15 డిసెంబర్ 2025

ఆహా! ఎంత అందమైనదీ సృష్టి! - వాసు (న్యాయపతి శ్రీనివాస్)

 బి.వి.వి. ప్రసాద్ నలుగురి మన్నననూ పొందిన కవి. ఆయన హైకూలు రాస్తూండిన కాలం నుంచే ఆయనకొక fan following ఏర్పడింది. అది కవులకు అరుదుగా దొరికే గుర్తింపు. ప్రసాద్ కవిత్వంలోని విమల కోమల పదాల, వాక్యాల వరుసల్లో కనిపించే ప్రశాంతత వెనుక ఆయన నమ్మే అద్వైత సిద్ధాంతముంది. ఇందులోని కవితాత్మక పంక్తుల కుంభవృష్టిలో తడిసిపోయిన పాఠకులు చివరకు మిగిలేది ఏమిటో ఇట్టే గ్రహిస్తారు. ఇదొక రెండంచుల కత్తి. తను నమ్మిన సిద్ధాంతం తళుక్కున మెరుస్తూండే కవిత్వం రాయడం ఏ కవికి ఎంత కష్టమో గానీ ఈ కవికి ఇది సులభసాధ్యమేనని ఈ కవితా సంపుటి చెబుతోంది. "ఊరికే జీవితమై" సంపుటి తరువాత రెండేళ్ళకు ఇది వస్తూ ప్రసాద్ అభిమానులను అలాగే అలరించగలిగిన సంపుటి ఈ "సృష్టి". కవి ఈ చరాచర సృష్టినీ జీవితాన్నీ అద్వైతసిద్ధాంతపు వెలుగులో చూస్తూ అనుభవించగా చెందిన తన్మయమే ("తత్"+మయం!) ఇతని కవిత. వర్షం, రంగులు, పిల్లలు, తల్లీపిల్లలు, కొండా కోనా - వీటన్నిటినీ ఏ కవీ చూసి ఊరుకోలేడు, ఉరకలు వేస్తాడు. ఈ కవి వేసిన ఉరకలు చల్లగా వెన్నెల్లా సోకుతాయి. ఇంకా, ఈ కవి చెప్పిన సత్యాల వెనుక కఠోరమైన అనుభవాలున్నాయి. "గాఢమైన దుఃఖం తర్వాత మళ్ళీ పుడతావు/లోపలి జీవితేచ్ఛ నిన్ను మళ్ళీ ప్రసవిస్తుంది" అనడానికి ఎంతో బాధ తెలిసుండాలి. కవితాత్మక వాక్యాలు ఇందులో ఆద్యంతమూ కనిపిస్తూ హాయినిస్తాయి. "ఒక ఉదయం లేచేసరికి/పూవుగా మారిపోయి ఉంటావు" అనడమొక ఉదాహరణ. "వాన కురిసే వేళ/నీకు నువ్వు నిజంగా దక్కుతావు" అన్నప్పుడు కవి ఎన్నో పరకాయప్రవేశాలు చేసాడని ఊహించవచ్చు. ఏకాంతం విలువ, అది పెట్టే ఒత్తిడీ తెలిసిన కవి కనుక, "చీకటి పడేకొద్దీ ప్రకాశిస్తావు నీలోపలికి" అనగలిగాడు ఈ కవి. ఇందులో వరమో శాపమో అర్థం కాని, బహుశా రెంటికీ అతీతమైనదేదో దొరికేట్టుచేసే epigrams కూడా చాలా ఉన్నాయి. ఇది చూడండి: "గగనంలో తేలిన ఇంద్రధనువు/గగనంలోనే మునిగినట్లు/జీవితంలోంచీ తేలిన నువ్వు/జీవితంలోనే మునుగుతావు". "కనబడని ఆనందంలోకి తిరిగిరాకుండా తప్పిపోవాలి" ఈ వాక్యం కవి కొండల్లో తొలిచిన రోడ్లమీదుగా వెళుతుండగా రాసిన కవితలో ఆఖరి వాక్యం. జీవితానికి అర్థం చెప్పిన మహావాక్యమూ ఇదే. "ఇతరులు లేరనేంత ప్రేమ నీపై నీకు లేకపోవటమూ/ఇతరులు నువ్వే అనేంత ప్రేమ వారిపై లేకపోవటమూ/జీవితం లోతుల్లోని బలమైన విషాదం" అంటూ మనిషికే భాష్యం చెప్పాడు ఈ కవి. "చూస్తూ ఉండగా, గాఢమైన దిగులులోంచీ/కాంతివంతమైన మృత్యుపుష్పం/నీ ముందు దయగా విచ్చుకుంటుంది". నన్నడిగితే, ఈ దీవెన చాలు. ఈ సంపుటిని విశ్లేషిస్తూ గంగారెడ్డి గారు అన్నట్టు ఇది కవి తనకు తాను రాసుకున్న మ్యూజింగ్స్‌లాంటి కావ్యలేఖ. గంగారెడ్డిగారి కన్నా బాగా ఈ సంపుటిని అర్థం చేసుకున్న వారున్నారా అని నా సందేహం. ఉన్నారేమో! వాళ్ళు ఏదీ రాయరు. 

-వాసు-

Thank you Srinivasa Nyayapati garu!



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి