31 జులై 2012

'ఆకాశం ' పై శ్రీకాంతశర్మ, శివారెడ్డి, చినవీరభద్రుడు, కవితాప్రసాద్‌ల ప్రసంగాలు..


'ఆకాశం ' పరిచయసభ హైదరాబాద్‌లో పాలపిట్ట ప్రచురణల ఆధ్వర్యంలో గత డిసెంబర్‌లో జరిగింది. ప్రసిధ్ధకవులు శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు, శ్రీ కె.శివారెడ్డిగారు, శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడుగారు, శ్రీ రాళ్ళబండి కవితాప్రసాద్‌గారూ ఆకాశం కవితా  సంపుటి గురించి మాట్లాడారు. వారి ప్రసంగాలు ఇక్కడ ఉన్న link ద్వారా వినవచ్చు.   

ఆకాశం పరిచయ సభ, హైదరాబాద్ 15 డిసెంబర్ 2011





ఆకాశం కవితాసంపుటి దొరికేచోట్లు:
హైదరాబాద్: నవోదయ బుక్‌హౌస్, కాచిగూడ
విజయవాడ: మైత్రి బుక్స్, ఏలూరు రోడ్ 
కర్నూలు: విశాలాంధ్ర బుక్ సెంటర్
నిజామాబాద్: కీర్తి బుక్‌స్టాల్, బస్‌స్టాండ్
పోస్టులో కావలసిన వారు: పాలపిట్ట బుక్స్, 040-27678430
ఇంటర్నెట్ ద్వారా కినిగే.కాం లో ఈ బుక్ లేదా ముద్రిత ప్రతి కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

ఆధ్యాత్మికతకు అందాలు! సౌభాగ్య


కొందరు బయటికి ప్రయాణిస్తారు.  కొందరు లోపలి ప్రయాణం చేస్తారు.  బయటికి ప్రయాణం చేసేవాళ్ళ ‘ఎదుగుదల’ మనకు కనిపిస్తుంది.  పేరు, పలుకుబడి, ఆస్తి, అధికారం వాళ్ళు అందుకుంటారు.  వాళ్లకు మనం గొప్పతనం ఆపాదిస్తాం.  ప్రపంచంలో పైకి రావడమంటే అదే.

కొందరు లోపలి ప్రయాణం చేస్తారు.  వాళ్ళు అతికొద్దిమంది.  ప్రపంచంనుంచీ వాళ్ళు అభినందనలు, సత్కారాలు ఆశించరు.  వాళ్ళ ప్రయాణమే వాళ్ళ పరవశం.

బి.వి.వి. ప్రసాద్ ఆంతరిక ప్రయాణం అంతరిక్షయానం లాంటిదే.  అది నిరంతరంగా కొనసాగుతూ ఉంటుంది. అతను అందుకున్న ఎత్తులు, ప్రయాణించిన లోతులు మన వూహకందనివి. అతని భాష గొప్ప సౌందర్యాన్ని, సౌకుమార్యాన్ని సాధించింది.  అతని భావాలు మహాతాత్వికుల చింతనలు.  ఐతే తాత్త్వికులకు లేని కవిత్వదృష్టి ప్రసాద్‌కు ఉంది. ఆధ్యాత్మికతకు అందాలద్దిన కళాశీలి ప్రసాద్.

నిజమైన నిర్లిప్తతలో,  ఉదాసీనతలో మనం మనంగా నిలబడి నిఖిల ప్రపంచాన్నీ, నిర్మిలంగా చూస్తాం.  ప్రసాద్ అన్నిటినీ ఆహ్వానిస్తూ దేనిలోనూ పడికొట్టుకుపోని ఆకాశం లాంటివాడు.

'సృష్టికి తానే కారణమై ఏమీ ఎరగనట్లుండే స్వచ్ఛతకీ
అన్నిటినీ తనలో పొదువుకుని, అన్నిటిలో ఒదిగి
ఏదీ తనది కాదన్నట్లుండే నిర్మల ప్రేమకీ
ఉండీ లేనట్లుండే ఉదాత్త స్వభావానికీ ఆకాశం ప్రతీక'  అంటాడు.

అతనొక ఆకాశం. దేన్నీ కాదనడు. దేన్నీ కావాలనడు. తన స్వేచ్ఛను ఎక్కడా మలినపడనివ్వడు.

సామ్రాజ్యాల్ని సాధించడం గొప్పకాదు. ఆత్మ సామ్రాజ్యాన్ని సాధించడమన్నది అపూర్వ విషయం. సుకుమార సామ్రాజ్యాన్ని సృష్టించుకోవడం గొప్ప విషయం. ప్రసాద్ మనః ప్రపంచంలో కాఠిన్యముండదు. కరుణ ఉంటుంది. దౌర్జన్యముండదు. దయ ఉంటుంది. ఆ సామ్రాజ్యాన్ని మనం దురాక్రమించలేం. కారణం అక్కడ అనురాగమొక్కటే అన్నివేళలా అందరికీ అందుబాటులో ఉంటుంది. మనతో ఘర్షించని వ్యక్తిని మనం జయించలేం. అహంకారమున్నప్పుడే సంఘర్షణ ఉంటుంది. అన్నిటికీ ఆమోదద్వారాలు తెరచుకున్న ఈ సౌమ్యుడిని ప్రేమించడమొక్కటే చెయ్యగలం.

ప్రసాద్ ప్రవహించే నీళ్ళలాంటి వాడు. అడ్డంగా నిల్చున్నా, పక్కకు తొలిగి ప్రవాహం సాగిపోతుంది.  ప్రసాద్  ప్రశ్నలకు అందడు.  సమాధానాలకు లొంగడు. తెల్లని మేఘంలా తేలిపోతాడు.  మధుర పరిమళాన్ని నింపుకున్న మందపవనంలా ముందుకు సాగిపోతాడు.  నిర్ణయాలకు లొంగడు.  స్వేచ్ఛ అతని ఊపిరి.  నిజమైన స్వేచ్ఛ బాల్యంలో ఉందని, మనుషులు బాల్యాన్ని కోల్పోయి బండబారిపోతారని బాధపడతాడు.  రుషులు బాల్యం కోసమే తపస్సు చేస్తారంటాడు.

'మునులెందుకు స్వేచ్ఛ కోసం తపస్సు చేస్తారో అర్థమైంది
సాటి మనుషులకన్నా చివరికి అన్నం కన్నా, గాలికన్నా
స్వేచ్ఛ ఎంత ప్రియమైందో అవసరమైందో తెలిసి వచ్చింది

మనిషి చేయవలసిన పనికి
వ్యతిరేకంగా ఎంత వేగంగా వెళుతున్నాడో అర్థమైంది
అప్పుడు నా ప్రయాణం మొదలైంది.'

దైవత్వం అక్షరాల్లో ఉంటుందంటే మనం నమ్మం.  ఊహల్లో దయ, విశ్రాంతి తీసుకుంటుదంటే విశ్వసించం.  వాక్యాలు పూలహారాల్లా ఉండొచ్చంటే నమ్మబుద్ధి కాదు.  ‘నా అక్షరాలతో భగవంతుని వస్త్రాన్ని నేస్తాను’ అన్నాడు జర్మన్ మహాకవి గోధె.  ‘‘వాగ్భూషణమే సుభూషణము భూషణముల్ నశియించునన్నియున్’’ అన్నాడు ఏనుగు లక్ష్మణ కవి.  ఏ తఫః ఫలితంగా సాధించాడో ప్రసాద్ ఈ అక్షరాల్ని.  సంస్కారాన్ని.  సౌమ్యతను.  సౌందర్యంలో అద్ది అజ్ఞాతాన్ని ఆరాధిస్తున్నాడు.  జీవితం అహంకార చలనం కాదు.  జీవితం ఆనంద గమనం.  ఆనందంగా జీవించడానికి ఐశ్వర్యం అక్కర్లేదు.  మనోహరంగా జీవించడానికి మణులూ, మాణిక్యాలూ అక్కర్లేదు.  ప్రేమ, అనురాగం, దయ అంతరంగంలో ఉంటే అపూర్వంగా జీవించవచ్చు.  పోలికలు లేకుంటే ఉల్లాసంగా బతకవచ్చు.

'దృశ్యమేదైనా చూడడమే ఆనందంగా
శబ్దమేదయినా వినటమే ఆనందంగా
రుచి ఏదైనా ఆస్వాదించటమే ఆనందంగా
జీవితమెలా ఉన్నా జీవించడమే ఆనందంగా'

ఉండడం తెలిసినవాడు ప్రసాద్.  ప్రసాద్‌ది సరళ మార్గం.   సహజ మార్గం. సత్యమార్గం.  సకల జనులకూ ఆమోదయోగ్యమయిన మార్గం.

ఆంధ్రభూమి దినపత్రిక నుండి


'ఆకాశం' సంపుటి  దొరికేచోట్లు:
1. పాలపిట్ట ప్రచురణలు,  హైదరాబాద్. ఫోన్: 040-27678430.
2. కినిగే.కాం లో ఈ బుక్ లేదా ముద్రిత ప్రతి కోసం  
ఇక్కడ క్లిక్ చేయండి 

అత్యున్నతాకాశం : ఏనుగు నరసింహారెడ్డి


ఆకాశం లాంటిదే జీవితం. దాని ఎత్తులూ లోతులూ తెలిసినట్లే ఉంటాయి. కానీ, తరచిన కొద్దీ కొత్తగా కనిపిస్తుంటాయి. పైపైన తేలిపోయే మబ్బులుంటాయి. సూర్యచంద్రుల్లా ఆవేశాలు, ఆనందాలు, నక్షత్రాల్లాంటి మెరుపులూ ఉంటాయి. ఆకాశం ఉందో లేదో తెలియనట్లే జీవితం కూడా! ఆకాశం ఆరంభం, అంతం ఎక్కడో చెప్పలేనట్లే జనన మరణాల ఆవలిగట్లు ఎంత ధ్యానించినా కనిపించే దాఖలాల్లేవు. ఆకాశం మన మీదుందో, ఆకాశం మీద మనమే వేలాడుతున్నామో తెలియదు. గ్రహాలు, నక్షత్రాలు, పాలపుంతలు భూమ్మీద కూడా గతులు తప్పుతుంటాయి. గ్రహణాలు మనుషులక్కూడా పడుతుంటాయి.

ఆకాశమంటే అంతు దొరకని రహస్యం, ఏదీ దాచిపెట్టలేని బహిరంగం కూడా. ఒక్క బివివి ప్రసాద్‌కే కాదు, మనక్కూడా. కానీ మనకంత తీరికేది. చూపేది. ప్రసాద్‌కున్న పరిశీలనేది. మనమంతా ప్రవాహం. ప్రసాద్ గట్టుమీదున్న చెట్టు. గట్టు మీద నిలబడి ఎలాంటి గర్వం లేకుండా జీవితాకాశాన్ని అక్షరాల తీగలు పేర్చుకొని కవిత్వం రాగాలు తీస్తాడు. ఒక్క పాలూ శృతి తప్పదు. ఏ దరువూ అక్షరాన్ని అదనంగా జోడించుకోదు. కుదించుకోదు. నూరు కవితలున్న ఆకాశం చదివాక నూటొక్కటో కవిత ఎందుకులేదన్న బాధ. ప్రసాద్ ఆరవ పుస్తకం ఎప్పుడొస్తుందన్న డిమాండ్, ఆశ. 

అడుగడుగునా కవి గురించీ, ఆకాశం గురించీ చెప్పినట్లు నడిచే ప్రసాద్ కవిత్వంలో అబ్బురపరచని వాక్యమేదైనా దొరుకుతుందేమోనని చూసాను. సరల వాక్యం సరమెక్కడైనా తెగిపోకపోతుందా అని చూసాను. ఓడిపోవడం పాఠకుడిగా మొదటిసారి గర్వించాను.

ఒక్క కవితా పాదం:
'పుట్టగానే పిల్లలు ఎప్పుడూ ఏడుస్తారెందుకని
దు:ఖమయ ప్రపంచాన్ని వ్యాఖ్యానిస్తారెందుకని '

మరొక్క వాక్యాల గుంపు:
'తలుపులు మూసిన మందిరంలో దేవుడూ
పెద్దవాళ్ళకు అడ్డంరాకుండా పసివాడూ
తమ సమయం వచ్చేవరకూ ఎదురు చూస్తారు ' 

ఏదో ఒక పేజీ జరుపుదాం:
'అయితే 
ఏ పుట్టుకా లేనపుడు 
అందరం ఎక్కడ దాగివున్నాం 
సృష్టి ఏమై వుంటుంది 

కొలనులో రాయి వేసాక
నీటి వలయాలు బయటపడినట్లు
ఈ ప్రశ్నలు వేసుకొన్నాక
ఏవో దిగులు వలయాలు బయటపడుతున్నాయి '

అతి పేలవమైన కవితనొక్కదాన్ని వెతికి మీ ముందు పడేస్తాను:
'అప్పుడు ఒక్క ఊహైనా పూవులా రాలదు
ఒక్క ఊహైనా సీతాకోకలా ఎగరదు
నిద్రలో పాపాయి నవ్వులా వెలగదు
కదలని కోనేటిలో చందమామలా ప్రతిఫలించదు '

ఇంకా మీరు ప్రసాద్ కవిత్వం చదివే తీరాలనే పంతం పట్టకుందా ఉండేందుకు 'చిన్న బడి ' పిల్లల్లా 'ప్రశ్నలు-జవాబులు ' ప్రవేశపెడతాను. కానీ ప్రసాదు ప్రశ్న అడుగుతున్నాడో, జీవితపుటద్దం ముక్కలని ఎలా అతకవచ్చో లాంటి వేల ప్రశ్నలకి జవాబు ఓపికగా చెబుతున్నాడో చెప్పడం కష్టం.

చూడండి:
'ఎప్పుడూ విసుక్కొనే కొడుకు తల్లి పాదాలు తాకి దీవించమన్నపుడు
ఆమే కళ్ళలో ఎన్నడూ చూడని కన్నీరెందుకొస్తుంది

గాయపరిచాను, క్షమించమన్నపుడు
అప్పటివరకూ వెలవెలబోతున్న భార్య కన్నులవెంట ఆపలేని ధారలెందుకొస్తాయి

చాలా ఖర్చవుతుందేమో, వద్దులే నాన్నా అని పిల్లలన్నపుడు
వారి లేత దయాపూర్ణ హృదయాలు తలచి అతని కన్నులెందుకు చెమ్మగిల్లుతాయి ' 

ఇప్పుడు చెప్పండి. ఇవి ప్రశ్నలా? జవాబులా? ప్రశ్నలే అయితే, వాటికి జవాబులెంత లోతుల్లోంచి రావాలి. జవాబులే అయితే, వాటికి ముందు ఎన్ని వేల ప్రశ్నలు కావాలి. 

శీర్షికలింత నేరుగా పెట్టొచ్చా? మన జవాబును పట్టించుకోకుందా మహా సూటిగా పెట్టాడు. పుట్టగానే పిల్లలు - అప్పుడు పుట్టిన పిల్ల గురించే. ఎదురుచూస్తారు - ఒక సందర్భం కోసం ప్రేమాస్పదమైన ఎదురుచూపే. ఆకాశం, అద్దం, నవ్వు అన్నీ వాచ్యాలే శీర్షికలు. కవిత్వాంశ నూరుపాళ్ళు.

'అకస్మాత్తుగా ఒక జీవితం ఆగిపోతుంది
ఒక జ్ఞాపకాల దీపం ఆరిపోతుంది
మానవసంబంధాల ముడి ఒకటి విడిపోతుంది '

లాంటి సరళ వాక్యాలు. సంభ్రమాశ్చర్యాలు గొలిపే కవిత్వాంశ.

'అవుననటం ఒక దారి, కాదనటం ఒక దారి
ఇవ్వటమొక దారి, తీసుకోవటమొక దారి 
విజయం ఒక దారి, పరాజయం ఒక దారి ' 

లాంటి కవితల్లో ఇంకా సంక్షిప్తం చేయడానికి అవకాశం ఉన్నా కవి ఉపయోగించుకోలేదనే పై చూపులకి అనిపిస్తుంది. కానీ, ఎక్కడ పదాల పునరుక్తి అవసరమో అక్కడ మాత్రమే ఉంది. అది ప్రసాద్ కవిత్వాన్ని చాలాచోట్ల బలోపెతం చేసింది కూడా. జీవిత సత్యాలు పదేపదే ఎదురైనట్లు కొన్ని కవితా సందర్భాలు సారూప్యాలతో ఉన్నాయి, కానీ, కవిత్వం లోని మార్దవం, ఆర్ద్రత అద్భుతంగా కొనసాగాయి. ప్రసాద్ రాసిన ప్రతి కవితా వాక్యమూ మెరుపుల మాలికలాగా ఉండటం ఆశ్చర్యానందాలతో ముంచెత్తుతుంది పాఠకుల్ని. 

9 అక్టోబర్ 2011 ఆదివారం 'వార్త ' నుండి.

'ఆకాశం' సంపుటి  దొరికేచోట్లు:
1. పాలపిట్ట ప్రచురణలు,  హైదరాబాద్. ఫోన్: 040-27678430.
2. కినిగే.కాం లో ఈ బుక్ లేదా ముద్రిత ప్రతి కోసం  
ఇక్కడ క్లిక్ చేయండి 

30 జులై 2012

మార్మిక కవిత్వం

1
మనిషిలో కోరికల ఫలవృక్షముంటుంది, ప్రపంచం దాని నీడ
సదా మానవులు నీడలకు వేలాడే కాయల్ని తెంపబోతారు
అరుదుగా, వివేకం మేలుకొన్నవాడొకడు
తనలోపలి వృక్షాన్ని చెరిపేసి, తానే రసపూర్ణ ఫలాన్నని తెలుసుకొంటాడు

2
అప్పుడే నడక నేర్చిన పిల్లల్ని వాళ్ళ పాదాలు నడిపిస్తాయి
మాటలు నేర్చిన పిల్లల్ని మాటలు మాట్లాడిస్తాయి
ఊహలు నేర్చిన పిల్లల్ని ఊహలు కదిలిస్తాయి

నడక బాగా తెలిసినవాడు తన పాదాలను నడిపిస్తాడు
మాటలు తెలిసినవాడు తన మాటలను ఉపయోగిస్తాడు
ఊహలు తెలిసినవాడు తన ఊహలపై అధికారం వహిస్తాడు

3
వేటినీ లోపలికి రానీయకపోవటం తొలిదశ
అన్నిటినీ లోపలికి రానీయటం మలిదశ
అన్నిటినీ వెలుపలికి పోనీయటం వాటి పై దశ
రాకపోకలు, లోవెలుపలలు లేవని తెలియటం చరమదశ

4
వెలుపలి ప్రపంచమొక పర్వతం, లోపలి ప్రపంచమొక ఆగాధం
పర్వతంపైన ఎవరైనా ఒక అడుగైనా పైకి నడవలేరు
అగాధంలోకి ప్రవేశించేవారు, అదే సమయంలో పర్వతాన్నీ అధిరోహిస్తారు
అగాధం లోతుల్ని తాకిన వారు, పర్వతాగ్రం మీద కనిపిస్తారు 

5
జీవితమొక పర్వతం, మనిషి ఒక చలనం
వేలమనుషులు పర్వత పాదంలో ప్రదక్షిణ చేసి వెళ్ళిపోతారు
అరుదుగా కొందరు నాలుగడుగులు పైకి నడిచి చుట్టూతిరుగుతారు
వారినందరూ ఆశ్చర్యపోతూ చూస్తారు, వారు సంతృప్తులై మరలిపోతారు  

ఎక్కడో ఒకరు నిటారుగా నడవటమే నడవటమని గ్రహిస్తారు
వారు ఒకమాటైనా మాట్లాడకుండా తలవొంచుకొని శిఖరాగ్రానికి ప్రయాణిస్తారు
శిఖరాగ్రంపై నిలిచి పర్వతమే తనచుట్టూ తాను పరిభ్రమించటం దర్శిస్తారు

_________________________
ప్రచురణ: నవ్య వారపత్రిక 2.5.2012

29 జులై 2012

గంధర్వుడు ఒకడు

గంధర్వుడు ఒకడు వచ్చి వెళతాడు 
మన చుట్టూవున్న శూన్యంలోని మనమెరుగని రహస్యలోకాల నుండి
మెరిసే జీవులలో ఒకడు మనకోసం వచ్చివెళతాడు 

అతనిని భూమి గుర్తించదు
భూమి మేలుకొంటున్నపుడు పరివ్యాప్తమయే పరిమళం గుర్తిస్తుంది
అగ్ని గుర్తించదు
అగ్నిలోకం నుండి రెక్కలు విప్పుకొంటున్న రంగులు గుర్తిస్తాయి
అతనిని అక్షరాలు గుర్తించవు
అక్షరాలపై అదృశ్య సంచారం చేసే ఊహలు గుర్తిస్తాయి

చీకటి గుహలలో, గుహలలో, గుహలలో నిదురిస్తూ నడుస్తున్న మనం 
అతనిని చూసి 'ఇతను మనలాంటి వాడే కదా
మన వలే భయ, కాంక్షా, వ్యాకులతలు చుట్టుకొన్న వాడే కదా ' అనుకొంటున్నపుడు 
చెట్లు నిదానం గా కలగంటున్న పచ్చదనమూ,
పక్షుల రెక్కలపై వాలి కేరింతలు కొడుతున్న స్వేచ్ఛా కాంక్షా 
మనని చూసి జాలి పడతాయి
'ఇతని భయ, కాంక్షా, వ్యాకులతల వెనుక
పారాడే దయ ఏనాటికి మీకు తెలుస్తుంద ' ని తలుస్తాయి

అతను నవ్వినపుడూ, మాట్లాడినపుడూ, పాడినపుడూ, కవిత్వం చెప్పినపుడూ
తలుపుల వెనుక, తలుపుల వెనుక, తలుపుల వెనుక
ఉన్న మనపైన ప్రేమ కలిగి
సుతారంగా మన తలుపులన్నిటినీ తడతాడు
చిరుగాలైనా వీయలేదే ఈ సడి ఎక్కడిదని కొందరైనా గుర్తించేలోపు
బంగారు కిరణమొకటి మరలినట్లు నిశ్శబ్దంగా వెళ్ళిపోతాడు 

అతను వచ్చి వెళ్ళాడని 
మనకి తెలియదు కాని, మన హృదయాలకి తెలుస్తుంది
మనలో జీవితేచ్ఛలా అణగారి వెలుగుతున్న మన అంతరాత్మకి తెలుస్తుంది 
తలుపులు మూసిన గదిలోకి చలిగాలి తెర ఒకటి ప్రవేశించినట్లు 
అతను సరాసరి మనలోపలికి ప్రవేశిస్తాడు 
మన అంతరాత్మతో సంభాషిస్తాడు
మన అనుమతి లేకుండా మనలో కొంత వెలుతురు ప్రవేశపెట్టి చూస్తాడు 
అతను ఏదో చేసాడని, ఏదో మాట్లాడాడని గుర్తించగలము కాని 
ఏమి చేసాడో, మాట్లాడాడో ఎప్పటికీ రహస్యంగానే ఉండిపోతుంది 

మన చుట్టూ ఉన్న ఆకాశం లోపల వెలిగే రహస్యదేశాల జీవి ఒకడు
మన మధ్యకు వచ్చి వెళిపోతాడు
కాసిని రంగుల్నో, స్వరాల్నో, అక్షరాల్నో ఉపయోగించి
తాను నివసించే వెలుతురులోకం చిరునామా మనకు చెప్పబోతాడు

మనకు సంతోషపు మైకం కమ్మేవాటికి అతను దు:ఖిస్తాడు
మనం దు:ఖించేవాటికి, అతను చిరునవ్వు నవ్వుతాడు 
అతను ఉత్సాహం పట్టలేక 'అదిగో చూడు ' అన్నపుడు 
అతని వేలికొన చూపించే వెలుతురులోకాన్ని ఎంతకీ మనం చూడలేకపోతాము
మన కళ్ళని మూసిన మన అరిచేతుల చీకటిని అతను విదిలించలేకపోతాడు   

పొరలోపల, పొరలోపల, పొరలోపల దాగిన ఉల్లిరసం ఘాటులాంటి 
మన 'నేనే, నేనే, నేనే ' లను చూసి 
దు:ఖంతో, జాలితో
చల్లటి వానాకాలపు జల్లులాంటి నవ్వుల్నీ, చూపుల్నీ మనపై కురిపిస్తూ 
వచ్చినచోటికి మరలా తరలిపోతాడు 
వాన తరువాత వ్యాపించే నిర్మల ప్రశాంత నిశ్శబ్దం వెంట
అతను తన లోకాన్ని చేరుకొంటాడు

గంధర్వుడు ఒకడు వస్తాడు, వెళతాడు
మనకు ఎప్పటిలా సూర్యాస్తమయమౌతుంది
దిగులుపాటల్ని మోసుకొంటూ పిట్టలు చీకటిలో కరిగిపోతాయి
చీకటికోసం రోదసినిండా వేచివున్న ఏవో శక్తులు 
యధావిధిగా మనతో చేయి కలిపి  
చిరంతన సంభాషణలో తరువాతి భాగం కొనసాగిస్తాయి
వాటిని హత్తుకొని మనం మరొకసారి
స్వప్న లోకాలు దాటి
నిదురలోకి, నిదురలోకి, నిదురలోకి జారిపోతాము 

గంధర్వుడొకడు వచ్చివెళ్ళిన జాడలేవో
మనని కోమలంగా తడుతూ ఉంటాయి
మనలోలోపలి స్వప్నాలను పొదువుకొని కాపాడుతుంటాయి

27 జులై 2012

మౌలిక ప్రపంచం గురించి మొదటి కవిత్వం - ఆకాశం. డాక్టర్ రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు

ఇదొక కొత్త కవితా సంపుటి. ఇదీ ఈ మధ్యనే అచ్చయిన కవితాసంపుటి అని కాదు. ఇంతకు ముందు వచ్చిన, ఇప్పుడొస్తున్న కవితాసంపుటుల కన్నా భిన్నమైనదని.
ఆకాశం ఆధ్యాత్మిక కవితాసంపుటి. నాకు తెలిసి తెలుగులో ఇంతవరకూ ఇటువంటి కవిత్వం ఇదే.   ఆధ్యాత్మికత వివరణ నపేక్షించే మాట. దాన్నీ, భక్తినీ అర్థభేదం లెకుండా వాడుతున్నారు కనక. భక్తి అనే ప్రపంచంలో నామరూపాత్మకుడైన ఒక దేవుడుంటాడు. ఆయనను మానవులు ఆశ్రయించడం ఉంటుంది. వాళ్ళ విధేయత, అర్పణ ఉంటాయి. ఒక గుడి ఉంటుంది. దేవుడి కథలుంటాయి. ఒక మతం ఉంటుంది. మతం అంటే పూజలు, వ్రతాలు, మంత్రాలు, కర్మకాండ కలిసి తయారైన ఒక వ్యవస్థ. అందులో పరలోకం ఉంటుంది. అది సాధారణంగా స్వర్గమై ఉంటుంది.


ఆధ్యాత్మికత వేరు. అందులో దేవుడుండడు. రూపం ఉండదు. ఆ స్థానంలో విశ్వచైతన్యం ఉంటుంది. నిర్మలత్వం, దయ, ప్రేమ, క్షమ, త్యాగం వంటి మాటలు వాటి మౌలికార్థాల్లో దేవుడి స్థానంలో ఉంటాయి. వాటిని ఆరాధించడం ఉండదు. ఆచరించే ప్రయత్నం ఉంటుంది. మోక్షం ఇక్కడ ఎవరూ ప్రసాదించే విషయం కాదు. ఎరుక ద్వారా, ఆచరణ ద్వారా మనిషి దాన్ని సాధించుకుంటాడు. స్వర్గం అంటూ వేరే ఏమీ ఉండదు. ఈ లోకాన్ని ఈ జీవితంలోనే ఎడంగా నిలిచి చూసే చోటు, స్థితి ఉంటుంది.
ఈ దృష్టితో  'ఆకాశం' ఒక ఆధ్యాత్మిక కవితా సంపుటి.

 
ఇక్కడ ఆకాశం మనం తలెత్తి చూస్తే కనిపించే నీలం రంగు జాగా కాదు. పైపైకి పోతే గ్రహ నక్షత్రాంతర స్థలంలో ఉండే నల్లటి ప్రదేశం కూడా కాదు. ఆకాశం అంటే చోటు. దేనిలో ఈ చెట్టూ, పిట్టా, మృగం, కొండ, సముద్రం.. సమస్త పదార్ధాలూ ఉంటున్నాయో అది. గ్రహాలు, గ్రహాలు కాకముందు, నక్షత్రాలు, గెలాక్సీలు కాకముందు వేరే పదార్ధంగా ఉంటాయి. ఇంకా వెనక్కి వెళితే ఒక ఆదిమ పదార్ధం ఉంటుంది. అదీ 'చోటు 'లోనె ఉంటుంది. ఈ 'మహా చోటు 'ని కవి ఆకాశం అంటున్నారు. సృష్టి మొత్తం అంతరిస్తే అదే మిగులుతుంది. కాబట్టి ఈ సమస్తం అందులోంచే వచ్చి ఉండాలి.


మనిషికి మూడు ప్రపంచాలున్నాయి. ద్వితీయ ప్రపంచం, ప్రాధమిక ప్రపంచం, మౌలిక ప్రపంచం. ద్వితీయ ప్రపంచం అంటే ఆర్ధిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, విద్యావ్యవస్థ, మతవ్యవస్థ ఇలాంటి వాటితో కూడిన ప్రపంచం. మనిషి ఇప్పుడు ఈ ప్రపంచంలోనే అత్యధికంగా జీవిస్తున్నాడు. దీన్ని సృష్టించుకున్నది మానవుడే కనక ఇతర జీవజాలానికి ఈ ప్రపంచం లేదు కనక దీన్ని మానవ ప్రపంచం అని కూడా అనొచ్చు. ప్రాథమిక ప్రపంచం అంటే ప్రాకృతిక ప్రపంచం. అంటే నదులు, సముద్రాలు, పక్షులు, వృక్షాలు, ఎండ, మంచు, వెన్నెల మొదలైన అన్నీ ఉన్న ప్రపంచం. మౌలిక ప్రపంచం అంటే దేని నుంచి ఈ ప్రాధమిక ప్రపంచం వచ్చిఉండాలో అది.
   'ఆకాశం ' ఈ మౌలిక ప్రపంచాన్ని ప్రతిపాదిస్తుంది. దాని గురించి మాట్లాడుతుంది. 
ఇలా చెప్పగానే 'అవునూ, ఈ పనిని కవి కవిత్వం ద్వారా ఎలా నిర్వహించాడు ' అని కుతూహలం పుడుతుంది.

మచ్చుకి ఒక కవితను చూద్దాం.
   'ఏ అలజడీ లేనపుడు
    అలలన్నీ కొలనులో దాగి ఉండి
    నీటిలో నీరు పొందికగా సర్దుకొంది ' అని మొదలవుతుంది.

    'ఏ వెలుగూ లేనపుడు చీకటిలో చీకటి విశ్రమించిందనీ, ఏ కదలికా లేనపుడు శబ్దాలన్నీ నిశ్శబ్దంలో దాగి ఉండి ప్రశాంతత ప్రశాంతంగా విస్తరిస్తోంది ' అనీ చెబుతుంది.

   'అయితే ఏ పుట్టుకా లేనపుడు
    అందరం ఎక్కడ దాగి వున్నాం! '

    అని చటుక్కున ఒక ఆశ్చర్యకరమైన ఆలోచనను పైకి తీస్తుంది.
    'బయలుదేరిన చోటికి త్వరగా తిరిగి వెళ్ళాలనె బెంగ ఏదొ .. పరివ్యాప్తమౌతోంది ' అని ముగుస్తుంది.
   దీనికి కవి ఉంచిన పేరు.. ఇంటిబెంగ!

   ఇవి మొత్తం 100 కవితలు. ఒక పది, పదిహేను కవితల్ని మినహాయిస్తే తక్కినవన్నీ 1 జనవరి నుంచి 5 ఏప్రిల్ 2011 మధ్య కాలంలో రాసినవి. 100 రొజుల్లో 80 కవితలు రాయడం ఆశ్చర్యం.
   అయితే ఇవి రాసిన కవితలు కావు. వచ్చినవి. 80 కవితలు రావడం కూడా ఆశ్చర్యమే.
   లోగడ బి.వి.వి.ప్రసాద్ ' పూలు రాలాయి ' హైకూ సంపుటి విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన మాటనే వాడితే ఒక జ్వరగ్రస్తత లాంటి స్తితి ఆవరించినపుడు అవన్నీ వచ్చాయట. 

   'అందరినీ ఒకే ఆకాశం, ఒకే భూమీ తయారుచేసుకొన్నాయి. 
    ఫలం తనలో తాను పక్వమౌతూ పరిమళాన్ని వెదజల్లినట్లు
    సృష్టి తనలో తాను పక్వమౌతూ మానవుల్ని సృష్టించుకొంది
    మానవులలో పరిమళాలవంటి ఊహల్ని సృష్టించుకొంది '  అంటారు ఒక కవితలో. 
ఈ కవి కూడా అదే పని చేసినట్టుంది. తనలో కవిత్వం పక్వమయ్యేవరకూ వేచిచూసి, అయినప్పుడు వ్యక్తం చేసారు. 

'నిన్న మధ్యాహ్నం ఖాళీగా ఉండిపోయాను. బోర్ కొట్టేసింది ' అన్నాను ఒకసారి ప్రసాద్ గారితో. ఆ మాటకి, ' ఒంటరిగా ఉంది బోర్ కొట్టడం అంటే మనల్ని మనం భరించలేకపోతున్నామని అర్థం. ఒక్కళ్ళమే ఉండటం అంటే మనతో మనం ఉండటమే కదా ' అన్నారు. మరో సందర్భంలో మా ఊరొచ్చినపుడు సకాలంలో బస్‌స్టాండుకి వెళ్ళలేకపోయాను. ' మిమ్మల్ని వెయిటింగ్‌లో పెట్టేసాను, సారీ ' అంటే, ' జీవితం, జీవించటం కోసమే అయినప్పుడు వెయిటింగ్‌లో జీవితం లేకుండా పోదు కదా ' అన్నారు. ఈ మాటలు మెట్ట వేదాంతాలుగా, సరదా వ్యాఖ్యలుగా నాకనిపించలేదు. జీవితాన్ని ఒక ప్లేన్‌లో దర్శించడానికి ప్రయత్నించే సాధకుడి మాటలుగానే అనిపించాయి. వీటి ప్రస్తావన దేనికి అంటే కవి ఎవరో అర్థం కావడానికి.

   'అక్షరాలు కూర్చితే కవిత్వం కాలేము
   కవిగా జీవించటం సాధన చెయ్యాలి ' 
   ఈ కవితా సంపుటి కవి ఆత్మాభివ్యక్తి. ఇది ఒక లాలస నుంచి వచ్చింది కాదు. ఆర్తి నుంచి, అనివార్యత నుంచి, ప్రేమ నుంచి, స్పష్టత నుంచి, విశ్వాసం నుంచి వచ్చింది.

ఈ కవిత్వం ప్రతిపాదిస్తున్న తత్వం విషయంలో కవికి ఏ మాత్రం సందేహం లేదు. తన మార్గం మీద, గమ్యం మీద అచంచల విశ్వాసం ఉంటుంది ప్రసాద్‌గారి మాటల్లో, రాతల్లో. జీవితం అంతా దేన్ని అన్వేషిస్తున్నారో దాన్ని తప్ప మరి దేన్నీ పట్టించుకోని ఏకాగ్రత ఉంటుంది.  
రమణ మహర్షి, నిసర్గదత్త మహరాజ్, Eckhart Tolle వంటి వాళ్ళు ప్రసాద్‌గారి ఆధ్యాత్మిక గురువులు. వాళ్ళంతా ఏ దృష్టినీ, స్థితినీ ప్రబోధిస్తున్నారో ఆ దృష్టిలో, ఆ స్థితిలో ఈ ప్రపంచం ఎలా అర్థం అవుతుందో దాన్ని ఆవిష్కరిస్తుంది ఈ 'ఆకాశం '.
   ఆధ్యాత్మికవేత్తల దృష్టి భౌతికవాదుల దృష్టికన్నా చాలా భిన్నం.
   'ప్రపంచం మనం సరిచేయటానికి లేదని
    జీవితం మనల్ని సరిచేసుకోవటానికి ఉందని
    మనం చూసే చిక్కులన్నీ, లోపాలన్నీ మనకి ఏవో నేర్పబోతున్నాయనీ ' 
    వాళ్ళు చెబుతారు. 'ఆకాశం ' దీన్ని కవిత్వీకరిస్తుంది. 

    'ఇన్నాళ్ళూ నేను జీవితమనుకొన్నది ఒక నీడ అని, దు:ఖక్రీడ అని ' ఒక కవిత తీర్మానిస్తుంది. జీవితం నుంచి జీవిని కాస్త ఎడంగా జరుపుతుంది. 

   'పుట్టగానే పిల్లలు నవ్వరెందుకని..
   వాళ్ళంతవరకూ 
   ఏ జరామరణాల అంచుల్ని దాటి బ్రతికారు
   ఏ భయ రహిత ఏకాంతంలో సంచరించారు
   ఒక్క మాటైనా, ఒక్క చూపైనా, ఒక్క మనిషైనా అక్కర్లేని
   ఏ మహాశాంతి లోకాన్నుండి ఇక్కడికి జారిపోయారు '
   అని మన దృష్టిని జననాత్ పూర్వస్థితికి మళ్ళిస్తుంది మరో కవిత. 

ఆకాశం చెబుతున్న ఆత్యంతిక పదార్థం లేదా అపదార్థం ఊహా, నిజమా అనే ప్రశ్న చాలామందిని వెంటాడుతూనే ఉండొచ్చు. అది నిజమే అయిన పక్షంలో మనం దానిగా ఉండటం ఎలా? ఊహ అయినట్టయితే ఆ ఊహకు పరమార్థం ఏమిటి? అనే ప్రశ్నలూ వెంటాడుతూ ఉండొచ్చు. దానికి 'జీవితం దైవం' అనే కవిత ఒక జవాబునిస్తుంది.

   'పవిత్ర భావన అనుభవాల్ని పవిత్రం చేస్తుంది, శుభ్రం చేస్తుంది.
   స్వచ్ఛమైన మనస్సులో జీవితానుభవం విస్తరిస్తుంది.'  
   ఈ కవిత అనే కాదు, ఈ కవిత్వం మొత్తం జవాబుగా పర్యవసిస్తుంది. దీన్ని చదువుతున్నంతసేపూ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఈ కవిత్వంలోని పదాలంత మృదువుగా, పోలికలంత లలితంగా, భావనలంత నిర్మలంగా ఉంటుంది. 'ఎడతెగని ప్రార్ధన లాంటి ఆర్ద్రతలోకి సమస్తాన్నీ అనువదిస్తున్నట్లుంటుంది '   
   ఈ కవిత్వపు అవసరం ఉన్నట్టు తడుతుంది. ద్వితీయ ప్రపంచంలో, అంటే తన సృష్టిలోనే ఇరుక్కుపోయి ఊపిరాడక అవస్థ పడుతున్న మనిషికి విముక్తి చూపాల్సిన అవసరం కనబడుతుంది. 

   ధ్యానం గుర్తుకొస్తుంది. మనిషికి బాహ్య ప్రపంచాన్ని మాత్రమే తెలుసుకొని సుఖశాంతులతో ఉండలేడు కనక ధ్యానావసరం కలిగింది. అంత:ప్రపంచం ఒకటి ఉందని తెలియాలి, అది ఎలాంటిదో తెలియాలి. అప్పుడు బాహ్య ప్రపంచాన్ని ఎలా సమీపించాలో, ఏంచేసినా ఎలా చెయ్యాలో తెలుస్తుంది. 
   ఆధ్యాత్మికత, బాహ్య ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకోవాలో, జీవితాన్ని ఎలా జీవించాలో తెలియజేసే అంతర్దృష్టి. సృష్ట్యంతర్దృష్టి.
   దీనికోసం ఈ కవి ప్రయత్నం. తెలిసిన విషయాలనుంచి మనల్ని తెలియని లోకానికి తీసుకెళ్ళడానికి, అక్కడనుంచి ఈ లోకాన్ని చూపడానికి ఒక స్థిరమైన, నెమ్మదితో కూడిన ప్రయాణంగా ఈ సంపుటిని తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. వంద కవితల ఈ సంపుటి ఒకేసారి కూర్చుని చదవగలిగేటంత సారళ్యం, కోమలత్వం, సౌందర్యం, ప్రశాంతత కలిగి ఉంది.

   కొన్ని కవితల్లో జెన్ ఛాయలు కనిపిస్తాయి. హైకూ మీదుగా వస్తున్న ఈ కవి ప్రయాణాన్ని గుర్తు చేస్తాయి.
   'తీరం వదిలిన దేన్నైనా ప్రవాహం తీసుకుపోయినట్లు
   అలవాట్లను వదిలితే చాలు జీవితం తనతో మనల్ని తీసుకుపోతుంది '
అని ముగుస్తుంది.'అలవాటు ' కవిత. యాంత్రికతకు, ఏమరుపాటుకు వ్యతిరేకి జెన్, నిజానికి జెన్ తత్వంలాంటి వాటి గురించి మాట్లాడుతున్నపుడు వ్యతిరేకత వంటి ఋణాత్మక పదాలు వాడకూడదు. పాజిటివ్ పదాలే ఎన్నుకోవాలి. ఆధ్యాత్మికత కూడా అంతే. నెగటివ్‌కి చోటులేనిది. ఈ సంపుటిలో ఎక్కడా వ్యతిరేకత, కటుత్వం లేకపోవడం దీని ఆధ్యాత్మికతకు ఒక సూచిక. 

  ఇంతకీ జెన్ ఛాయలున్నా అవి పరిణామశీలాలుగానే ఉంటాయి. అంటే ప్రాకృతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచంవైపు నడిపేవిగా ఉంటాయని.
   'నిన్ను గాయపరిచిన మనిషివైపు దయగా చూసినపుడు
   నీకు ఇష్టమైన వస్తువొకటి ఎవరికైనా మనసారా ఇచ్చినపుడు 
   గెలిచికూడా ప్రపంచం ముందు వినమ్రుడివై మోకరిల్లినపుడు
   ఏదో జరుగుతుంది. లోపలెవరో మేలుకొన్నట్లుంటుంది.' 
   ఇటువంటి కవితలు చదువుతున్నపుడు సూఫీ కవిత్వం గుర్తుకొస్తుంది. కానీ సూఫీ ఫిలాసఫీకి పరిమితమైన సంపుటికాదు ఆకాశం.

   'జీవించే ఏర్పాట్లు మాత్రమే జీవితం కాదు
   జీవితం అర్థమైతే సమాజం అర్థమౌతుంది ' అంటుంది.
   ఇక్కడ జీవితం అంటే జననమరణాల మధ్య దశ కాదు. ఇంతకాల వ్యవధీ, ఇన్ని సంఘటనల సంపుటీకాదు. జీవచైతన్యం, జీవితం వేరు, జీవన సంఘటనలు వేరు అని టోలే వంటివాళ్ళు చెబుతున్న మాటలు గమనిస్తే ఇది సూఫీ తత్వం దగ్గర ఆగదని తెలుస్తుంది. 

   'మహాసముద్రాలు ఈదమని కవ్విస్తుంటే
   పాదమైనా మోపనట్టు నడిచివెళ్ళే మంత్రవిద్య నా కవిత్వం
   దృశ్యం నుండి అదృశ్యంలోకి
   ఉద్వేగాల నుండి స్వచ్ఛతలోకి
   భయం నుండి స్వేచ్ఛలోకి
   శ్రమతెలియక నడిపించే స్నేహం నా కవిత్వం ' 
   అని తన కవిత్వాన్ని ఈ కవి ఎందుకు ప్రకటించుకుంటున్నాడో అర్థమౌతుంది.

   కొన్ని కవితల్లో 'అతను' అని ఒక అతను కనిపిస్తాడు. అతను కవి ప్రతిపాదిస్తున్న ఆదర్శమానవుడు. మనుషులందరికీ తలొక ఆదర్శ మానవుడు ఉంటాడు. వాళ్ళందరినీ సేకరిస్తే కొన్ని టైప్స్ తయారవుతాయి. ఆ నమూనాల్లో ప్రసాద్‌గారు ఊహిస్తున్న నమూనా చాలా తక్కువమంది ఎంచుకుంటారు. ఎందుకని అంటే.. కోరుకోవడానికి, ఎన్నుకోవడానికి నచ్చి ఉండాలి. నచ్చడానికి ముందు ఆ ఆదర్శ మానవుడు 'తెలిసి ' ఉండాలి. ఆ తెలిసి ఉండడం కోసమే ఈ కవిత్వం. అది దీని పరమ లక్ష్యం. 

   ఈ కవి ఇస్తున్న ఆదర్శ మానవుడు ఆధ్యాత్మిక మానవుడు. స్థితప్రజ్ఞుడనే పేరుతో గీత ప్రతిపాదించింది ఇతన్నే. కానీ ఈ కవి గీతావాక్యాలనుంచి ఈ మానవుణ్ణి రూపొందించుకున్నట్టు కనబడదు. ఆధ్యాత్మిక గురువులు చెబుతున్న స్థితినుంచి ఇతన్ని కల్పించుకున్నట్లు తోస్తుంది. 'దయ ఉంటే ఓడిపోతామంటే, దయ లేకపోవటమే ఓడిపోవడమంటాడు ' ఇతను.  
   'ఆతను' అనే కవితలో మరొక ఆతను కనిపిస్తాడు.ఆతను మానవుడు కాడు, ప్రసాద్ గారే చెప్పినట్టు 'అతను' absolute truth. కేవల సత్యం. 

   'అతనికీ వారికీ మధ్య, నిద్రకీ మెలకువకీ ఉన్నంత దూరమైనా లేదని, అతన్ని చేరేందుకు ఊహలోంచి ప్రపంచంలోకి వచ్చే సమయమైనా ఎక్కువని తెలుస్తుంది ' అని,
   'అతన్ని చూసినవారైనా ఎలా ఉండడో చెబుతారు గాని అతన్ని చెప్పలేరు ' అనీ, కవి అన్నపుడు ఎరిగిన వాళ్ళకి తప్పక రమణ మహర్షి, టోలే చేసిన బోధలు గుర్తుకొస్తాయి.

   ఆధ్యాత్మికతకు కవిత్వరూపం ఇవ్వడం అంత తేలిక కాదు. దాన్ని ప్రసాద్ గారు సాధించిన మార్గం ఎంతో బాగుంది. ఆయన వాడే భాష, ఎన్నుకొనే పోలికలు, చేసే ఊహలు మనల్ని ముగ్ధుల్ని చేస్తాయి. ఈ వాక్యంలో ముగ్ధ శబ్దం ఊరికే వాడింది కాదు. ఇక్కడ వేరే మాటలేదు. అవి మనల్ని ముగ్ధత్వంలోకి తీసుకెళతాయని చెప్పడం కోసమే ఉద్దేశించిన పదం అది.

   'పదార్ధంలో కోమలంగా నిద్రిస్తున్న రుచిలా
   ఇంకా ఏ అనుభవమూ ఎదురుకాని మెలకువలా..'
అంటూ తాను చెప్పదలచుకొన్న స్థితికి మనని చేర్చడంలో గొప్ప ఒడుపుంది.

   'మన అనుభవాలు బెంగలుగా, విజయాలు భయాలుగా
   మనకైనా చెప్పకుండా లోపలెవరో అనువాదం చేసేస్తుంటే..'
అన్నప్పుడు జీవన విషాద రహస్యాల్ని అక్షరీకరించిన ease బాగుంది.

   చలం గురించి రాస్తూ
   'మీ హృదయమంతా నింపి మాటలు బహూకరిస్తున్నపుడు
   మీ మాటల్లో వారి మాటలే విన్న తెలివితేటలకి  క్షమించాలి ' అంటారు.

మరొకచోట
   'ఒకరి భయం కలిసుందామన్నపుడు
   ఒకరి భయం విడిపోదామన్నపుడు
   ఒకే భయంలో ఇద్దరూ కలిసి జీవిస్తారు ' అంటారు.

   'ఉద్వేగాలన్నీ బడిపిల్లల్లా బుధ్ధిగా కూర్చున్నట్లుంటుంది ' అంటారు మరోచోట.
   'అతను అన్నం తింటున్నపుడు
   రేపటిరోజు కూడా జీవించే ఆనందం కోసం ధ్యానం చేస్తున్నట్లుంటుంది ' అని అతన్ని (ఆదర్శ మానవుడిని) మరో కవితలో పరిచయం చేస్తున్నపుడు ఖలీల్ జీబ్రాన్ గుర్తొచ్చాడు. ఆయన రాసిన ప్రాఫెట్ జ్ఞాపకం వచ్చింది. అందులో అల్ ముస్తఫా ఆహారం గురించి చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. ఈ ఆకాశపు కవితా వాక్యం, దాని తర్వాత వాక్యం. మొత్తంగా ఈ కవితాసంపుటి ప్రాఫెట్ తర్వాత పుస్తకం.

   తిలక్ గురించి రాసిన ఒక కవితలో నేను మీ తర్వాత తరం వాడిని అన్నారు ప్రసాద్. అక్కడ అనాల్సిన మాట 'నేను జీబ్రాన్ తర్వాత తరం వాడిని ' అని నాకనిపిస్తుంది.
   ఈ ఆకాశం ఆంగ్లంలోకి అనువాదం కావాలని నా ఆకాంక్ష. భారతదేశపు జీబ్రాన్ ఇలా ఉంటాడని ప్రపంచానికి తెలియాలి కనుక ఈ అనువాదానికి తగిన launching కూడా ఉండాలని కోరిక.
   ఆధ్యాత్మికత ఇవాళ్టి ప్రపంచానికి అవసరమని, దీనిని వీలయినంత మందికి వినిపించాలని ఈ సంపుటిని ప్రకటించినా ప్రసాద్ గారికి సందేహమే. 'ఒకరిద్దరు మినహా ఎవరూ కవిని వినరు ' అనే రాసుకున్నారు. కానీ ఇప్పటికే చాలామంది వినడమూ, పట్టించుకోవడమూ మొదలైనట్టు అనిపిస్తోంది.
 గుంటూరుజిల్లా రచయితల సంఘం దీన్ని ఉత్తమ కవితా సంపుటిగా గౌరవిస్తోందని చినుకు రాజగోపాల్ గారు చెబుతున్నారు. శుభం.

జూన్ 2012 'చినుకు ' సాహిత్య మాస పత్రిక నుండి

'ఆకాశం' సంపుటి  దొరికేచోట్లు:
1. పాలపిట్ట ప్రచురణలు,  హైదరాబాద్. ఫోన్: 040-27678430.
2. కినిగే.కాం లో ఈ బుక్ లేదా ముద్రిత ప్రతి కోసం  
ఇక్కడ క్లిక్ చేయండి 

21 జులై 2012

'నిశ్చలనది మీద ఆకాశయానం' వసీరా

ఆకాశాన్ని అద్దంలో చూపించవచ్చా? చూపించవచ్చు. కానీ అద్దమంతే కనిపిస్తుంది. బి.వి.వి.ప్రసాద్ ఆకాశాన్ని అద్దంలో చూపించలేదు. ఆకాశంలోనే చూసుకోమన్నాడు. తాను చూసిన మేరకు వర్ణించాడు. వ్యాఖ్యానించాడు. బోధించాడు. తన ఊహలు, ఆలోచనలు, అనుభూతులు, అనుభవాలు పంచుకోవటానికి ప్రయత్నించాడు. దాని కళాత్మక సారాన్ని రమణజీవి కవర్ పేజీలో రుచి చూపించాడు. ఓ సముద్రంలో, ఓ అడవిలో, ఓ మంచు కప్పిన లోయలో, తెల్లని కాంతిలో కుంచె ముంచి ఓ కొత్త కవితని కవర్ పేజీగా ఇచ్చాడు.

ఆకాశాన్ని చూడ్డం అంటే కేవలం పైకి చూడ్డం కాదు. మనిషి ఎన్నిసార్లు పైకి చూస్తే ఓ ఆకాశాన్ని చూడగలడు. How many times must a man look up .. before he could see the sky అని Bob Dylan కాబోలు అన్నాడు. అందుచేత బివివి ఆకాశంలోకి చూడమన్నాడు కదాని చూస్తే, అక్కడేమీ లేదు కదా ఎందుకు చూడమన్నాడనిపిస్తుంది. అక్కడేమీ లేదనే సంగతి కూడా ఎప్పుడో పెద్దలు చెప్పేసినదే. మరి ఈయనేదో పెన్నిధిని చూసిన చిన్నపిల్లాడిలా.. కొత్త డిస్కవరీలా అంత ఉత్సాహంతో, ఎక్సయిట్‌మెంట్‌తో ఎందుకు పిలుస్తున్నాడనిపిస్తుంది. ఇతడు పైకి చూడలేదు. ఆకాశాన్ని చూడటానికి ఎన్ని ప్రయత్నాలు చెయ్యాలో అన్నీ చేసాడు. ఆకాశాన్ని మనుషుల్లోంచి చూశాడు. మానవీయంలోంచీ చూశాడు. మనుషుల్లోంచి ఆకాశాన్ని చూపించే ప్రయత్నం చేశాడు. పైకి కనిపించే ఆకాశమే లోపలికి చూసినా కనిపిస్తుందని కనుగొన్నాడు. అందుకే ఇద్దరి మనుషుల ఆకర్షణని కూడా ఏ స్థాయికి తీసుకెళ్ళాడంటే..

 'కాలాలు మారతాయి, దేశాలు మారతాయి
దేహాలు మారతాయి, దేహాల దశలు మారతాయి
కల మళ్ళీ పూవులా పూస్తూనే వుంటుంది ' ఇంత వరకూ ఎవరయినా అనగలరు.
'కల మళ్ళీ పూవులా రాలుతూనే వుంటుంది ' అని ఒక్క బివివి మాత్రమే అనగలడు.

'ఎప్పుడూ విసుక్కొనే కన్నకొడుకు తల్లి పాదాలు తాకి దీవించమన్నపుడు
ఆమె కళ్ళలో ఎన్నడూ చూడని కన్నీరెందుకొస్తుంది

గాయపరిచాను క్షమించమన్నపుడు
అప్పటివరకూ వెలవెలబోతున్న భార్య కన్నుల వెంట ఆపలేని ధారలెందుకొస్తాయి

చాలా ఖర్చవుతుందేమో వద్దులే నాన్నా అని పిల్లలన్నపుడు
వారిలేత దయాపూర్ణ హృదయాలు తలచి అతని కన్నులెందుకు చెమ్మగిల్లుతాయి
.. .. ..
మనుషులిద్దరి మధ్య హృదయం ప్రవేశించిన ప్రతిసారీ
తెలివి కాని తెలివీ, బలము కాని బలమూ కన్నీరుగా మారి పొరలిపోతాయెందుకని ' అంటూ ప్రశ్నిస్తాడు.
ఇతడు ఆకాశాన్ని మనిషిలోంచి చూశాడు కాబట్టి ప్రపంచం మొత్తం మీద మానవ జీవితాన్ని ఒకే యూనిట్ గా చూశాడు. మానవసారాన్ని ఒకటిగా చూశాడు. కాదు, ఆకాశాన్ని మనుషుల్లో చూశాడు కాబట్టే మానవ సారాన్ని ప్రపంచసారంలో భాగంగా చూశాడు.

' నేను హృదయాన్ని, నేను అందరి ఒకే హృదయాన్ని
ఒక శరీరంలోంచి మాట్లాడుతున్నా నేనే అందరి శరీరాన్ని
.. .. ..
జీవులు వేదనలో ఉన్నపుడు వారిలో శాంతినై ఓదార్చుతున్నాను
వారు భ్రమల్లో మునిగినప్పుడు పరమకారుణ్యాన్నై ఎదురుచూస్తున్నాను ' అని కేవలం ఒక ప్రవక్త మాత్రమే అనగలడు.
కానీ బివివి అవలీలగా అనేశాడు. ఇలా మనిషి నుంచి మనిషిలోని విశ్వాకాశానికి రూట్ మ్యాప్ ఇచ్చేశాడు.

హృదయం ప్రవేశించినపుడు ఏం జరుగుతుందో చెప్తాడు. ఎలా నిద్రపోవాలో చెప్తాడు. ఎలా మెలకువగా ఉండాలో చెప్తాడు. ఏమీ చెయ్యకుండా గర్భంలో శిశువులా కూచుండాలని చెప్తాడు. 'గెలుపు జ్వరం తగిలిన లోకంలో పరాజితుడివై ఆరోగ్యంగా జీవించ ' మని చెప్తాడు.

ఆకాశం కనిపించే ముందు తన కొసగాలుల విసురులతోనే ఎన్నెన్ని దృశ్యాదృశ్యాలు చూపిస్తుందో, శూన్యంలోకి మరింత మృదువుగా వికసించిన పూలు, తిరిగి రాలాయని చెప్పడానికి మధ్య మంచుతెరల్లో ఏమేమి రహస్యాలున్నాయో, వాటిని వినిపించీ వినిపించనట్లు, కనిపించీ కనిపించనట్లు, యుగాల సారాంశం ఓ క్షణంలో స్ఫురించి, తిరిగి మరుపు కమ్మినట్లు ఇతడితో ఆడుకుంది ఆకాశం. ఆకాశమయినా తాను ఆకాశాన్ని కానని, ఆకాశానికి ముందూ, వెనకా ఉన్నదాన్నని ఓ ఆకాశం ఇతడికి కొన్ని క్షణాల్లో స్ఫురింపచేసి ఆనక మళ్ళీ, మళ్ళీ మాయ చేసింది. అప్పుడు బివివికి ఏమనిపించింది. ఏమిటో ఈ ఆకాశం ఏ లెక్కలకీ అందదు. లెక్కలు మానేస్తే అర్థమౌతానంటుంది. ఇది మన అంతరాత్మలా మాట్లాడుతుంది అనిపించింది. పైకి చూస్తే కనిపించే ఆకాశం, లోపలికి చూస్తే ఇలా ఇక్కడ కూడా ఉంటుందా అనిపించింది. అప్పుడు ఆకాశం వెనక మహా నిశ్శబ్దాన్ని కావాలని కలగన్నాడు.

పాపం ప్రసాద్ ఇటువంటి సంగతులే మనందరితో షేర్ చేసుకోవాలని తాను విన్నవి, కన్నవి విన్నవించడానికి ఈ పుస్తకం వేశాడు. బివివి ఆకాశయానం గురించి చెప్పాలంటే, ఓ మంచి బాలుడు కవి కావడానికి యాత్ర ప్రారంభించాడు. తర్వాత మంచి కవిగా యాత్రించాడు. ఒక మంచి కళాకారుడు తనకు తెలియకుండానే ఆకాశయానం మొదలుపెట్టాడు. 'నేనే ఈ క్షణం ' రాశాడు. అయితే తర్వాత తన యాత్ర ఆకాశయానం కోసమా? తన యాత్ర ఆకాశం కంటే ముందునుంచీ ఉన్నదాని కోసం చేసే యాత్రా? అని అశ్చర్యపోయాడు. ఈ యాత్రలోని అనుభవాలే మనతో పంచుకున్నాడు.

'అడవిలో వికసించి రాలిన అనామక పుష్పంలా
ఎవరూ చూడనప్పుడు ఎగురుతూ వెళ్ళిపోయిన పేరు తెలియని పిట్టలా
అక్షరాలు గుర్తించేలోపు అదృశ్యమైన ఊహలా
గుడి తలుపులు మూశాక లోపల వెలుగుతున్న దీపంలా
నిశ్శబ్దంగా బ్రతికితే ఏమిటి? నిరాడంబరంగా వెళ్ళిపోతే ఏమిటి?
.. .. ..
విశాలమైన మెలకువలూ, విశాలమైన నిద్రలూ తనివితీరా అనుభవిస్తే చాలు
వెలుపలా, లోపలా బోలెడంత విశ్రాంతి సంపాదించగలిగితే చాలు
బ్రతికినంత నిశ్శబ్దంగా, నిరాడంబరంగా మన చోటు ఖాళీ చేస్తే చాలు ' అంటూ
పుట్టుకా, బతుకూ, చివరికి చావూ..సృష్టిలోని హార్మొనీని డిస్ట్రబ్ చెయ్యకూడదని.. సృష్టిలో మమేకం అవ్వాలనే కాంక్షని వెలిబుచ్చాడు.

దీనికోసం ఎలాంటి సాధన కావాలి, ఏం చెయ్యాలనే విషయం కూడా బివివి చెప్పాడు.
'మనకు తెలియని ఈ మహా లోకంలో
ఎప్పుడూ శబ్దదృశ్యాల చిటికెన వ్రేళ్ళు పట్టుకొని సంచరిస్తున్నా
విశ్రాంతి తెలియని సాహసిలా, స్వాప్నికుడిలా
ఎప్పటికప్పుడు వాటిని ఖాళీ చేసుకొంటూ కొత్త మెలకువలోకి ప్రవేశించాలి '
'తీరం వదిలిన దేన్నైనా ప్రవాహం తీసుకుపోయినట్లు
అలవాట్లను వదిలితే చాలు జీవితం తనతో మనల్ని తీసుకుపోతుంది '

ఇక్కడ నాకు బాలరాజు కథ సినిమా గుర్తొస్తుంది. ఒక వాక్యంలోని సత్యాన్ని అనుభవించి తెలుసుకోడానికి వందేళ్ళ జీవితం సరిపోదు అనిపిస్తుంది. అయినా బివివి ఎంత ఈజీగా చెప్పేశావయ్యా. అసలిది సాధ్యమయ్యేదేనా? అటు నిద్రాపోకుండా, ఇటు మెలకువగానూ ఉండకుండా ఏమిటిలాంటి కలలు కంటున్నావు? ఇలాంటి కలలు కంటున్నావు కాబట్టే 'అది ఉంటుంది ' ' చివర చూసినవాడు ' 'ఒక్క ఊహైనా ' వంటి కవితలు రాసిపారేశావు.

అద్దం గురించి రాసినా ఇదే గొడవ.
'అది మనని చూస్తుందో, మనం దానిని చూస్తామో తెలీదు
మన ముఖం దానిలో చూస్తున్నపుడు
దాని ముఖం మనలో చూస్తుందో లేదో తెలీదు

మనం నిద్రపోతున్నపుడైనా
అది నిద్రపోతుందా అని క్రీగంటితో గమనిస్తే
వీధి గుమ్మం తలుపు బార్లా తెరిచినట్టు
అద్దమంత కన్ను తెరుచుకొని
గదినంతా కావలి కాస్తున్నట్లు చూస్తూనే ఉంటుంది '
.. .. ..
అద్దం అర్థం కాకుండా ఉండిపోతుంది
అది నిద్రపోతుందో, కలగంటుందో, మెలకువగా ఉందో
ఎప్పటికీ అర్థంకాకుండా ఉండిపోతుంది '
ఇంతవరకూ అద్దంతో కవిగారి గొడవ.. శిల్పం రీత్యా సూపర్బ్. అంతవరకూ ఓకే.

అక్కడినుంచి
'మనం అద్దంలా ఉండగలిగితే బాగుండును
నిద్రలోని కలలాంటి మెలకువతో ఉంటే బాగుండును ' అంటూ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాడు.

పోనీ నిద్ర గురించి రాసినా ఇదే తపన. మామూలు నిద్రని మార్మికంగా వర్ణించడం మొదలెట్టి చివరికి..

'ఏ భేదమూ మిగలని, ఏ కలలూ, దిగుళ్ళూ మనపై పనిచేయని
పవిత్రమైన నిద్రలాగా మెలకువ ఉంటే జీవితమెంత మృదువుగా ఉంటుంది
గాఢమైన నిద్రలాంటి లోతైన మెలకువ ఉంటే జీవితమెంత ఉదాత్తమౌతుంది ' అంటూ మంచి శిల్పంతో కవిత చెప్తాడు.

నాయనా ప్రసాదూ! ఈ స్థితిని ఏమంటారో తెలుసా? అమ్మగారిని అడుగు. అమ్మ చెప్పినా మనం అర్థం చేసుకోగలమా? అది ఎవరో గొప్ప యోగులకి మాత్రమే సాధ్యం. మనకి అసాధ్యం. ఇది నిజం. అయితే ఇంకో నిజం ఉంది. అఫ్‌కోర్స్ అమ్మ దయతో అన్నీ సాధ్యమే.

అసలు 'మొదలైతే చాలు '
'ఆకాశంలో పలుచగా పరుచుకొన్న శబ్దంలా
పదార్థంలో కోమలంగా నిద్రిస్తున్న రుచిలా
ఇంకా ఏ అనుభవమూ ఎదురుకాని మెలకువలా
సరళంగా, తేటగా, ప్రశాంతంగా సిద్ధంగా ఉండగలిగితే చాలు

పిట్ట వాలాక పిట్టలో వాలుతున్న విశ్రాంతిలా
నవ్వుతుంటే నవ్వులో వికసిస్తున్న కాంతిలా
ఊరికే ఉండీ లేనట్లు, కదిలీ కదలనట్లు
ఉండగలిగితే చాలు, చలించగలిగితే చాలు '

ఈ శక్తులే 'తేటగా, ప్రశాంతంగా, సిద్ధంగా 'నూ ఉంచుతాయి. ఈ శక్తులే ఆకాశ దర్శనం చేయిస్తాయి. నిద్ర కవితలో చెప్పిన మెలకువని ఇచ్చేది కూడా ఈ శక్తులే. ఈ శక్తులే అమ్మ కృప.

ఆ శక్తులే కవికి ప్రాచీనులు చెప్పిన రహస్యాన్ని విప్పాయి.

'ఆకాశమే శబ్దమై మన చెవుల ద్వారా తనని వింటుంది
వాయువే స్పర్శలా మారి మన చర్మం ద్వారా తనని తాకుతోంది
అగ్ని దృశ్యంలా విస్తరించి మన కనుల ద్వారా తనని చూసుకొంటోంది
జలమే రసరూపం దాల్చి మన నాలుకల ద్వారా తనని రుచిచూస్తోంది
భూమి పరిమళంగా పక్వమౌతూ మన నాసిక ద్వారా తనని ఆఘ్రాణిస్తోంది '

ఈ ప్రాచీన రహస్య ఆకాశ యాత్రని ఇంకాస్త పొడిగించింది.

'అయితే కదలని ఆకాశానికి ముందు ఏముంది
ఆకాశం ఉండటానికి ముందు ఉన్నది ఏమిటి '

'నేనే ఈ క్షణం ' అని చెప్పిన బివివి, నేనే ఆకాశాన్నని చెప్పలేదు.

'అందరినీ ఒకే ఆకాశం, ఒకే భూమీ తయారుచేసుకొన్నాయి
ఫలం తనలో తాను పక్వమౌతూ పరిమళాలను వెదజల్లినట్లు
సృష్టి తనలో తాను పక్వమౌతూ మానవుల్ని సృష్టించుకొంది
మానవులలో పరిమళాల వంటి ఊహల్ని సృష్టించుకొంది ' అంటున్నాడు.

అంతేకాదు-
'మనం ఆకాశం పిల్లలమనీ, చిన్న చిన్న ఆకాశాలమనీ
మనని ఎప్పుడూ వదలని అమ్మలాంటి ఆకాశాన్ని
మనమే తప్పించుకొని, తప్పిపోయామనుకొని
సదా వెదుకుతూ తిరుగుతున్నామని ' గ్రహించిన వాళ్ళ గురించి చెప్తూనే

అసలు ఆకాశం ఎక్కడ ఉంటుందో కూడా చెప్పాడు. ఆకాశం వెనుక మహా నిశ్శబ్దాన్ని కావాలని కలగన్నాడు.

నేనే ఈ క్షణం.. మనమే ఆకాశం.

ఇంకా ఆకాశమంత గాఢమైన, ఆకాశమంత నిశ్శబ్దం మేల్కొన్నాక ఈ కవి చెప్పడానికి ఏమయినా మిగుల్తుందా? 'మౌన వాక్య 'మే సమాధానమా? ఏమయినా ఇతడు మనుషుల్లోంచి ఆకాశాన్ని చూపించాడు. ఆకాశాం వెనుకా, ఆకాశం ముందూ ఏముందో చూద్దామంటున్నాడు.

మనుషుల మధ్య 'హృదయం ప్రవేశించినపుడు' ఈ పుస్తకంలో ఆకాశాన్ని తనివితీరా చూడగలరు.

డిసెంబర్ 2011 'పాలపిట్ట ' సాహిత్య మాసపత్రిక నుండి

'ఆకాశం' సంపుటి  దొరికేచోట్లు:
1. పాలపిట్ట ప్రచురణలు,  హైదరాబాద్. ఫోన్: 040-27678430.
2. కినిగే.కాం లో ఈ బుక్ లేదా ముద్రిత ప్రతి కోసం  
ఇక్కడ క్లిక్ చేయండి 

17 జులై 2012

జీవితం ఇలాగే

జీవితం ఇలాగే వుంటుంది
ఊహలు కూడా ఆవిరైపోయే నడివేసవి మధ్యాహ్నపుటెండలా వుంటుంది
స్వచ్ఛప్రవాహం మధ్య సగం మునిగీ, సగం మేలుకొన్న శిలలా వుంటుంది
చిన్నపుడు విప్పలెక వదిలేసిన పొడుపుకథలా వుంటుంది
నిన్ను నీకు మిగలనివ్వని కీచురాయి అరుపులా వుంటుంది

జీవితమింతే
ఇది వానలో చిక్కుకొన్న ఇంద్రధనువు
యుగాలుగా నిశీధిలో ఒంటరిగా వేలాడే నక్షత్రం

ఇది తల్లిపక్క నిద్రించే బిడ్డ మనస్సులా నిర్భయంగా వుండదు
శూన్యం ముఖంలో ముఖంపెట్టి ఆడుకొనే పూవులా అమాయకంగా వుండదు
ప్రేమికుల మొదటి నిష్కపట స్పందనలా తాజాగా వుండదు
సృష్టి అంతా దైవమనే జ్ఞాని హృదయంలా పవిత్రంగా వుండదు
నిజాయితీగా వున్న క్షణాల్లొ వెలిగే నిజమైన మనశ్శాంతిలా వుండదు

జీవితమింతే
ఇది ఒక దిగంబర దేవత
ఇది నిన్ను రమ్మనదు, పొమ్మనదు
ఇది కావాలనదు, ఇది వద్దనదు
మతిలేని యాచకురాలి నవ్వులా నీ కలలన్నిటినీ కోసుకొంటూ తరలిపోతుంది
నీ నమ్మకాలనీ, భయాలనీ, బంధాలనీ ఎటో విసిరేస్తుంది
మరలా పోగుచేసి చూపిస్తుంది
నువు నిద్రపోదామనుకొంటే, గోల చేసి లేపుతుంది
మేలుకొందామనుకొంటే, జోలపాడి తలనిమురుతుంది

రానన్నా బడికి లాక్కెళ్ళిన చిననాటి వెంకన్నలాంటిది జీవితం

శూన్యంలో ప్రవేశించిన శూన్యంలా ఇక్కడ గడపక తప్పదు
శూన్యంనుండి నిష్క్రమించిన శూన్యంలా ఇక వెళ్ళక తప్పదు

ఎవరైనా, ఇలా బతకాలని నేర్పి పంపితే బాగుండును
ఎలా బ్రతకాలో మనకైనా అర్థమయేసరికి
మనచుట్టూ వున్న సర్కసు డేరా, జంతువులూ, కోలాహలమూ మాయమైపోతాయి

______________________________
ప్రచురణ: ఆదివారం ఆంధ్రజ్యోతి 17.6.2012

15 జులై 2012

దిగులు వాన

1
దిగులు గాలిపటం ఎక్కడో ఎగురుతూ ఉంది ఈ విరామసమయంలో

2
వాన కురుస్తుంటే లోలోపల దాగిన తాపమేదో ఆవిరై చల్లబడాలి కదా
కానీ ఈ దిగులేమిటి
దారిలో తగులుకొన్న కుక్కపిల్లలా నాతోనే తిరుగుతోంది
 
3
ఎందుకని 'ఆకాశమా ఏడవకమ్మా' అనాలనిపిస్తోంది
మననెవరూ ఓదార్చనపుడు, మనకెవరినైనా ఓదార్చాలనిపిస్తుందనుకొంటా
 
4
విరామమెంత బరువుగా వుంటుంది
ఈ ఖాళీ సమయాన్ని తెల్లకాగితంలా మడిచి దాచుకొని
వత్తిడుల మధ్య వాడుకోగలిగితే బాగుండును
 
5
ఏదో ఒకటి చేయాలి
నన్ను నేను తప్పించుకోవాలి
కురిసే, కురిసే వానని ఊహతో ఆపగలనేమో ప్రయత్నించాలి
 
6
సంగీతమో, స్మృతులో, కవిత్వమో
దేనికైనా ఈ దిగులు సరైన సమయం
కానీ, అన్నిటినీ విడిచి,
ఈ సారైనా దిగులు గర్భంలోకి సరాసరి దూకాలని ఉంది
ఏ సృష్ట్యాది కాలపు వెలుతురులు అక్కడ దాగివున్నాయో చూడాలని ఉంది
 
ఏమీ లేకపోవటమైనా అక్కడ ఉండకపోతుందా
అంతూ, దరీ లేని స్వేచ్ఛ నన్ను ముంచేయకపోతుందా
నిజమైన వాన ఏదో నన్నొక చినుకుని చేసి ఎటైనా విసిరేయకపోతుందా