18 ఆగస్టు 2025

కవిత : ఆవలితీరం నుండి..

సుఖంలానో, బాధలానో, భయంలానో 
పురివిప్పినట్టు తెరుచుకునే రోజుల్ని 
ఒక్కొక్కటిగా గడుపుతావు అనేకసార్లు,
పగటి దీపకాంతిలాంటి నువ్వు
చీకటి పడేకొద్దీ ప్రకాశిస్తావు నీ లోపలికి

జీవించటం అసౌకర్యమైన అనుభవం,
పీడకలలవేళ దేహం కూడా కదిలినట్టు
జీవితం నుండి మరణంలోకి 
నిన్ను నువ్వు బ్రతిమాలుకుంటావు,
ఉనికి నుండి మాయంలోకి కలలు కంటావు

చాలా ఆశ్చర్యం ఇదంతా,
భయపడుతూ ఉల్లాసపడటం, కేరింతలు కొట్టడం, 
భయంలోనే పిట్టలు పాడటం, లేళ్ళు గెంతటం,
పిల్లలు నవ్వటం, యవ్వనం ప్రేమించుకోవటం,
భయంలోనే సెలయేళ్ళు ప్రవహించటం,
సూర్యుడు కాంతిని విరజిమ్మటం

బహుశా, నల్లని చీకట్లోనో, గాఢనిద్రలోనో 
భయావహ జీవితం రెక్కలు వాల్చి నిలుస్తుంది,
మరణం తర్వాత కడపటి స్వేచ్ఛ దొరుకుతుంది
ఇదంతా కానిది ఏమైనా ఉంటే దానికి

ఇది ఇవతలి తీరపు మర్మరధ్వని,
ఒకటే ఊరట ఏమంటే
ఆవలితీరం నుండి చూసినప్పుడు ఇదేమీ లేదు

బివివి ప్రసాద్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి