03 ఫిబ్రవరి 2017

అలవాటు

ఒకరోజు రోజువారీ పనుల్లోంచి బయటపడిచూడాలి
మన వలయం మీద మనమే తిరుగుబాటు చేసి స్వేచ్ఛను ప్రకటించాలి

వాహనం విడిచి కాలినడకన తిరగాలి
రోజూ చూసే తెలియని మనిషిని మొదటిసారి పలకరించాలి
బరువులన్నీ కాసేపు గాలికొదిలి, పగలంతా నిద్రపోవాలి. ఒక రాత్రి మేలుకోవాలి

ఆకాశాన్ని ఈ చివరనుండి ఆ చివరికి కొలిచి చూడాలి
దేవుడేమైనా ఇటీవల ఆకాశం కొలత మార్చాడేమో ఆలోచించాలి
చిననాటి నక్షత్రాలకీ, ఇప్పటికీ లెక్క సరిపోయిందో, లేదో సరిచూసుకోవాలి

ఒంటరిగా కూర్చుని ఒకసారి నవ్వి చూసుకొని
మన నవ్వుకేమైనా మరామతు అవసరమేమో పరిశీలించాలి
ఏడవటం మరిచామో, ఏమో కాసేపు కన్నీరు రాల్చాలి

ఏదో ఒకటి అసలు ఎందుకు చేయాలో ఆలోచించాలి
ఆలోచన ఆగిపోతే ఏం జరుగుతుందో ప్రశాంతంగా గమనించాలి

ప్రపంచం మాయో, కాదో తెలియదు కాని అలవాటు మహామాయ
తిమ్మిరిలా అది క్రమ్మిందంటే
బ్రతుకు అందమూ తెలియదు, బాధా తెలియదు
దానిని విదిలించుకొని చూస్తే మరలా పుట్టినట్లుంటుంది

జీవనానందం తెలియాలంటే ఏదీ అలవాటు కాకుండా బ్రతకాలి
ఎప్పుడూ అలవాట్లకి జారబడకుండా నిలబడి ఉండాలి
బ్రతికివుండటం మాత్రమే అలవాటు కావాలి

తీరం వదిలిన దేన్నైనా ప్రవాహం తీసుకుపోయినట్లు
అలవాట్లను వదిలితే చాలు
జీవితం తనతో మనల్ని తీసుకుపోతుంది


10.3.2011
____________
'ఆకాశం' నుండి

31 జనవరి 2017

గేదెలు

పొలంలో కట్టుతాడు విప్పగానే గేదెలు
నిధి ఏదో దొరికినట్టు గంతులేస్తూ పరుగు తీసాయి
వాటి పట్టరాని సంతోషం చూస్తే 
దేవుడు కాసేపు వాటికి రెక్కలిస్తే బావుండుననిపించింది

ఎందుకంత గెంతుతున్నాయి అని మిత్రుడినడిగితే 
అవి స్వేచ్చ దొరికిందని సంబరపడుతున్నాయి 
తీరా ఇంటికి వెళ్ళాక మళ్ళీ కట్రాళ్ళ దగ్గర నిలబడతాయని చెప్పాడు 

కొంచెం దూరం పోయాక వాటిని చూస్తే గంతులాపి 
వెనక్కి నడుస్తున్నట్టుగా ముందుకి నడుస్తున్నాయి 
మళ్ళీ స్వేచ్చ హరించుకుపోయే సమయం ముందుందని  
ఆపాటికి జ్ఞానోదయం కలిగినట్టుంది 

ఈ మాత్రానికి తొందరెందుకని 
స్వేచ్చాసమయాన్ని ఒక్కొక్క అడుగేస్తూ నెమరేస్తున్నాయి

గేదెలని చూస్తే నవ్వూ, జాలీ పుట్టాయి కాని 
మనల్ని చూసుకొంటే అవి కూడా రావు 

ఇక కానివ్వమని కట్రాళ్ళ దగ్గర నిలబడితే 
ఎవరో ఒకరు వాటిని కట్టాలి 

మనం తెలివైన వాళ్ళం గనుక మనల్నెవరూ కట్టనక్కరలేదు 
మనల్ని మనమే శ్రద్ధగా, జాగ్రత్తగా బంధించుకొంటాం 


23.3.2011
_______
'ఆకాశం' నుండి   

29 జనవరి 2017

చివర చూసినవాడు

ఆనందిస్తే ఆకాశం పట్టనట్లు ఆనందించాలి
రోదిస్తే ప్రతి అణువూ కరిగిపోయేటట్లు రోదించాలి

ఏది చేసినా పూర్తిగా చేయాలి
ఏదో ఒకటే చేయాలి
ఇంక ఏమీ మిగలనట్టు చేయాలి 

సున్నితంగా ఉంటే ఆకాశం తాకినా చలించిపోవాలి
కఠినంగా ఉంటే అణువైనా చొరబడలేనంత కఠినం కావాలి

తానే ఉన్నాననుకొంటే ఆకాశమైనా అవసరం లేనట్లుండాలి
తలవంచితే ప్రతి అణువుకీ ప్రార్ధనగా నమస్కరించాలి

ఏది చేసినా చివరికంటా చేయాలి
తల్లివేరు మొదటికైనా, చిటారుకొమ్మకైనా చేరుకోవాలి

ఊహిస్తే ఆకాశం అంతా ఊహించాలి 
చూస్తే అణువు వరకూ చూడాలి  

తర్కమైనా, నమ్మకమైనా వాటి చివర చూడాలి
ఒక చివర చూసినవాడికి రెండవచివర వద్దన్నా తెలుస్తుంది
సృష్టివలయాన్ని దాటినవాడికి విలయసౌందర్యం స్ఫురిస్తుంది  

చివరచూసినవాడు మాత్రమే ప్రపంచరహస్యాల ముడి విప్పగలడు
చావు పుట్టుకలను బొమ్మలుచేసి ఆడుకోగలడు
అతను రావాలనుకొంటే వస్తాడు, వెళ్ళాలనుకొంటే వెళతాడు

మనకన్నీ కావాలి. సగాలూ, పాతికలూ, విరిగినవీ, పగిలినవీ
మనకైనా అర్థంకాని మన కొలతల మేరకి
మసకచీకటిలో దాగినట్టు వీటన్నిటివెనకా మనల్ని దాచుకొంటాం

మన కొలతలకి అందనిదేదో 
మనల్ని కావాలంటే ఇక్కడికి విసిరేస్తుంది
వద్దనుకొంటే వెనక్కు లాగేస్తుంది


30.12.2010 
____________ 
'ఆకాశం' నుండి  

07 నవంబర్ 2016

వాన కురిస్తే..

వాన కురుస్తున్నపుడు  
చినుకుదీపంలా మెలకువ కనులు విప్పుతుంది
బతికినకాలాల తలపులేవో తడితడిగా వెలుగుతుంటాయి

వాన జారుతుంటే
ఉక్కపోతలా బిగిసిన దిగుళ్ళు కరిగి 
‘ఏమీలే దింతే జీవిత’మంటూ మట్టివాసనల నిట్టూర్పులై విచ్చుకొంటాయి  

వాన రాలితే చాలు 
ఎండుటాకులు గాలిలో ఆడుకొంటూ వాలినట్టు
వానతెరలు భూమిని ముద్దాడితే చాలు, 
బడిపిల్లలు బిలబిలా పరిగెత్తినట్టు చినుకులు కురిస్తే చాలు
అమ్మలో భద్రంగా తేలుతున్నట్టు 
సృష్టిలో నీ ఆత్మ ఎగురుతూ వుంటుంది

కాస్త వాన చాలు
ఇంద్రధనువుని నింగివైపు  సారించే కాసిని చినుకులు చాలు
నీలోంచి ప్రపంచమూ, ప్రపంచంలోంచి నువ్వూ
వింతఖాళీలోకి విసిరివేయబడతారు
___

ప్రచురణ : వాకిలి

24 అక్టోబర్ 2016

బివివి ప్రసాద్ కు తిలక్ అవార్డ్ : వీడియోలు

ప్రార్ధన : https://www.youtube.com/watch?v=mESpJVEABxM

 



శ్రీ కొప్పర్తి : https://www.youtube.com/watch?v=uY5jUTvOD3U

శ్రీ రసరాజు : https://www.youtube.com/watch?v=dJx-zsx3g3w
   
 శ్రీ ప్రసాదమూర్తి : https://www.youtube.com/watch?v=5lAA3sxvESc

శ్రీ జీయస్వీ నరసింహారావు : https://www.youtube.com/watch?v=j0WOD7htUgU
శ్రీ అక్కిపెద్ది రామసూర్యనారాయణ : https://www.youtube.com/watch?v=2iEmH5KTMfs
డాక్టర్ జీవీ సత్యనారాయణ : https://www.youtube.com/watch?v=oHJz8hbIte4

శ్రీ యమ్మెస్ సూర్యనారాయణ 

బివివి ప్రసాద్ : https://www.youtube.com/watch?v=4QCYdZghtv8

శ్రీ జి ఎల్ ఎన్ మూర్తి