25 జులై 2026

కవిత : చాలవూ, కొన్ని క్షణాలు

నిజంగా, చాలవూ, నీరు నింపిన కడవలా 
హృదయం ప్రేమతో బరువెక్కిన కొన్ని క్షణాలు
ఇంత జీవితానికి అర్థం ప్రసాదించడానికి

ఉదయాకాశంలో ఎవరో 
బంగారు రజను నింపిన బిందెను 
వదిలేసి వెళ్ళారు, చూడు
గగనం నిండా గాలికి చెదురుతోంది బంగారుపొడి 
ప్రేమతో ఒకసారి నిండిన నీ కడవ కూడా అంతే
జీవితం నిండా చల్లుతుంది ప్రేమ రజను

భయాల దుర్గమారణ్యాల గుండా,
కరుణ లేని ఎడారుల గుండా నడుస్తూ,
భీతావహ నేత్రాల జలధారలు వర్షిస్తూ
ఎన్ని పవళ్ళు, రాత్రులు 
జీవితాన్ని అభిషేకించి ఉంటావు 
నీ హృదయమంతా 
ప్రేమ నిండిన అనుభవమై పండే వరం కోసం

మరీ కొన్ని క్షణాలు, 
కనుకొలకుల జలజలరాలే ఆనంద బాష్పాలతో
నీ చుట్టూ దిగులుగా తిరిగే గాలిని
తడితడిగా పలకరిస్తే చాలు

నువు నిలువునా కరిగి నీరైపోయిన క్షణాలు,
దయామేఘాలు తల్లిలా హత్తుకున్న క్షణాలు,
మనుషులంతా పసివాళ్ళలానో, వెర్రివాళ్ళలానో 
నీ క్షమకి నోచుకున్న క్షణాలు

బహుశా, నీ ఉనికిని, నీ జీవితాన్ని
నువు మనసారా క్షమించిన క్షణాలు

బివివి ప్రసాద్
ప్రచురణ : కవిసంధ్య, జూలై 26





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి