19 ఆగస్టు 2025

కవిత : కదిలితే మాత్రం..

మనుషుల బలాలకీ, బలహీనతలకీ, 
కదిలిపోతున్నావు కరుణలోకో, విసుగులోకో,
పాపం, పిచ్చి జాతి, ప్రపంచం నాదనుకుంటుంది,
విశ్వాన్ని జయిస్తున్నానని భ్రమిస్తుంది

చాలా పెద్దది కదా ఇదంతా,
చాలా లోతు, వైవిధ్యం, అనూహ్యం,
దీనిలోకి వస్తారో, జారిపడతారో కూడా తెలీదు,
కానీ, ఎంత గర్వం,
ఏనుగు ముందు చీమ ఛాతీ చూపినట్టు
జీవితం నా అదుపులో ఉందని తలపోస్తారు 

ఇంత తెలివిలేని జాతిలో పుట్టి
ఉదయాన్నో, అస్తమయాన్నో చూస్తావు,
సీతాకోక ఖాళీలోకి ఎగరటాన్నో, 
వాన రంగుల్లో ఒళ్ళు విరుచుకోవటాన్నో,
పిల్లలు ఏమీ పట్టనట్టు నవ్వటాన్నో కూడా

ఇదంతా నిన్ను కదిలిస్తుంది, నీతో కదులుతుంది,
కదిలి, కదిలించి, అమ్మ బిడ్డతో దోబూచి ఆడినట్టు 
ఇదంతా లేదు కదా, నిన్ను వదిలిందే లేదు కదా 
అని నవ్వుతుంది తెలియరానిది 

అంతవరకూ కదిలితే కదులు, ఊరుకుంటే ఊరుకో,
ఏమైందిప్పుడు, ఏమీ కావటానికి వీలులేని చోట

బివివి ప్రసాద్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి