపోతాం, ఏముంటుంది
లోపలి దిగులంతా శీతలగాలికి ఇచ్చి వేసి
రాత్రి గర్భంలోకి ముడుచుకుపోతే చాలు,
అయితే తెల్లవారుతుంది, లేదూ, తెల్లవారదు
అంతకన్నా ఏముంటుంది

బివివి ప్రసాద్
కవిసంధ్య సెప్టెంబర్ 2025

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి