17 ఆగస్టు 2025

కవిత : జాగ్రత్త

మనకు తెలిసినదాని కన్నా 
మరికాస్త మంచు కురిస్తేనో,
నీరు కదిలితేనో, గాలి వీస్తేనో,
కూలిపోయే చీమల పుట్ట 
యుగాలుగా నిర్మించిన నాగరికత

అప్పుడు కూడా 
ఏ మొక్క నుండో లేత చిగురు
సూర్యకాంతిలోకి తెరుచుకుంటుంది చూడు,
ఏ ప్రాణికో పుట్టిన పసిజీవం
మృదువుగా గాలిలోకి చలిస్తుంది చూడు,
అక్కడ దాగి వుంటుంది 
జీవితం మనవైపు నవ్వే చిరునవ్వు,
మృత్యువు లోపలి కరుణ

లోకమేమీ డొల్ల కాదు, మనుషుల్లా,
చెట్లూ, పుట్టలూ, ఆకాశమూ, మబ్బులూ,
కెరటాలు హోరూ, దుఃఖితుల కన్నీరూ చెబుతాయి

బిడ్డా, జాగ్రత్త, జీవితం గాజు కన్నా అల్పం,
పూల కన్నా ప్రార్థనా స్థలం,
ఎగిరే సీతాకోక రంగుల కన్నా ప్రేమాస్పదం 

జాగ్రత్త కన్నా,
జీవితం నీ ప్రేమకోసం ఏడుస్తున్న 
నీ తప్పిపోయిన శిశువు

బివివి ప్రసాద్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి