17 జూన్ 2025

కవిత : కలల పిల్లలు

ఈ లోకం నచ్చకనో, చాలకనో
కొందరు కవులవుతారు,
కలలలోకీ, కళల లోకీ జారతారు

మామూలు మానవలోకానికేమి 
అన్నిటినీ కలుషితం చేస్తుంది
జ్ఞానాన్నీ, భక్తినీ, కళనీ, కరుణనీ

కొందరు పసివాళ్ళుంటారు
ఎదగటం ఇష్టం లేనివారు,
ఎదగటంలో ఏమీ లేదని
పసిదనంలోనే పసిగట్టినవాళ్ళు

వాళ్ళకి రంగురంగుల బొమ్మలిష్టం,
రంగురంగుల ఆటలిష్టం,
శబ్దాలిష్టం, పదాలిష్టం,
రంగుల్లోకి దుమికే, ఈదే 
ఊహలిష్టం, కళలు ఇష్టం

లోకం వల్ల వాళ్లకెంత దుఃఖమో చెప్పలేరు,
ఎంత రాపిడో, భయమో చెప్పుకోలేరు, 
వాళ్ళు తడుముకుంటారు
పీడకలలోని బిడ్డ అమ్మ కోసం తడుముకున్నట్టు
కరుణనీ, కళనీ, భక్తినీ, జ్ఞానాన్నీ

వాళ్ళెవరినీ చేరరు, చేరనివ్వరు,
లోకమంటుంది కదా వాళ్లకెంత గర్వం,
ఎంత ధిక్కారం, ఎంత నిరంకుశత్వం
పాపం, వాళ్ళకవేమీ తెలీదు

పసిదనంలోంచి బయటికి రావటానికి
జంకే వాళ్ళ నైర్మల్యం గురించి
లోకానికి కూడా, పాపం, ఏమీ తెలీదు
 
బివివి ప్రసాద్

ప్రచురణ : 9.6.2025 మెహఫిల్, మన తెలంగాణ 





15 జూన్ 2025

కవిత : వాక్య ప్రవేశం

నీ వాక్యంతో 
సంభాషణ ఎటు మళ్ళిస్తావన్నది ముఖ్యం
తెరవబోయే లేదా మూసే ద్వారాలకి

మన చుట్టూ
నీడ, ఎండ లేదా చీకటి అలానే వుంటాయి 
మనమేం మాట్లాడబోతున్నామో చూస్తూ

జీవితం కూడా చూస్తూనే వుంటుంది
మన పదాలు 
ఎటు మలుపులు తిరుగుతాయోనని
వాటిని బట్టి 
జీవితం తన కాంతిని ప్రవేశపెట్టాలి మరి

వాక్యం అంత ముఖ్యం
వాక్యంతో ప్రవహించే ఉద్వేగం 
అంతకన్నా ముఖ్యం

దాని స్వచ్ఛత, తీవ్రత 
తనని కావలించుకొంటాయా
తన నుండి దూరం జరుపుతాయా అని
ఆతృతగా ఎదురుచూస్తుంది జీవితం
బిడ్డ బాగు కోసం కన్నకడుపు చూసినట్టు

నీ మౌనంతో 
సంభాషణ ఎలా ముగిస్తావన్నదీ ముఖ్యమే
అది చాతనైతే 
జీవితంలో ప్రవేశించటం ఎలానో 
నీకు తెలిసినట్టు
 
బివివి ప్రసాద్
ప్రచురణ : కవిసంధ్య మే - జూన్ 2025




09 జూన్ 2025

కవిత : ఊరట

ఒక పిట్ట ఉత్తరాకాశపు అంచులో తేలి 
నీ మీదుగా లెక్కలేకుండా ఎగిరి
దక్షిణాకాశపు అంచులో మునిగినట్టు

ఈ లోకంలోకి ఒక కాలంలో తేలి
లోకం మీదుగా లెక్కలేకుండా ఎగిరి
ఒక కాలంలో మునిగిపోవటం కన్నా

ఇక్కడ బతికి, వెళ్ళటానికి
అర్థాలూ, పరమార్థాలూ ఏముంటాయి

ఇంత రంగుల ప్రపంచం, 
ఇన్ని వెలుగుచీకట్ల, మిలమిలల, 
దాగుడుమూతల ప్రపంచం కన్నా
ప్రాణం పెట్టి ప్రేమించాల్సిన అనుభవం ఏముంటుంది

ఊరికే పుడతాం
మంచులో జారిపడినట్టు,
నీటిలోకి అదాటున మునిగినట్టు,
కలలోనో, ఊహలోనో గాలిలోకి తేలినట్టు 

నీరెండవేళ తేయాకు తోటలో రికామీగా తిరిగినట్టు,
సౌందర్యవతి ముఖాన్ని చంద్రోదయానికి అర్పించినట్టు,
చేప గగనాన్ని పలకరించి నదిలో మునిగినట్టు,
భూమి సారం పూలరేకుల్లా విప్పారి 
మృదువుగా గాలిని తాకి సెలవు తీసుకున్నట్టు,

లోపలినుండి తటాలున చిరునవ్వు మెరిసి
జీవితమేమీ కారుమేఘం కాదులే 
భయపడకని హామీ ఇచ్చి మాయమైనట్టు

మన ప్రమేయం లేకుండా వచ్చినంత
తేలికగా వెళ్ళిపోతాం, ఏముంటుంది

లోపలున్న దిగులంతా 
ఈ శీతల గాలికి ఇచ్చి వేసి
రాత్రి గర్భంలోకి ముడుచుకుపోతే చాలు
అయితే తెల్లవారుతుంది, లేదూ, తెల్లవారదు
అంతకన్నా ఏముంటుంది

బివివి ప్రసాద్ 
ప్రచురణ : ఈమాట జూన్ 2025

12 మే 2025

కవిత : తయారుగా..

1
ఒకటే రోజులోకి కనులు తెరిచినా, మూసినా
మన పగళ్ళూ, రాత్రులూ ఒకటి కాదు
పగటి రంగులూ, చీకటి లోతులూ వేరువేరు

ఒక జీవితాన్ని జీవిస్తూ వెళతాం
మజిలీ వచ్చినవారు దిగిపోతారు
జీవితం కొనసాగుతుంది

నువు దిగిపోయే మనిషివి కావు,
కొనసాగే జీవితానివి అంటారు
సరిహద్దులు దాటిన కొందరు

2
నీకు నువు వేరే,
నిశ్శబ్దంలోంచి నిశ్శబ్దంలోకి ప్రయాణించే
నీదైన రాగానివి

నీకీ లోకం వేరే,
దీనిలోని బాధా, భయమూ, ఆకర్షణా వేరే

చాలా ఏడుస్తావు, భయపడతావు చాలా,
దిగులులోకి ముడుచుకుంటావు పలుమార్లు
కానీ, కాలం పన్నిన వల ఉంది చూడు 
నిన్ను బయట పడనీయదు, ఎగరనివ్వదు

లోకం ఎరవేసే సౌఖ్యాలన్నీ
పిల్లల ఆటల కన్నా అల్పమైనపుడు
జీవితం ఊపిరాడని అనుభవమని తోస్తుంది

బహుశా, అపుడు
పగలూ, రాత్రీ నీపై నుండి చెరిగిపోతాయి
నీటిపైన రాసింది చెరిగినట్టు,
మెలకువలో కల మునిగిపోయినట్టు 

3
ఓర్చుకో అనటం మినహా
వారైనా చెప్పగలిగింది ఏముంది

నీ ప్రియుని రహస్య భాషణ 
నువు మాత్రమే వినవలసి ఉంది
తయారుగా ఉన్నావా, లేదా
తనతో ఏకాంత సమాగమానికి

బివివి ప్రసాద్
8.10.24 11.40 రాత్రి
ప్రచురణ : ఈమాట మే 2025

28 ఏప్రిల్ 2025

కవిత : హృదయం నుండి..

1
జీవితానికి భయపడుతున్న బిడ్డకి
మార్దవంగా చెప్పావు

జీవితం అంతిమంగా దైవస్వరూపం
మరొకటి కాదు, ధైర్యంగా ఉండు 

ఈ నిముషానికి శరణాగతి చెందు 
నడవలేని బిడ్డని తల్లి ఎత్తుకున్నట్టు 
జీవితమే నిన్ను మోస్తుంది 

జీవితానుభవంలో ఖాళీ అనంతం
అనుభవాలు చీమల్లాంటివి
వాటిని చూస్తూ బెంగటిలవద్దు 

దుఃఖం, భయం శిక్షలు కావు, శిక్షణ
చేయవలసిన ఉదాత్త కార్యాలకీ
పొందదగిన ఉదాత్త అనుభవాలకీ 

చాలా మాటలు చెప్పాక, అడిగావు
ఉపయోగపడతాయా
ఆమె అంది.. ఏదో ఒకరోజు

2
ప్రేమ కావాలి
ఇదంతా ప్రేమ అనే మెలకువ కావాలి
ఇంతకన్నా అక్షరాలకి పనేముంది

లోతైన మెలకువ విత్తనం లాంటిది
నిశ్శబ్దంగా మొలకెత్తుతుంది
ఎండ పడే కాలానికి
నీడ నిచ్చే వృక్షమౌతుంది

3
జీవితం అందమైందో, కాదో
చెప్పగలవారు లేరు
ప్రపంచం నిజంగా ఉన్నదో, లేదో
తెలిసినవారు లేరు

కలలో ఉన్నవేళ 
ఇది కల సుమా అని
ఎవరు ఎవరికి తెలియజెబుతారు 

ఒక మాట పలకాలని తోచినపుడు
పదాల లోపలి 
నిశ్శబ్దాన్నంతా గుమ్మరించగలిగితే
పలికినా పలకనివాడివి
అర్థం కాకున్నా విన్నవాడివి 

4
బిడ్డని, 
మాటలతో తాకావా, హృదయంతోనా

మాటలదేముంది
హృదయం పనిచేస్తుంది
హృదయం మాత్రమే

బి వి వి ప్రసాద్
ప్రచురణ : వివిధ ఆంధ్రజ్యోతి 28.4.25



19 ఏప్రిల్ 2025

కవిత : ఇలా మొదలై..

జీవితం సంతోషంగా గడవాలి
విందు భోజనం ముగించినట్టు
తృప్తిగా ఇక్కడి నుండి వెళ్ళాలి
ఇంతకన్నా ఏముంటుంది 

పగలు ఉత్సవంలా గడవాలి
రాత్రి నిండారా నిద్రలోకి జారుకోవాలి
పక్షి రెక్కలపై నీరెండ ఎగిరినట్టు
చినుకుపై కాంతి పసిబిడ్డ నవ్వులా జారినట్టు
రోజు తేలికగా గడిస్తే చాలు

కాస్త నవ్వు మొహాలు
కాస్త ప్రేమించే, దయగల మనుషులు
ఎదురైనపుడు పలకరించినా, పలికినా చాలు
ఇంతకన్నా ఏముంటుంది జీవనానందమంటే

ఉభయ సంధ్యలలో పురివిప్పే ఆకాశం
పగలంతా కాంతి దీవెనలతో
రాత్రంతా నక్షత్రాల చల్లని చూపులతో 
కనిపెట్టుకుంటే చాలు
నిన్ను కాచుకొంటున్న తల్లి నేలని 
తండ్రిలా కావలించుకుంటే చాలు

గాలికి జీవుల తలల్లా ఊగే చెట్ల పచ్చదనమూ
జీవులకళ్ళలో నీలిగగనంలా ఊగే అమాయకత్వమూ
చల్లగా తారల గుంపుల్లా సాగే సెలయేళ్లు 
దివాస్వప్నాల్లా పరుగులెత్తే ఋతువులూ చాలు

ఇంతకన్నా ఏం కోరికలుంటాయి
ప్రాణిగా ఆకృతి దాల్చే పంచమహాభూతాలకి
వాటి వెనక దాగే అకారణ జీవనానందానికి

కానీ, చూసావా, 
నీ చిన్ని కలకు దూరంగా ఎక్కడో ఉంటావు
కారణమెవరో తెలీదు, కారణమే కారణమా తెలియదు

జీవితం ఉండాల్సినట్టు ఉండదు
నువు ఉన్నచోట ఉండలేవు
తెలిసిన ప్రశ్నల వెనక దాగిన
తెలియని జవాబుల్ని కనిపెట్టలేవు 

ఆనందంగా పుట్టి
దుఃఖంగానో, భయంగానో జీవించి
మరొక ప్రశ్నగా మరణిస్తావు
ఆ నక్షత్రాలు పూర్వులు విడిచిన ప్రశ్నలా
ఎవరు ఎవరికి చెప్పగలరు

బివివి ప్రసాద్ 
ప్రచురణ : కవితా ఏప్రిల్ 2025