15 డిసెంబర్ 2025

జీవించి ఉండటానికి నన్ను నేను ఒప్పించుకునే ప్రయత్నం నా కవిత్వం

మనుష్యులు తమతమ రోజువారీ యుద్ధాలను దాటడానికి పోరాటం ఎంత ముఖ్యమో పోనివ్వాలనే చూపూ అంతే ముఖ్య మని తెలిసిన కవి బివివి ప్రసాద్. అందుకే గెలుపు జ్వరం పట్టిన లోకంలో, ఓడిపోవడానికే ఎక్కువ ధైర్యం కావాలని ఇప్పటికి ఎన్నో యేళ్ళ క్రితమే తన కవిత్వంలో చెప్పగలిగారు. లోపలి ప్రపంచంతో నిజాయితీగా సాగే సంభాషణల్లో, కొంత ఆనందమూ, కొంత దిగులూ, కొంత ఆశా కొంత వెలితీ అన్నీ తెరలు తెరలుగా తనలోనే వచ్చిపోవడం మనిషికి తెలుస్తుంది. ఆ ఉద్వేగాల ఉధృతిని అర్థం చేసుకునేందుకు ఉపకరించే తాత్విక అన్వేషణతోకూడిన కవిత్వం బివివి గారిది. లోపలి మనిషిపట్లా, లోకంపట్లా, దయాపూరితమైన చూపును, ఆలోచనను, మెలకువను ఈ కవిత్వంలో నేను చూశాను. సీతాకోక రెక్కల్లోని ఆశను, వర్షపు చినుకుల సంగీతాన్ని, వెన్నెలరాత్రుల నిశ్శబ్దంలోని గాఢమైన శాంతిని ఈ పదాల్లో నుండీ అందుకున్నాను. బివివి ప్రసాద్‌ కొత్త కవిత్వ సంపుటి ‘సృష్టి’ విడుదలైన సందర్భంగా ఆయనతో ఇంటర్వ్యూ.

‘ఆకాశం’ సంపుటితో మొదలై మీ కవిత్వ సంపుటుల్లో మీదైన శైలి ప్రస్ఫుటంగా కనపడుతూ వస్తోంది. దీని వెనుక ఉన్న సాధన, ప్రభావాలను చెప్పండి.

‘ఆకాశం’ రాసేనాటికి, శిల్పపరమైన ఎలాంటి కండిషన్ లేకుండా, నన్ను నేను వాక్యాల్లోకి తెరుచుకోవటం కొంత చాతనైంది అనుకుంటాను. అయితే నా వాక్యం నేను కనుగొనడానికి సహాయపడినవారు ముఖ్యంగా టాగోర్, ఖలీల్ జిబ్రాన్. పరమ ఉదాత్తమైనదాన్నే కవితా సమయంలో తాకాలని నేర్పారు వారు. తర్వాత ఇస్మాయిల్. కవిత్వంలోకి అనుభవాన్ని అనువదించడం, ప్రధానంగా, ఆయన నుండి వచ్చిందనుకుంటాను.

మొదటి సంపుటి ‘ఆరాధన’లోని కవితలలో ఏకరూప్యత లేకపోవటం గమనిస్తే, నాదైన వాక్యం కోసం తపన పడటం తెలుస్తుంది. ‘నేనే ఈ క్షణం’ సంపుటిలోని కవితల కాలంలోనే, విస్తృతంగా సాధన చేసిన హైకూ ప్రక్రియ brevity, effect, easeలను నేర్పింది. గనుక జపనీయ కవుల ప్రభావం కూడా నా వాక్యాల్లో ఉండవచ్చును.

మీ కవిత్వం ప్రధానంగా తాత్విక అన్వేషణతో సాగుతుంది. మీపై ఉన్న తాత్విక ప్రభావాలేమిటి?

శ్రీ రమణమహర్షి బోధించిన ప్రశ్న ‘నేనెవరు’ నా తాత్విక అన్వేషణకి మూలం. ఆ ‘నేను’ను గురించి విస్తృతంగా, లోతుగా వివరించిన నిసర్గదత్త మహరాజ్‌ని చదవటం స్పష్టతనిచ్చింది. ‘నేను’ను మరింత సూక్ష్మంగా బోధించినవారు శ్రీకాళహస్తిలోని సుబ్రహ్మణ్యంగారు. పూర్వ ఋషుల బోధలు, ఎకార్ట్ టోలీ వంటి ఆధునిక ద్రష్టల సూచనలు కూడా నా వెదుకులాటకి సహాయపడుతున్నాయి అనుకుంటాను. అయితే, అంతిమంగా ఎవరైనా తమదైన స్పష్టత, వెలుగు తామే పొందాల్సి ఉందనిపిస్తుంది.

రూమి, టాగోర్ లాంటి తాత్వికకవుల్లో దైవం కోసం, దైవానుగ్రహం కోసం, సన్నిధి కోసం వెదుకులాట ఉంటుంది. మీ అన్వేషణకు దైవం కేంద్రం కాదు. ఎందుకు?

పూర్వ తాత్వికకవులు సత్యాన్ని దైవంగా, object గా, చూడబడేదిగా తలచటం ఎక్కువ, కొన్ని మినహాయింపులున్నా. సత్యం subject అని, చూసేవాడు అని, నేనే సత్యమని జ్ఞానులు చెబుతారు. కనక, నా ప్రయత్నమంతా నన్ను నేను తెలుసుకోవటం వైపే, నేను నేనుగా ఉండటం వైపే ఉంటుంది. రమణమహర్షి తనలో తాను సంస్థితం కావటం అంటారు. తెలియటం కూడా కాదు, అదిగా ఉండటం. అది సర్వ దర్శనాల లక్ష్యంగా తోచింది.

ఒక ఆబ్జెక్ట్‌ని కవిత్వం చేయటంలో వెసులుబాటు ఉంటుంది. ‘నేను’కీ ఆ వస్తువుకీ మధ్యనున్న ఖాళీలో ఎన్ని ఊహలైనా, నాటకీయత అయినా, ఎంత రసమైనా చొప్పించవచ్చును. కానీ ‘నేను’ను కవిత్వం చేయటం దుస్సాధ్యం.

కానీ, ప్రసాద్ అనే నేను, ఏమీకాని నేనుగా ఉండాలనుకున్నపుడు ఆ ప్రయత్నం, వెదుకులాట, దుఃఖం, ఆనందం కవిత్వంగా మారే వీలు కలుగుతుంది. ఆ చలనాలు కేవలం బౌద్ధికం (intellectual) కాకుండా, హృదయగతమైనప్పుడు అది కవిత్వంగా పండుతుంది.

మీ కవితల్లో అధికభాగం ‘నువ్వు’ అని సంబోధిస్తూ రాస్తారు. దీనికేమైనా ప్రత్యేకమైన కారణం ఉందా?

నా కవిత్వం నాతో నేను జరిపే సంభాషణ. కవిగా ఉన్న తాను, ఒంటరి తనతో జరిపే సంభాషణలో కవి, ఒంటరి మనిషిని ఉద్దేశించి చెబుతుంటాడు. ఈ ధోరణి ఉద్దేశపూర్వకంగా కాకుండా, సహజంగా నాలో ఏర్పడిందనుకుంటాను.

గాఢమైన అనుభవంతో నిండిన ఒక మనిషి సాంత్వనగా పలుకుతున్న మాటల్లా వినపడుతుంది మీ కవిత్వం, అదే సమయంలో వాక్యాలు బోధ చేస్తున్నట్లు కూడా ఉండవు. ఇది ఎలా నిర్వహిస్తారు.

నా కవిత్వం, ముఖ్యంగా ‘ఆకాశం’తో మొదలు పెట్టి, నన్ను నేను కన్విన్స్ చేసుకునే ప్రయత్నం, జీవితాన్నీ, మనుషుల్నీ, నన్నూ ప్రేమించటానికి, మరింత లోతుగా గ్రహించటానికి. చాలాసార్లు జీవించి ఉండటానికి నన్ను నేను ఒప్పించుకునే ప్రయత్నం కూడా. నాకు నేనే ఔట్‌సైడర్‌గా ఒక బోధకుడిలా, తండ్రిలా, మిత్రునిలా, కౌన్సిలర్‌లా ఉంటూ నాకు చెప్పుకోవటం. చెప్పే నేను, వినే నేను ఒకరే గనుక ఒకరు ఎక్కువా, ఒకరు తక్కువా కారు గనక, బోధ ఉన్నా అది ఆజ్ఞలా కాక, మృదువుగా, భుజం మీద చేయి వేసి మాట్లాడినట్లు వస్తుంది.

ఒక కవిత మీలో ఎలా తయారై, ఎలా వ్యక్తమవుతుంది?

కవిత్వం నా జీవితానుభవం నుండి, చూపు నుండి, ఆర్తి నుండి పుడుతుంది. అది ఆకాశంలో మేఘాలు పుట్టినట్టు, సాంద్రమైన భావాలుగా రూపు దిద్దుకొంటూ ఉంటుంది. మేఘం బరువెక్కినపుడు ఇక కురవబోతుంది అని మనకి తెలిసినట్లే, భావ సాంద్రత ఏదో ఒక సమయంలో ఒక ఊహ ద్వారానో, వాక్యం ద్వారానో, ఉపమ ద్వారానో పదాల్లోకి కురవబోతుంది అనిపిస్తుంది. మొదటివాక్యం పూర్తవుతూ ఉండగా, రెండవ వాక్యం తెరుచుకుంటుంది. ముగింపు వరకూ అలానే నడుస్తుంది. వాన వెలుస్తుంది. కవిత్వం రాయటం అయిదు, పదినిమిషాల పని. కానీ ఆ కవితకి తయారుకావటం వెనక జీవితమంతా ఉంటుంది అనుకుంటాను.

మీ కవిత్వం మొత్తం మానసిక ప్రపంచం చుట్టూ తిరుగుతుంది. నిర్దిష్ట వస్తువుల మీదా, సమస్యల మీదా కవితలు కనపడవు. ఎందువల్ల?

జీవితంలోని విషయాల కన్నా, అన్నిటినీ కలుపుకున్న జీవితమనే అనుభవం గురించి రాయటమే, కాలక్రమేణా నాకు ఇష్టంగా, సహజంగా మారింది. మారాల్సింది విషయాలు కాదు, చూపు అని జ్ఞానులు చెప్పటం వల్ల కూడా కావచ్చును, మొత్తం జీవితాన్ని చూసే చూపు మార్చుకొనే సాధనలోనే నా కవిత్వం భాగమవుతూ వచ్చింది. కనుకనే నిర్దిష్ట వస్తువులు, సమస్యలు నా కవితల్లో కనిపించవు. ఇది కాగితం మీది బొమ్మల గురించి గాక, బొమ్మలకు ఆధారమైన కాగితం గురించి మాట్లాడటం వంటిది.

మీ కవిత్వంలో కష్టమైన సంధులుండవు, పరుష పదాలుండవు. పొడుగైన పదబంధాలు కూడా ఉండవు. వత్తులు, ద్విత్వాక్షరాలూ కూడా అరుదు. ఎందుచేత మీ భాషను ఇట్లా నిర్మించుకున్నారు?

నేను అనుభవిస్తున్న, అర్థం చేసుకొంటున్న లోతైన, సున్నితమైన విషయాలు స్పష్టంగా, తేలికగా తెలియచేయటానికి చాలా సరళమైన మీడియం అవసరం అనిపించింది. అందువలన భాష ఎక్కడా అడ్డు పడకుండా చూసుకుంటాను.

నా కవిత్వంలో భాష, ఇదిగో నేనున్నాను అనదు. తానున్నానా, లేనా అన్నంత నిశ్శబ్దంగా, నిరాడంబరంగా భావాల్ని, కవి నుండి పాఠకుడికి చేరవేస్తుంది.

పూలు, సీతాకోకలు, వాన, ఆకాశం వంటివి తరచూ మీ కవిత్వంలో కనిపిస్తాయి. ప్రత్యేక కారణం ఏమైనా?

ప్రాకృతిక దృశ్యాలు మనం జీవితమని భ్రమపడుతున్న దాని నుండి జీవించటంలోకి మేల్కొలుపుతాయి. మానవుల్ని ఆశలూ, భయాలతో నిండిన మానసిక ఉద్వేగాల నుండి విముక్తం చేసి, సంతోషమూ, నిండుదనమూ, కనికరమూ వంటి హృదయ స్పందనలలోకి తీసుకువెళతాయి. ప్రాకృతిక పదాలు సహజంగానే కవిత్వ పరిమళాన్ని కలిగి ఉంటాయి గనుక, అవి ఉపయోగించటం ఇష్టంగా ఉంటుంది.

‘‘ఈ లోకం చిటికెనవేలు పట్టుకుని ఇక్కడ ఉండటానికి భయమేమిటి, బాధేమిటి’’ అంటారు ‘సృష్టి’లో. ‘‘చాలు అన్న మాట చివర ఏముందో ఎప్పుడన్నా చూసావా’’ అని ‘ఊరికే జీవితమై’లో అంటారు. ‘‘నిశ్శబ్దంగా బ్రతికితే ఏమిటి? నిరాడంబరంగా వెళ్ళిపోతే ఏమిటి?’’ అంటారు ‘ఆకాశం’లో. ఈ పరుగుల ప్రపంచంలో ఇంత నెమ్మదికి చోటెక్కడుంది? ‘‘పోనీలే’’ అన్న మీ మాటతో పక్కకు తప్పుకుంటే ఈ పోటీ ప్రపంచాన్ని ఎదుర్కోవడమెలా?

పరుగుల ప్రపంచం లోక మోహంలో మనసు కల్పించేది. తృప్తి మనసు తనతో తాను నిండినపుడు కలిగేది. మొదటిదానిలో పడి కొట్టుకుపోతున్నాం, గనకే రెండవది నొక్కి చెప్పటం. అనుభవాలా, శాంతా ఏది చివరిది అనే చూపు నివ్వటానికి ప్రయత్నమేమో, నా రాతలన్నీ.

జీవం నిండిన మెలకువతో పగలు గడపటానికి, రాత్రులు గాఢమైన నిద్ర అవసరం. పగటికి రాత్రి వ్యతిరేకం కాదు, పూరకం. అలానే, ఘర్షణతో నిండిన జీవితంలో ఉత్సాహంగా పాల్గొనటానికి శాంతి నిండిన మనసు అవసరం. ఆ శాంతిని కలిగించే మౌలిక విలువలలో, పోనివ్వు కూడా ఒకటి.

ఆశలలో కొట్టుకుపోయే మనసుకి, చాలు అనే భావన అమృత బిందువు. అది నిరాశని, చేతకానితనాన్ని ఇచ్చే చాలు కాదు, నిండుదనాన్ని, వివేకాన్ని ఇచ్చే చాలు.

ఇంటర్వ్యూ : మానస చామర్తి 79754 68091






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి