15 ఆగస్టు 2025

కవిత : బదులు తీర్చటం..

ఈ లోకంలో ఏమన్నా బ్రతికితే
చిన్నపుడు బ్రతుకుతాం
మిగిలిన జీవితమంతా బదులు చెల్లిస్తాం 

ఆడా, మగా తెలియని
పసిదనం తర్వాత ఏముందిక్కడ

రాత్రి చుక్కల పందిరీ,
పగటి వెలుతురు సందడీ మినహా
రేపటి ఆలోచన లేని రోజులు గడిచాక
ఏముందిక్కడ

కాసిని శైశవక్షణాలు అనుభవించినందుకు
ఇంత బదులు తీర్చటం అవసరమా అని
అడుగుతావు దేవుడిని

ఉండీ లేనివాడిని, 
లేకుండటంలో దాగిన వాడిని
జవాబు రాదు 

బ్రతికావు కదా కాసిని రోజులో, నిముషాలో
శుభ్రమైన పసిదనంలో, స్వేచ్చలో
భయ రహిత క్షణాల్లో,
ఏదీ గుర్తుండని కాంతిలో

చెల్లించి వెళిపోవా
మిగిలిన బరువైన రోజుల్నని
నిన్ను నువ్వే బ్రతిమాలుకుంటావు

బదులుగా,
ఇక రావు ఇక్కడికి అనటం కన్నా
ఏ వరం ఇవ్వగలడు దైవమైనా

బివివి ప్రసాద్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి