16 డిసెంబర్ 2025

సమకాలీన వచన కవులు భక్తికవిత్వాన్ని ఎలా చూస్తున్నారు? : బివివి ప్రసాద్ తో శ్రీవల్లి రాధిక ముఖాముఖి

సమకాలీన వచన కవులలో బి.వి.వి. ప్రసాద్ గారికి తాత్త్వికతను, సత్యాన్వేషణను అందించే కవిగా పేరుంది. వారు కూడా జయంతి పత్రికలో పంచుకున్న అభిప్రాయాలలో తన కవిత్వ లక్ష్యం అదేనని చెప్పడం, భక్తి కవిత్వాన్ని గురించి కూడా ఒకటి రెండు వ్యాఖ్యలు చేయడం గమనించాను. కనుక వారిని కొన్ని ప్రశ్నలు అడగడం ద్వారా సమాకాలీన కవులు భక్తికవిత్వాన్ని ఎలా చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చుననిపించింది. 17 జూన్ 2021 నాడు వారితో ఒక ముఖాముఖి నిర్వహించాను. ఆ ప్రశ్నలను, వాటికి వారిచ్చిన సమాధానాలను ఇక్కడ అందిస్తున్నాను.

ప్రశ్న : సమకాలీన కవులలో మీకు తాత్త్విక కవులని పేరు. మీ కవిత్వం తాత్త్విక విషయాలతో నిండి ఉంటుందని మీ అభిమానులు, సహకవులు అనడం విన్నాను.

జవాబు : అవును. తాత్వికత, సౌందర్యస్పృహ నా అభిమాన విషయాలు. అన్నిసార్లూ కాదు గాని, చాలా కవితల్లో నిరపేక్షసత్యం గురించి నాకు అర్థమైన విషయాలు కవిత్వంలో చెప్పే ప్రయత్నం చేస్తాను.

నాకు అర్థమైనంతలో, అద్వైతతత్వమూ, బౌద్ధమూ కూడా అంతిమంగా ఒకటే సత్యాన్ని బోధిస్తున్నట్లు తోస్తోంది. బుద్ధుని శూన్యమూ, శంకరుని పూర్ణమూ ఒకే సత్యానికి రెండు ముఖాలు అనిపిస్తాయి. సత్యాన్ని దృశ్యంగా చూస్తే శూన్యం, ద్రష్టగా అనుభవిస్తే పూర్ణం అని నా నమ్మకం.

ఆ అంతిమసత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకునేందుకు లేదా దానిలో కరిగిపోయేందుకు చేసే సాధనని కవిత్వంగా రాస్తూ వుంటాను.

ప్రశ్న : భక్తి కూడా ఉంటుందా మీ కవిత్వంలో? భక్తి పట్ల మీ దృక్పథం ఏమిటి?

జవాబు : కవిత్వంలో ఉండదు. వ్యక్తిగతంగా నాకు భక్తి ఉంది. కానీ, కవిత్వంలో భక్తిని కాక, జ్ఞానమార్గాన్ని చెప్పాలనిపిస్తుంది.

ప్రశ్న : భక్తీ, జ్ఞానం ఒకటి కాదా?

జవాబు : కాదు, వేర్వేరు. భక్తి అంటే హృదయస్వచ్ఛత. ఉద్వేగసంబంధి. జ్ఞానం అంటే ఉన్నది ఒక్కటేననే అవగాహన. మేథోసంబంధి. భక్తిలో ద్వైతం ఉంటుంది. జ్ఞానం అంటే అద్వైతస్థితి. దానిలో భగవంతుడు, భక్తుడు అని ఇద్దరు ఉండరు.

ప్రశ్న : సిద్ధస్థితిలో భక్తికీ, జ్ఞానానికీ భేదం ఉండదంటారు కదా! అద్వైత గురువులయిన శంకరాచార్యులు, రమణమహర్షీ కూడా భక్తి రచనలు చేశారు కదా!

జవాబు : వారి స్థాయికి వచ్చినపుడు భక్తికి, జ్ఞానానికి భేదం ఉండదు. సాధన స్థితిలో భేదం ఉంటుంది. భక్తికి విశ్వాసం ప్రధానం. జ్ఞానానికి హేతుదృక్పథం ముఖ్యం.

అయితే భక్తి ద్వారా కూడా అద్వైతస్థితిని చేరవచ్చు ననుకొంటాను. భక్తి వలన హృదయశుద్ధి, దానివల్ల బుద్ధి సూక్ష్మత్వం, దానివల్ల అద్వైతానుభవమూ కలిగే వీలుందనిపిస్తుంది.

ప్రాచీనులు భక్తినీ, జ్ఞానాన్నీ అభిన్నంగా చూసినట్లు కనిపిస్తుంది. కానీ వర్తమానంలో ఆ దృష్టి మారుతోంది. ఇప్పుడు భక్తితో సంబంధం లేకుండానే, అద్వైతస్థితికి చేరినవారు కనిపిస్తున్నారు.

ప్రశ్న : సాహిత్యానికి సంబంధించినంతవరకు భక్తి, జ్ఞానాలకు భేదం ఎలా ఉంటుందంటారు?

జవాబు : సాహిత్యంలో భక్తిని చెప్తున్నపుడు సౌందర్య స్పృహ ఉంటుంది. ఒక రూపం గురించి చెప్పడం ఉంటుంది. ఉద్వేగం ఉంటుంది. ఆర్తి ఉంటుంది.

జ్ఞానం అన్నపుడు తాత్వికస్పృహ, నిర్గుణతత్త్వాన్ని చెప్పటం వుంటాయి.

నా మొదటి కవితాసంపుటి ఆరాధనలో భక్తిపరమైన కవితలు కొన్ని ఉన్నాయి. అంటే ద్వైతభావం, సౌందర్యస్పృహ కనిపించే కవితలు. అప్పట్లో నాపైన రవీంద్రుని గీతాంజలి ప్రభావం ఉండేది.

ప్రశ్న : తర్వాతి కాలంలో అటువంటి కవితలు రాయకపోవడాని కారణం ఏమిటంటారు? ఇపుడు భక్తి భావాలు కలగడం లేదా?

జవాబు : భక్తి భావం కలుగుతుంది. అరుణాచలం అన్నా, రమణమహర్షి అన్నా ఇష్టం. భక్తిపరమైన ఉద్వేగాలు కూడా కలుగుతాయి. కానీ కవిత్వంలో వాటిని వ్యక్తీకరించటం లేదు.

ప్రశ్న : దానికి కారణం చెప్తారా?

జవాబు : రెండు కారణాలున్నాయి.

ఒకటి. కవిత్వం మరొకరి కోసమే రాస్తాం. ఎంతగా మనల్ని వ్యక్తపరచుకోవటానికనీ, మన కోసమే రాసుకోవటమనీ చెప్పినా పాఠకుడిని ఉద్దేశించే మాట్లాడతాం. వాళ్ళకి అందేలా రాయాలనే అనుకుంటాం.

ఈ కాలంలో భక్తిని భక్తిలా స్వీకరించే పాఠకులు అరుదు. పాఠకులలో ఇప్పుడు రెండురకాల వారున్నారు. స్వప్రయోజనాల కోసం వారివారి నమ్మకాలని అనుసరించి ప్రార్ధనలు చేయటమే భక్తి అనుకునేవారు ఒకరు. ఒక అనంతశక్తికి చిత్తశుద్ధితో శరణాగతి చెందేవారు మరొకరు.

మొదటివారిని ఉద్దేశించి రచనలు చేసే ఆసక్తి లేదు. రెండవవారిని లక్ష్యం చేసుకుని రాసినపుడు సాకారోపాసన కన్నా, నిరాకారోపాసన తోనూ, సగుణోపాసన కన్నా, నిర్గుణోపాసనతోనూ రాయటం వలన భావాలను హేతుబద్ధంగానూ, సార్వజనీనంగానూ చెప్పే వీలుకలుగుతుందనిపించింది.

ఆకాశం సంపుటిలో రమణమహర్షి గురించి రాసిన కవితని గమనిస్తే ఈ ఎరుక ఎంతగా వుంటుందో తెలుస్తుంది. దానిలో ఎక్కడా మూఢభక్తి ఉండదు. హేతుబద్ధంగా చూసినా ఒప్పుకోగల విషయాలు మాత్రమే చెప్పాను.

ఇక కవిత్వంలో భక్తిని తీసుకురాకపోవడానికి రెండవ కారణం. బహుశా, నేను దానిని రహస్యంగా ఉంచాలనుకోవడం కావచ్చు.

ప్రశ్న : రహస్యంగా ఉంచడం ఎందుకు?

జవాబు : మన వ్యక్తిగత అనుభూతిని, ఒకరిపై మనకున్న ఇష్టాన్ని అందరికీ చెప్పాలనుకోము. భగవంతుడికీ, నాకూ ఉన్న బంధం వ్యక్తిగతం. దానిని కవిత్వంలోకి తీసుకురావడం, బాహాటంగా ప్రకటించడం ఇష్టం లేదు. అలా ప్రకటిస్తే ఆ బంధంలోని పరిమళం పోతుందనిపిస్తుంది. భక్తుడిననే అతిశయం ప్రకటిస్తూ పాఠకులకు కనిపించాలని కూడా లేదు.

ప్రశ్న : ఇపుడు మీరు చెప్పినది జ్ఞానానికీ వర్తిస్తుంది కదా!

జవాబు : నిజమే, జ్ఞానిననే అహంభావం ప్రకటిస్తున్నట్లు పాఠకులు అనుకొనే అవకాశం ఉంది.

ప్రశ్న : అదికాదండీ. జ్ఞానం విషయంలో కూడా ప్రకటనలా చేయడం ఉండదు కదా! వ్యక్తీకరణలో అలాంటి అభిప్రాయం కలగకుండా చూసుకునే ప్రతిభ ఉంటుంది కదా అని.

జవాబు : ఉంటుంది. ఒకచోట రాశాను, నాకు నచ్చిన భావాలను నీకు నచ్చిన మాటలలో చెప్పడం కవిత్వం, అని. అలానే రాయడానికి ప్రయత్నిస్తూ వుంటాను. అంటే వస్తువు మార్చుకోను. చెప్పాలనుకున్నదే చెప్తాను. కానీ, ఎలా చెబితే పాఠకులు స్వీకరించగలరో అలా చెప్తాను.

ప్రశ్న : మీరు ఇందాక భక్తి విషయంలో ఉద్వేగమూ, ఆర్తీ ఉంటాయి. జ్ఞానమార్గంలో అవి ఉండవు అన్నారు. మరి ఉద్వేగం ఉన్నపుడే పాఠకులకి దగ్గరయే అవకాశం ఎక్కువ కదా. అది లేకుండా రాసినపుడు పాఠకులను ఎలా చేరుతుంది?

జవాబు : భక్తిని అందరూ ఒప్పుకోలేరు, కనుక, భక్తిని తీసుకోనన్నాను. కానీ శాంత, కరుణ రసాలు ఉండేలా చూస్తాను కవిత్వంలో. అనుకంప కలిగేలా జాగ్రత్త పడతాను. ఆ అనుకంపన శాంతికీ, అంతిమ సత్యానుభవానికీ దారి తీసేలా చూస్తాను.

*****
థాంక్యూ Radhika T గారు..

https://sreevalliradhika.substack.com/p/e2a

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి