కొత్తగా మేలుకున్న ఒక స్త్రీ
కొత్తగా మేలుకున్న ఒక పురుషుడిని
ఆకర్షించినపుడు
అతను ఆమెతో అన్నాడు
నిన్ను కదా ప్రేమిస్తున్నాను,
ఇకపై జీవితమంతా నీతో గడపాలనివుంది,
ఆమె ఏమీ మాట్లాడలేదు,
నవ్విందో, లేదో తెలీదు, ఆమెకి కూడా
సూటిగా చూసింది
అతని కన్నులలోకి, కలల్లోకి, కాంతిలోకి
తరాలుగా స్త్రీ పురుషుణ్ణి చూసిన చూపు
అతను వెదికాడు
ఆమె కళ్ళలో ప్రతిఫలించే పురాస్మృతుల్లో
యుగాలుగా పురుషుడు స్త్రీలో వెదికేది
ఆమె సరేనన్నదో, లేదో తెలియలేదు,
ఏమనాలో ఆమెకీ తెలియనట్లే
సరేనని వినలేని దుఃఖంతో అతను,
అనలేని దుఃఖంతో ఆమె,
కొత్తగా మేలుకున్న బరువైన రోజుల్లోకి ఇద్దరూ
…
ఉదయాస్తమయాలు
జీవుల్ని మేల్కొలిపి, జోకొడుతున్నాయి,
చీకటివెలుగుల దాగుడుమూతలాటలోకి
తెలియని ఖాళీలోంచి వచ్చేవారు వస్తున్నారు,
ఖాళీలోకి వెళ్ళేవారు వెళుతున్నారు
…
కాలం పండిన ఒక సాయంసంధ్యవేళ
వారు ఎదురయారు
ఆమె చూపులో స్త్రీ లేదు,
అతని చూపులో పురుషుడు లేడు
కాలం, కలలూ రాలిపోయిన శాంతిలో
ఒకరినొకరు చూసినపుడు,
ఒకే జీవనానందం లోపల
వారెపుడూ కలిసి ఉన్నట్లు కనుగొన్నారు
బివివి ప్రసాద్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి