11 నవంబర్ 2025

03 నవంబర్ 2025

కవిత : ఊరట

ఒక పిట్ట ఉత్తరాకాశపు అంచులో తేలి, 
నీ మీదుగా లెక్కలేకుండా ఎగిరి,
దక్షిణాకాశపు అంచులో మునిగినట్లు
ఈ లోకంలోకి ఒక కాలంలో తేలి,
లోకం మీదుగా లెక్కలేకుండా ఎగిరి,
ఒక కాలంలో మునిగిపోవటం కన్నా
ఇక్కడ బ్రతికి, వెళ్ళటానికి
అర్థాలూ, పరమార్థాలూ ఏముంటాయి

ఇన్ని రంగుల ప్రపంచం, 
ఇన్ని వెలుగుచీకట్ల, మిలమిలల, 
దాగుడుమూతల ప్రపంచం కన్నా
ప్రాణంగా ప్రేమించాల్సిన అనుభవమేముంటుంది

ఊరికే పుడతాం మంచులో జారిపడినట్లు,
అదాటున నీటిలోకి మునిగినట్లు,
కలలోనో, ఊహలోనో గాలిలోకి తేలినట్లు,
నీరెండవేళ తేయాకు తోటలో రికామీగా తిరిగినట్లు,
సౌందర్యవతి ముఖాన్ని చంద్రోదయానికి అర్పించినట్లు,
చేప గగనాన్ని పలకరించి నదిలో మునిగినట్లు,
భూమి సారం పూరేకులుగా విప్పారి 
మృదువుగా గాలిని తాకి సెలవు తీసుకున్నట్లు,
తటాలున లోపలినుండి చిరునవ్వు మెరిసి
జీవితమేమీ కారుమేఘం కాదులే 
భయపడకని హామీ ఇచ్చి మాయమైనట్లు

మన ప్రమేయం లేకుండా వచ్చినంత
తేలికగా వెళ్ళిపోతాం, ఏముంటుంది
లోపలి దిగులంతా శీతలగాలికి ఇచ్చి వేసి
రాత్రి గర్భంలోకి ముడుచుకుపోతే చాలు,
అయితే తెల్లవారుతుంది, లేదూ, తెల్లవారదు
అంతకన్నా ఏముంటుంది

బివివి ప్రసాద్
కవిసంధ్య సెప్టెంబర్ 2025

02 నవంబర్ 2025

కవిత : ఏకాంతంలో..

స్నేహితులతో గడిపిన తర్వాత
నీదైన ఏకాంతాన్ని చేరుకుంటావు,
అప్పటి వరకూ ఎదురుచూస్తున్న
దుఃఖశాంతి మృదువుగా సమీపిస్తుంది 

ఒక్కడిగా ఉన్నపుడు నువ్వేమీ కావు,
మంచివీ, చెడ్డవీ, బలశాలివీ, దుర్బలుడివీ 
ఏమీ కావు, కనీసం ఎవరివో తెలీదు

రెండవ మనిషి రాగానే తయారవుతావు 
యుద్ధానికి సిద్ధపడే సైనికుడిలా,
పులిని చూసిన జింకలానో, జింకని చూసిన పులిలానో 
నిన్ను నువు క్షణంలో తీర్చిదిద్దుకుంటావు

చాలాకాలం గడిపావు ఈ నేలపై
ఈ నక్షత్రాల క్రింద, సూర్యకాంతి క్రింద,
రెండవది దుఃఖమని ఇంకా తెలియరాలేదు

ఇతరులతో గడిపాక, నిన్ను పలకరిస్తావు,
సముద్రగర్భంలోని, నీలిగగనాని కావలి 
ప్రశాంత గంభీరమైన నీ సన్నిధికి మేలుకుంటావు

ఇప్పుడు చూడు సుమా,
ఇంత ప్రపంచాన్ని పిండితే
నీకు నువ్వు మాత్రమే సారాంశమై తగులుతావా
ఇతరమేమైనా మిగులుతుందా

ప్రపంచంలో గడిపాక,
ఈత చాలించిన దేహంలా
పరమ ఏకాంతంలో మునిగినపుడు

ఏది సత్యం, ఏ దసత్యం
ఏది నువ్వు, ఏది నేను
ఏది జీవిత మేది మృత్యువు

బివివి ప్రసాద్

01 నవంబర్ 2025

కవిత : లెక్కలు

లెక్కలు దాటగలవా అంటుంది లోపలి ఖాళీ,
అచ్చం ప్రియమైన వ్యక్తిలానే,
నమ్మిన గురువూ, దైవంలానే

సూర్యుడు ఉదయిస్తాడు బంగారుకాంతులతో,
పిల్లలు నవ్వుతారు వెన్నెలలా తెల్లగా, చల్లగా,
పూలు వికసిస్తాయి రంగులు లోకంలో ఒంపుతూ,
చల్లటిగాలి తాకుతుంది తల్లినో, తండ్రినో గుర్తుకుతెస్తూ 

బావుంటాయి కొన్ని క్షణాలు
నువు ఎండుటాకులా రాలినవి,
సముద్రంలోకి కెరటంలా వాలినవి,
నిద్రలోకి మెలకువలా జారినవి

బావుంటాయి, నీకు నువ్వు మిగలనివి,
నిన్ను చెరిపేసుకున్నవి,
చెరిపేందుకు అనుమతించినవి

అవి క్షణాలు, క్షణాలలో దాగిన యుగాలు,
యుగాలలో దాగిన కాలం లేని సమయాలు

లెక్కలు దాటగలవా,
అక్కడుంది రహస్యమంటుంది ఖాళీ గాలి, 
లేదా ఖాళీ ఆకాశం, ఖాళీ ఉద్వేగం, ఉత్త ఖాళీ
..
ఈ మాటలు ముగిశాయా, లేదా..

బివివి ప్రసాద్
ప్రచురణ : సాహిత్యనిధి నవంబర్ 25
పెరుగు రామకృష్ణగారికి ధన్యవాదాలు



31 అక్టోబర్ 2025

కవిత : చాలాసార్లు

చాలాసార్లు అనుకున్నావు
మెలకువలో బస్సు దిగి వెళ్ళిపోయినట్టు,
కలలో ఇంద్రధనువు దిగి వెళ్ళిపోయినట్టు
జీవితం దిగి వెళ్ళిపోవాలని

సాధ్యం కాలేదు గనుకనే
మళ్ళీ పగలూ, సూర్యుడూ, పిట్టలూ 
మనుషుల్లాంటి జంతువులూ,
జంతువుల్లాంటి మనుషులూ
యంత్రం లాంటి జీవితమూ,
జీవితం లాంటి యంత్రమూ 

సాధ్యం కాలేదు గనుకనే
మళ్ళీ బంధాలూ, ఆశలూ, ఉత్సాహాలూ,
బంధాలూ, నిరాశలూ, నిరుత్సాహాలూ

సెలయేళ్ళు ఎప్పట్లానే ప్రవహిస్తాయి
మొక్కల్లోంచి ఆకులు ప్రవహించినట్లు,
పూలు ఎప్పట్లానే విరబూస్తాయి
సూర్యుడు గగనంలో విరబూసినట్లు,
పిల్లలు నవ్వుతారు ఎప్పట్లానే
దైవం నీలోంచీ, నాలోంచీ నవ్వినట్లు,
జీవితం ఎప్పట్లానే కొనసాగుతుంది
పిట్టపాట గాలి అలలపై కాగితం పడవైనట్లు 

చాలాసార్లు అనుకున్నావు
కాలానికి చివరి చుక్క పెట్టాలని, 
స్థలాన్ని చెరిపేయాలని
సాధ్యం కాలేదు గనుకనే
ఇంత దుఃఖం, బహుశా, ఆనందం

బివివి ప్రసాద్