16 ఆగస్టు 2014

నీలో కొన్నిసార్లు

నీలో కొన్నిసార్లు ఉత్సవముంటుంది

అప్పుడు నీకందర్నీ పలకరించాలనిపిస్తుంది
పూలతో, పిట్టలతో, దారినపోయే మనుషులతో
నీకు తోచిన మాటలన్నీ మాట్లాడాలనిపిస్తుంది
దు:ఖంచే నేత్రాలపై మృదువుగా ముద్దులు పెట్టాలనిపిస్తుంది
ఎవరేమనుకొంటే ఏమిటని తోచినపాటలన్నీ పాడాలనిపిస్తుంది
దేహాన్నొక కెరటం చేసి నర్తించాలనీ,
నలుగురు పిల్లల్ని పోగుచేసి పరుగుపందెంలో వాళ్ళతో ఓడిపోవాలనీ అనిపిస్తుంది

నీలో కొన్నిసార్లు నిరాశ వుంటుంది

అప్పుడు ప్రకాశిస్తున్న ఎండలోకి ఎవరో చీకటిని ఒంపుతున్నట్లుంటుంది
కనిపించని తలుపులన్నిటినీ మూసుకొంటూ లోలోపలికి వెళ్ళిపోవాలనిపిస్తుంది
గండశిలలాంటి కాలాన్ని పగలగొట్టి దిగంతాలకి విసిరేయాలనిపిస్తుంది
తెలియని ఉప్పెన ఏదో నలువైపులా నుండీ ముంచేస్తున్నట్లుంటుంది
విసుగువేరు తొలుచుకొంటూ వెళ్ళి నిన్ను పూర్తిగా ఖాళీ చేసుకోవాలనిపిస్తుంది

కొన్నిసార్లు భయముంటుంది నీలో

రాత్రి వచ్చిన కలచివర ఊహకందని శక్తి ఏదో నిన్ను ఎత్తుకుపోయినట్లుంటుంది
నిన్ను నొక్కిపెడుతున్న ఎవరినో శక్తికొద్దీ విసిరేయాలనిపిస్తుంది
రానీ, చూసుకొందామనే మొండిధైర్యంలోకి పూర్తిగా దూకేయాలనిపిస్తుంది
ప్రపంచాన్నంతా కూర్చోబెట్టి గబగబా పాఠాలు చెప్పేయాలనిపిస్తుంది

కొన్నిసార్లు నీలో శుభ్రమైన మౌనం వుంటుంది

ప్రపంచాన్ని చూసి ఒకే ఒక పసినవ్వు నవ్వాలనిపిస్తుంది
రాలినపూవు నేలని తాకిన చప్పుడు నీలో కోమలంగా కరిగిపోయినట్లుంది
సూర్యోదయాన్ని దోసిలిలో ఒంపుకొని సుతారంగా త్రాగినట్లుంటుంది
ఆకాశం ఒక పక్షిరెక్కయి శాంతిలోకి ఎగురుతున్నట్లుంటుంది

అప్పుడు మాత్రమే నీకు నువ్వు నిజంగా పుట్టినట్లనిపిస్తుంది

4 కామెంట్‌లు: