16 ఆగస్టు 2025

కవిత : అతనిది

 దెబ్బ తగలక ముందు ఒకలా ఉంటాం,
మాసిపోయాక కూడా అలానే,
తగిలిన సమయాన 
అతని పిలుపు వినబడుతుంది లీలగానైనా,
మిగిలినదంతా డొల్ల ప్రపంచం

అతను పిలుస్తారు గుమ్మంలో నుండి తల్లిలా,
ఆటల్లో వినబడదు నీకు, విన్నా పట్టదు

చాలా రాత్రులు చూస్తావు, పగళ్లు కూడా,
ఒకటో తరగతిలోని లోకమే విశ్రాంతి కాలంలోనూ,
పుట్టినట్టే వెళ్ళిపోతావు వేల జీవితాల్లో ఒకటిగా

ఇదేమీ నిష్ఫలం కాదు కానీ,
సరస్తీరంలో బతకడానికీ, సరస్సులో మునగటానికీ,
కొంచెం తేడా ఉండవచ్చు, లేకపోవచ్చు కూడా

దెబ్బలు తగిలితే ఆగవద్దు అనటం కన్నా,
ఆయన కూడా ఏమీ చెప్పకపోవచ్చు

ఒక కల కనటానికి వచ్చావు
కంటావా, కనుమూస్తావా నీ స్వేచ్ఛ 
తరువాత కూడా మిగిలి ఉండటం అతనిది

బివివి ప్రసాద్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి